సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 1 జులై 2022 (11:50 IST)

July 1: ఈరోజు నుంచే వారానికి 4 రోజులే పని, 3 రోజులు సెలవు, ఉద్యోగుల జీవితాల్లో, జీతాల్లో వచ్చే మార్పులు ఇవే

Work From Home
భారత ప్రభుత్వం జులై 01, 2022నుంచి కొత్త కార్మిక చట్టాలను అమలు చేయాలని చూస్తోంది. కార్మికుల కోసం కేటాయించిన మొత్తం 29 చట్టాలను కలిపి నాలుగు కోడ్‌లుగా మార్చింది. ఇందులో నాలుగు చట్టాలను వేతన కోడ్, 9 చట్టాలను సోషల్ సెక్యూరిటీ కోడ్‌, 13 చట్టాలను ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్, వర్కింగ్ కండిషన్స్ కోడ్, మరో 3 చట్టాలను ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్‌లుగా రూపొందించింది. ఈ కోడ్ ప్రయోజనాలు సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులందరికీ అందుతాయని ప్రభుత్వం చెబుతుండగా, వీటి వల్ల కార్మికులకు, ఉద్యోగులకు వాటిల్లే నష్టం ఎక్కువని కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. ఈ కోడ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించదు. ఈ కొత్త చట్టం ద్వారా ఉద్యోగుల జీవితాల్లో వచ్చే ప్రధాన మార్పులేంటి?

 
నెల జీతం
కొత్త కోడ్ ప్రకారం ఉద్యోగి గ్రాస్ జీతంలో 50% బేసిక్ పే ఉండాలని చెబుతోంది. పి.ఎఫ్‌కు ఇచ్చే వాటా పెరుగుతుంది. దీంతో, కొంత మంది ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగుల చేతికొచ్చే జీతం తగ్గిపోయే అవకాశముందని కార్మిక సంఘ నాయకులు చెబుతున్నారు. రిటైర్మెంట్ తర్వాత వచ్చే పి.ఎఫ్, గ్రాట్యుటీ పెరుగుతాయి. పదవీ విరమణ తర్వాత ఉద్యోగులు మెరుగైన జీవితం గడిపేందుకు ఇది తోడ్పడుతుందని ప్రభుత్వం చెబుతోంది. "ఇప్పటివరకూ మీ వేతనంలో 50 శాతం బేసిక్ సాలరీగా, మిగతా 50 శాతం అలవెన్సెస్ అంటే భత్యంగా లభిస్తూ ఉంటే, కొత్త నియమాల వల్ల మీపై ఎలాంటి ప్రభావం పడదు" అని ట్యాక్స్ ఎక్స్‌పర్ట్ గౌరీ చద్ధా గతంలో బీబీసీకి చెప్పారు. ఈ కోడ్‌ను అనుసరించి పురుషులకు, మహిళలకు సమాన వేతనాలు ఇవ్వాలి. అయితే, ఇవన్నీ సంస్థలకు, ప్రభుత్వానికి మాత్రమే లాభాన్ని చేకూర్చే చర్యలని సీఐటీయూ జాతీయ కార్యదర్శి సింధు బీబీసీతో అన్నారు.

 
పని గంటలు
కొత్త కార్మిక చట్టాలు అమలులోకి వస్తే, ఉద్యోగుల పని గంటల్లో కూడా మార్పులు వస్తాయి. ప్రస్తుతం చాలా సంస్థల్లో 8-9 పని గంటలు ఉండగా అవి 12 గంటల వరకు పెంచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ సీఐటీయూ అధ్యక్షుడు నర్సింగరావు చెప్పారు. కొత్త చట్టం ప్రకారం వారానికి పని 48 గంటలకు మించకూడదు. వారంలో చేయాల్సిన పని గంటల్లో కొత్తగా వచ్చిన మార్పేమీ లేదని హైదరాబాద్‌కు చెందిన బిజినెస్ అనలిస్ట్ కే నాగేంద్ర సాయి చెప్పారు. "కొత్త చట్టాల ప్రకారం రోజుకు 12 గంటల పనిని నాలుగు రోజుల పాటు చేయించుకుంటే సరిపోతుంది. అప్పుడు వారానికి మూడు రోజుల సెలవు తీసుకోవచ్చు. కానీ, దీని వల్ల ఉద్యోగి ఆరోగ్య, కుటుంజ జీవితంపై కూడా ప్రభావం పడుతుంది. దీని వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు" అని సాయి అన్నారు.

 
ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్, వర్కింగ్ కండీషన్స్ కోడ్ లోని సెక్షన్ 25 (1) ఉద్యోగులు రోజుకు 8 గంటలు మించి పని చేయకూడదని పేర్కొంది. కానీ, 25(1) (బి) సంస్థలు ఉద్యోగులతో 12 గంటల వరకు ఉద్యోగులతో పని చేయించుకోవచ్చని చెబుతోంది. సంస్థ యజమానులు ఎటువంటి నిబంధనలు లేకుండా పని గంటలను 12 గంటలకు మించి పెంచే విస్తృత అధికారాలను ఇస్తోందని నర్సింగరావు చెబుతున్నారు. సెక్షన్ 26(1) ప్రకారం ఉద్యోగులు వారంలో ఆరు రోజులను మించి పని చేయకూడదు. కానీ, సెక్షన్ 26(2) ఈ నిబంధన సడలించే అధికారాన్ని ప్రభుత్వానికి ఇస్తోంది. వారాంతపు సెలవులు లభించని పక్షంలో ఆ ఉద్యోగికి రెండు నెలల లోపు అందుకు పరిహారంగా సెలవులు ఇవ్వాల్సి ఉంటుంది.

 
ఓవర్ టైం
గతంలో నెలకు 50 గంటలు ఉండే ఓవర్ టైం (అదనపు పని గంటలు) కొత్త నిబంధనలు అమలులోకి వస్తే 125 గంటల వరకు పెరుగుతుంది. అయితే, ఓవర్ టైం పని చేసేందుకు ఉద్యోగి అనుమతి కూడా అవసరం లేదు. కొత్త కోడ్‌లో ఓవర్ టైం ఎన్ని గంటలు చేయించుకోవచ్చనే విషయం పై ఎటువంటి నిబంధనలు లేవని కార్మిక సంఘ నాయకులు అంటున్నారు. ఉద్యోగులతో అదనపు గంటలు పని చేయించుకునేందుకు సంస్థల యజమానులకు పూర్తి హక్కులను ఇస్తోంది. ఓవర్ టైంకు చెల్లించాల్సిన వేతనాల గురించి కూడా ఈ కోడ్ నిర్వచించలేదని నర్సింగరావు అంటున్నారు.

 
సెలవులు
సెలవులు పొందేందుకు ఉద్యోగులు సంవత్సరంలో 180 రోజులు పని చేస్తే సరిపోతుంది. గతంలో 240 రోజులు పని దినాలు ఉండవలసి వచ్చేది. ఉద్యోగికి లభించే మొత్తం సెలవుల్లో ఎటువంటి మార్పు ఉండదు.

 
అన్ని రంగాల్లోనూ మహిళలు
కొత్త చట్టాలు మహిళలకు అన్ని రంగాల్లోనూ పని చేసే హక్కును కల్పిస్తున్నాయి. వారి అంగీకారంతో నైట్ షిఫ్ట్‌లలో కూడా పని చేయించుకోవచ్చు. అయితే, అందుకు తగిన భద్రత, పని ప్రదేశాల్లో సౌకర్యాలను సంస్థల యజమానులు కల్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వం చెబుతున్నట్లు ఈ కోడ్‌లు కార్మికుల ప్రయోజనాల కోసం కాదని నర్సింగరావు అంటున్నారు. ఈ మార్పులన్నీ పెట్టుబడిదారీ వర్గాల ప్రయోజనాలు, కార్పొరేట్ల ఆదాయం పెంచుకోవడం కోసమే అని కార్మికసంఘ నాయకులు అంటున్నారు.

 
ప్రావిడెంట్ ఫండ్
భారత్‌లో ఇప్పటివరకూ ఎక్కువ కంపెనీలు ప్రావిడెంట్ ఫండ్ కింద బేసిక్ సాలరీలో 12 శాతం అందిస్తున్నాయి. కొత్త నిబంధన ప్రకారం బేసిక్ పెరుగుతుంది. "గ్రాస్ శాలరీలో బేసిక్ శాలరీ కనీసం 50 శాతానికి పెంచాల్సి ఉంటుంది కాబట్టి ప్రావిడెంట్ ఫండ్ వాటాలో అటు ఉద్యోగి షేర్, ఇటు కంపెనీ షేర్ కూడా పెరుగుతుంది. కంపెనీలపై కొద్దిగా భారం తప్పకపోవచ్చు. అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వానికి నెలనెలా ఈపీఎఫ్ ద్వారా కాస్త ఎక్కువగా డబ్బు జమ అవుతుంది" అని సాయి అన్నారు. ఉద్యోగికి కొత్త నిబంధనలతో గ్రాట్యుటీ కూడా ఎక్కువగా లభిస్తుంది. గ్రాట్యుటీ లెక్కించే విధానంలో కూడా మార్పులు వస్తాయని కోడ్ పేర్కొంటోంది. గ్రాట్యుటీ చెల్లించేందుకు సంస్థలో కనీస సర్వీస్ చేయాల్సిన అవసరాన్ని తొలగించారు. ఇది ఫిక్స్డ్ టెర్మ్ ఉద్యోగులకు వర్తిస్తుంది. ఫిక్స్డ్ టర్మ్ పని చేసే ఉద్యోగులకు కూడా పెర్మనెంట్ ఉద్యోగుల మాదిరిగానే సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్ అందుతుంది.

 
హెల్త్ ఇన్సూరెన్సు
అన్ని రంగాల్లో పని చేసే ఉద్యోగులు ఈఎస్‌ఐ పరిధిలో ఉన్న ఆసుపత్రులు, క్లినిక్ లలో ఉచిత వైద్యం పొందవచ్చు. ఈఎస్‌ఐ ఆసుపత్రులను, శాఖలను జిల్లా స్థాయిలో కూడా విస్తృతం చేస్తారు. ప్లాంటేషన్ కార్మికులకు కూడా ఈఎస్‌ఐ ప్రయోజనాలు వర్తిస్తాయని ప్రభుత్వం చెబుతోంది. ఈఎస్‌ఐ, పి.ఎఫ్, కోసం ఒకే యూనివర్సల్ అకౌంట్ నంబర్ ఉంటుంది. దీనిని ఆధార్‌తో అనుసంధానం చేస్తారు.

 
ఫిక్స్డ్ టెర్మ్ ఉద్యోగం
ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ సెక్షన్ 2 ఫిక్స్డ్ టర్మ్ (నిర్ణీత కాల పరిమితి) ఉద్యోగాన్ని చట్టబద్ధం చేస్తుంది. సంస్థలు ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్టు కింద ఉద్యోగులను నియమించుకోవచ్చు. ఈ పరిమితి పూర్తవ్వగానే, ఉద్యోగులకు ఎటువంటి నోటీసు, పరిహారం ఇవ్వకుండా ఉద్యోగంలోంచి తొలగించవచ్చు. అయితే, వీరికి కూడా పెర్మనెంట్ ఉద్యోగుల మాదిరిగానే, ఒక సంవత్సరం పాటు విధులు నిర్వహిస్తే గ్రాట్యుటీకి అర్హత సంపాదిస్తారు. కాంట్రాక్టును 11 నెలలకే ఇస్తే, గ్రాట్యుటీ పొందేందుకు అర్హత ఉండదు. సంస్థల యజమానులు ఈ విధానాన్ని తమ ప్రయోజనానికి వాడుకుంటాయని సింధు అంటారు.

 
జాతీయ పోర్టల్
జాతీయ పోర్టల్‌లో కార్మికులందరూ ఇంటర్ స్టేట్ మైగ్రంట్ కార్మికులుగా నమోదు చేసుకోవచ్చు. దీని వల్ల జాతీయ స్థాయిలో అమలులో ఉన్న సోషల్ సెక్యూరిటీ పథకాలను పొందే ప్రయోజనం ఉంటుంది. ఇతర రాష్ట్రాల్లో పని చేసే కార్మికులు ఏడాదికొకసారి సొంత ఊరు వెళ్లేందుకు ప్రయాణ చార్జీలను ఇవ్వాల్సి ఉంటుంది. కార్మికులందరికీ తప్పనిసరిగా అపాయింట్ మెంట్ లెటర్లు ఇవ్వాలని కోడ్ చెబుతోంది.

 
వర్క్ ఫ్రమ్ హోమ్
సర్వీస్ రంగంలో ఉన్న ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. "ఈ చట్టాల అమలు కోసం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రత్యేక లేబర్ చట్టాలను ఏర్పర్చుకోవడం కూడా ప్రధాన అడ్డంకిగా మారొచ్చు. కంపెనీలు రాష్ట్రాల పరిధిలోని షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ కింద రిజిస్టర్ చేసుకుంటే వాళ్లకు ఆ రాష్ట్ర సంబంధ చట్టాలు వర్తిస్తాయి. కంపెనీస్ యాక్ట్ కింద రిజిస్టర్ చేసుకున్న కంపెనీల్లోని ఉద్యోగులు రోజుకు 9 గంటలకు మించి పనిచేయడానికి వీల్లేదు" అని సాయి అన్నారు. "పెరుగుతున్న కార్పొరేటీకరణ, విదేశీ సంస్థల ఉద్యోగాలు, పెట్టుబడుల నేపధ్యంలో సరళమైన కార్మిక చట్టాలను ఉండాలనేది ప్రభుత్వ ఆలోచన. దీని వల్ల మల్టీ నేషనల్, కార్పొరేట్ సంస్థలకు ఊరట లభిస్తుంది" అని చెప్పారు. "కొత్త చట్టాలు కార్మికుడిని బానిసలా మారుస్తాయి" అని నర్సింగరావు అన్నారు.