బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : మంగళవారం, 1 అక్టోబరు 2019 (12:11 IST)

నేను డ్యాన్సు చేస్తా, ఐతే నాకు జంటగా నా చేతికర్రే ఉంటుంది: గాంధీజీ

మహాత్మా గాంధీజీ ప్రస్తావన వస్తే, మనకు తరచూ మనసులో రెండు రకాల విషయాలు గుర్తుకొస్తాయి. ఒకటి మొండి పట్టుదల ఉన్న గాంధీజీ వ్యక్తిత్వం, రెండోది చేతికర్ర, కళ్లజోడు, గడియారం లాంటి ఆయన వస్తువులు. అయితే, వాటితోపాటు గాంధీజీకి సంబంధించిన విషయాలు జనానికి పెద్దగా తెలియనివి చాలానే ఉన్నాయి. ఉదాహరణకు సంగీతం అంటే గాంధీజీకి చాలా ఇష్టం.

 
సంగీతం భాగం కానంతవరకూ భారత స్వాతంత్య్రోద్యమం సఫలం కాలేదని గాంధీజీ భావించేవారు. సంగీతం లేకపోవడం వల్లే స్వాతంత్ర్య పోరాటం అంత బలంగా నడపలేకపోయామని ఆయన అనుకునేవారు. సత్యాగ్రహం ప్రజలందరినీ ఏకం చేసే ఒక మార్గంగా గాంధీజీ భావించారు. ఆయన ఎక్కువగా నర్సింహ మెహతా రాసిన 'వైష్ణవ జనతో' గీతాన్ని పాడేవారు. అది ఆయనకు ఇష్టమైన భజన.

 
'వైష్ణవ జనతో' తర్వాత 'రఘుపతి రాఘవ రాజారాం' పాడేవారు. దానిని మిశ్రా సమాజం వారు ముద్రించారు. ఎంఎస్ సుబ్బులక్ష్మి, పండిట్ జస్‌రాజ్ దానికి బాణీ కట్టి, ఆలపించారు. గాంధీజీ అక్కడితో ఆగిపోలేదు. ఆయనకు మిగతా అన్నిరకాల పాటలంటే కూడా చాలా ఆసక్తి ఉండేది. ఉదాహరణకు, ఆయన యరవాడ జైలులో ఉన్నప్పుడు దళితుల కోసం ఉద్యమం చేశారు. వారి కోసం ఆమరణ నిరాహారదీక్షకు కూర్చునేముందు, ఆయన సర్దార్ పటేల్, మహాదేవ్ దేశాయ్‌ని పిలిపించి, ఒక పాట పాడడం మొదలెట్టారు.

 
గాంధీజీ అప్పుడు 'ఉట్ జాగ్ ముసాఫిర్' (ప్రయాణికుడా మేలుకో..) అనే గీతం పాడారు. సర్దార్ పటేల్, మహాదేవ్ దేశాయ్ కూడా దానిని అందుకున్నారు. తర్వాత జైల్లో ఉన్న ఖైదీలందరూ వారితో గొంతు కలిపారు. అలా గాంధీజీ ప్రారంభించిన ఆ గీతం ఆ జైలంతా ప్రతిధ్వనించింది. గాంధీజీకి సంగీతం అంటే ఎంత ఇష్టమో చెప్పే ఒక ఆసక్తికరమైన ఘటన ఉంది. హిందుస్థానీ సంగీతంతోపాటు, తనకు విదేశీ, పాశ్చాత్య సంగీతం కూడా ఇష్టమే అని బాపూజీ చెప్పేవారు.

 
రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కోసం గాంధీజీ లండన్‌లో ఉన్నప్పుడు ఆయన మురియల్ లేస్టర్‌లో ఉండేవారు. అక్కడ తూర్పు లండన్‌లో కింగ్‌స్లే హాల్ అనే ఒక ఆశ్రమం ఉండేది. గాంధీజీ రోజూ సాయంత్రం తన పనులన్నీ అయిపోయాక తీరిక దొరికినప్పుడు కింగ్‌స్లే హాలుకు వెళ్లిపోయేవారు. ఎందుకంటే, అక్కడ ఆడిటోరియంలో స్థానికులు కొంతమంది కలిసి ఒక పాట పాడేవారు. అది స్కాట్లాండ్‌కు చెందిన ఒక జానపద గీతం. 'అవుడ్ లాంగ్ సైన్' (గతించిన విషయం) అంటూ సాగే ఆ గీతాన్ని తర్వాత రాబర్ట్ బర్న్స్ కొత్త శైలిలో రాశారు. అదంటే గాంధీజీకి చాలా ఇష్టం.

 
గాంధీజీ ఆ పాట వినడానికి అక్కడకు ఎన్నిసార్లు వెళ్లారో లెక్కలేదు. ప్రతి శనివారం స్థానికులు ఆ గీతానికి డ్యాన్స్ చేస్తారనే విషయం గాంధీజీకి తర్వాత తెలిసింది. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సు కోసం ఆయనతోపాటు వెళ్లిన కాంగ్రెస్ సభ్యులకు మాత్రం గాంధీజీ అలాంటి వాటిపై ఆసక్తి చూపడం నచ్చేది కాదు. వాళ్లు ఆయనకు అలా చేయకండి అని చెప్పారు. కానీ, గాంధీజీ వినలేదు. ఒక రోజు శనివారం ఆడిటోరియానికి చేరుకునేసరికే ఆ పాట, డ్యాన్స్ మొదలైపోయింది. కానీ, ఒక మహిళ హఠాత్తుగా చేయి పైకెత్తి ఆగండి అని అరిచారు.

 
తర్వాత ఆమె గాంధీజీని "మీరు కూడా మాతో కలిసి డాన్స్ చేయాలనుకుంటున్నారా?" అని అడిగారు. గాంధీజీ చుట్టూ చూశారు. అక్కడ అందరూ తమ భార్యలతోనో, భర్తలతోనో లేదంటే స్నేహితులతోనో జంటగా నృత్యం చేస్తున్నారు. గాంధీజీ 'తప్పకుండా' అన్నారు. "నేను డ్యాన్స్ చేస్తా కానీ, ఒక షరతు నాకు జంటగా నా చేతికర్రే ఉంటుంది" అన్నారు. గాంధీజీ తన చేతికర్రతోనే కింగ్‌స్లే హాల్‌లో ఆడిటోరియంలో డాన్స్ చేశారు.

 
అదే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ తర్వాత రోమ్యా రోలాను కలవడానికి ఫ్రాన్స్ వెళ్లినప్పుడు, ఆయన తన డ్యాన్స్ గురించి ఆమెకు చెప్పారు. అప్పుడు ఆయనకు రోమ్యా రోలా పియానో చాలా బాగా వాయిస్తారనే విషయం కూడా తెలిసింది. దాంతో గాంధీజీ ఆమెతో "మీరు నాకు బీథోవిన్ ఐదో సింఫనీ వినిపిస్తారా" అని అడిగారు. అప్పుడు రోమ్యా రోలా అనారోగ్యంతో ఉన్నారు. లేవలేకపోతున్నారు. చాలా కష్టంమీద పడక మీద నుంచి లేచిన ఆమె పియానో దగ్గర కూచుని, చివరికి గాంధీజీ కోరిన సింఫనీ వినిపించగలిగారు.

 
తర్వాత గాంధీజీ అడగకపోయినా ఆమె ఆయన కోసం ఒక గ్రీకు గీతం కూడా వాయించారు. కానీ, గాంధీజీ ఆమె వాయిస్తుంటే ఆ పాట పాడుతూ వచ్చారు. అది కూడా ఆయనకు తెలిసిన పాటే. అందుకే ఏదైనా చెప్పాలంటే వారి గురించి పూర్తి వివరాలు తెలియాలి. కొన్ని గీతాలు, విషయాలతో గాంధీజీ పూర్తి వ్యక్తిత్వాన్ని తెలుసుకోలేం. దాని కోసం ఆయన గురించి తెలీని చాలా విషయాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గాంధీజీ గురించి ఇంకా బాగా అర్థం చేసుకోడానికి, బహుశా ఆయన 150వ జయంతి అయినా సాయం చేస్తుందేమో చూడాలి.