1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 12 జులై 2022 (19:28 IST)

James Webb Space Telescope: కాలంలో వెనక్కి వెళ్లిన జేమ్స్ వెబ్.. కోట్ల సంవత్సరాల క్రితం గెలాక్సీని ఫొటో తీసిన సూపర్ టెలిస్కోప్

James Webb Space Telescope galaxy photo
విశ్వాన్ని మరింత లోతుగా పరిశీలించేందుకు, కాలంలో వెనక్కి వెళ్లి చూసేందుకు తయారు చేసిన సూపర్ టెలిస్కోప్ 'జేమ్స్ వెబ్' తీసిన మొదటి ఫొటోను విడుదల చేశారు. అంచనాలకు అనుగుణంగానే ఈ టెలిస్కోప్ ఫొటోలు తీసిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వైట్ హౌస్ బ్రీఫింగ్‌లో భాగంగా ఈ టెలిస్కోప్ తీసిన కలర్ ఫొటోను అధ్యక్షుడు జో బైడెన్ చూశారు. ఇప్పటి వరకు విశ్వాన్ని అత్యంత లోతుగా, వివరణాత్మకంగా చూపించిన పరారుణ (ఇన్‌ఫ్రారెడ్) దృశ్యంగా ఈ ఫొటోను వర్ణించారు. గెలాక్సీల నుంచి ఈ దృశ్యం మనకు చేరడానికి బిలియన్ సంవత్సరాలు పట్టిందని చెబుతున్నారు.

 
ఈ చిత్రాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వైట్‌హౌజ్‌లో వీక్షించారు. జేమ్స్ వెబ్ తీసిన మరిన్ని చిత్రాలను నాసా మంగళవారం విడుదల చేయనుంది. ''అమెరికా గొప్ప పనులు చేయగలదని ఈ చిత్రాలు, ప్రపంచానికి గుర్తు చేయబోతున్నాయి. మన సామర్థ్యానికి మించినది ఏదీ లేదని అమెరికా ప్రజలకు, ముఖ్యంగా మా చిన్నారులకు ఇవి గుర్తు చేస్తాయి'' అని బైడెన్ వ్యాఖ్యానించారు. ''ఇంతకుముందు వరకు ఎవరూ చూడని అవకాశాలను మనం చూడొచ్చు. ఇప్పటివరకు ఎవరూ వెళ్లని ప్రదేశాలకు మనం వెళ్లవచ్చు'' అని బైడెన్ వ్యాఖ్యానించారు.

 
1000 కోట్ల డాలర్ల (దాదాపు రూ. 75,000 కోట్లు) వ్యయంతో నాసా నిర్మించిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (జేడబ్ల్యూఎస్‌టీ)ను గతేడాది డిసెంబర్ 25న ప్రయోగించారు. దీన్ని ప్రఖ్యాత హబుల్ స్పేస్ టెలిస్కోప్‌కు వారసుడిగా భావిస్తున్నారు. ఆకాశాన్ని అన్ని విధాలుగా ఇది పరీక్షిస్తుంది. కానీ, దీనికి రెండు ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి. అందులో ఒకటి, 1350 కోట్ల సంవత్సరాల క్రితం ఈ విశ్వంలో తొలిసారిగా మిణుకుమన్న నక్షత్రాలను ఫొటో తీయడం. రెండోది, ఇతర గ్రహాలు నివాసయోగ్యంగా ఉన్నాయో లేదో గుర్తించడం. బైడెన్ ముందు విడుదల చేసిన తొలి ఫొటో ద్వారా వెబ్ టెలిస్కోప్, దానికి నిర్దేశించిన తొలి లక్ష్యాన్ని సాధించగల సామర్థ్యాలను ప్రదర్శించినట్లయింది.

Group of galaxies
ఫోటో కర్టెసీ-నాసా
మీరు చూస్తోన్న ఆ చిత్రం గెలాక్సీల సమూహానిది. ఈ సమూహం ఎస్ఎంఏసీఎస్ 0723 అనే పేరున్న వోలాన్స్ దక్షిణార్థగోళంలో ఉంది. ఈ గెలాక్సీల సమూహం భూమికి 460 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. వెబ్ టెలిస్కోప్‌లో 6.5 మీ వెడల్పున్న గోల్డెన్ మిర్రర్లు, సూపర్ సెన్సిటివ్ ఇన్‌ఫ్రారెడ్ పరికరాలు అమర్చారు. వీటి సహాయంతో బిగ్‌బ్యాంగ్ ఏర్పడిన 600 మిలియన్ సంవత్సరాల తర్వాత ఉనికిలో ఉన్న గెలాక్సీల వక్రీకరణ రూపాన్ని (రెడ్ ఆర్క్) ఇది గుర్తించగలిగింది. వెబ్ టెలిస్కోప్ తీసిన ఈ చిత్రం నాణ్యతను చూసిన శాస్త్రవేత్తలు, ఇది మరింత లోతుగా విశ్వాన్ని పరిశీలిస్తోందని చెబుతున్నారు.

 
ఇప్పటివరకు పొందిన వాటికన్నా లోతైన కాస్మిక్ వీక్షణ ఇదే అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ''కాంతి, సెకనుకు 1,86,000 వైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఆ చిన్న మచ్చల్లోని ఒకదానిపై మీరు చూస్తోన్న కాంతి, 13 బిలియన్ సంవత్సరాలకు పైగా వేగంతో ప్రయాణిస్తోంది. ఈ విధంగా మనం మరింత వెనుకకు వెళ్తున్నాం. ఇది మొదటి చిత్రమే. అది పదమూడున్నర బిలియన్ సంవత్సరాల వెనక్కి వెళ్తోంది. ఈ విశ్వం వయస్సు 13.8 బిలియన్ సంవత్సరాలు అని మనకు తెలుసు. కాబట్టి, మనం దాదాపు విశ్వం ఆరంభానికి వెళ్తున్నాం'' అని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నీల్సన్ అన్నారు.

 
ఇలాంటి చిత్రాన్ని తీయడాని హబుల్ వారాల సమయం తీసుకునేది. కానీ, వెబ్ టెలిస్కోప్ 12.5 గంటల పాటు పరిశీలించిన తర్వాత దీన్ని గుర్తించింది. నాసాతో పాటు దాని అంతర్జాతీయ భాగస్వాములైన యూరప్, కెనడా స్పేస్ ఏజెన్సీలు మంగళవారం వెబ్ తీసిన మరిన్ని కలర్ ఫొటోలను విడుదల చేయనున్నాయి. సౌర వ్యవస్థ వెలుపలి ఇతర గ్రహాల అధ్యయనం, వెబ్ టెలిస్కోప్‌కు నిర్దేశించిన మరో లక్ష్యం. భూమికి 1000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న 'డబ్ల్యూఏఎస్‌పీ-96బి' అనే ఒక పెద్ద గ్రహం వాతావరణాన్ని వెబ్ విశ్లేషించింది. ఆ గ్రహం పరిస్థితుల గురించి వెబ్ సమాచారం అందించనుంది.

 
వెబ్ టెలిస్కోప్, తనకు నిర్దేశించిన లక్ష్యాలను నేరవేరుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని నాసా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ''నేను టెలిస్కోప్ తీసిన మొదటి చిత్రాలను చూశాను. అవి అద్భుతంగా ఉన్నాయి. వాటితో మేం చేయబోయే విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన పరిశోధనలను తల్చుకుంటే చాలా ఉత్తేజంగా ఉంది'' అని డిప్యూటీ ప్రాజెక్ట్ సైంటిస్ట్ డాక్టర్ అంబర్ స్ట్రాన్ అన్నారు. వెబ్ టెలిస్కోప్ ప్రాజెక్ట్ ప్రోగామ్ సైంటిస్ట్ డాక్టర్ ఎరిక్ స్మిత్. కొత్త టెలిస్కోప్ ప్రాధాన్యత ప్రజలకు ఇప్పటికే అర్థమైపోయిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ''వెబ్ డిజైన్, అది కనిపించే తీరు, ఈ ప్రాజెక్ట్ పట్ల ప్రజలు ఆకర్షితులయ్యేందుకు కారణాలు అని నేను అనుకుంటున్నా'' అని ఆయన తెలిపారు.

 
టెలిస్కోప్ తీసిన చిత్రాలను ప్రదర్శించడానికి నాసా మంగళవారం వెబ్‌కాస్ట్‌ను నిర్వహిస్తోంది. నాసా ప్రదర్శించే ఈ ప్రజెంటేషన్‌ను మీరు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వెబ్ టీవీ చానెల్ ద్వారా చూడొచ్చు. ఈ కార్యక్రమం స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:45 గంటలకు (భారత్‌లో రాత్రి 7:15 గంటలకు)కు ప్రారంభం అవుతుంది. కెనడియన్ స్పేస్ ఏజెన్సీ యూట్యూబ్ చానెల్, నాసా లైవ్ ద్వారా కూడా దీన్నిచూడొచ్చు. శుక్రవారం ఉదయం 12:30 గంటలకు (భారత కాలమానం) బీబీసీ టీవీలో సూపర్ టెలిస్కోప్: మిషన్ టు ద ఎడ్జ్ ఆఫ్ ద యూనివర్స్ పేరిట ప్రత్యేక కార్యక్రమం ప్రసారం అవుతుంది.