నేను నా గర్ల్‌ఫ్రెండ్ లియానేను ఎంతగానో ప్రేమిస్తాను. ఆమె కూడా తనను తాను అలాగే ప్రేమించుకోవాలని ఆశిస్తున్నాను. నీలి కళ్లు, పొడవాటి జుట్టు, చక్కని చిరునవ్వుతో ఆమె ఎంతో అందంగా ఉంటుంది. కానీ, తాను చాలా అందవిహీనంగా ఉన్నానని అనుకుంటుంది. పదేపదే చికాకు పడుతుంటుంది. లావుగా లేకున్నా... తాను చాలా లావుగా, అధిక బరువుతో ఉన్నానని బాధపడుతూ ఉంటుంది. ముఖం ఎంతో మృదువుగా ఉన్నా, తన ముఖం బాలేదని చింతిస్తూ ఉంటుంది.
2015లో టిండర్‌లో మా మధ్య పరిచయం ఏర్పడింది. అప్పుడు తను ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉండేది. తొందరలోనే మా మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగింది. దాంతో, కొన్ని నెలల్లోనే నేను ఆమెతో ప్రేమలో పడిపోయాను.
న్యూనతా భావంతో..
ఆమె తన శరీర ఆకృతి పట్ల న్యూనతా భావంతో ఉందని ఆరు నెలలు గడిచేలోగానే నాకు పూర్తిగా అర్థమైంది. ఒక రోజు బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాం. తను జుట్టుకు వేసుకునే స్ప్రే అయిపోయిందని తెలిసింది. స్ప్రే లేకుంటే జుట్టు బాగుండదని తను బాధపడుతున్నట్లు నాకు అర్థమైంది. వెంటనే దుకాణానికి వెళ్లి కొత్త స్ప్రే తెచ్చాను. అయితే, పొరపాటున ఆమె రోజూ వాడేదానికంటే కాస్తంత భిన్నంగా ఉన్నది తెచ్చాను.
అంతే... అదెందుకు తెచ్చావంటూ ఆమె కోపంతో ఊగిపోయింది. గదిలోని వస్తువులన్నీ అటూ.. ఇటూ.. విసిరేసింది. ఆ రోజు ఎలాగోలా వివాదం సద్దుమణిగింది. ఆమె ప్రవర్తన గురించి పూర్తిగా అర్థమైంది.
నాకు అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (ఓసీడీ) ఉంది. సాధారణంగా అది అదుపులో పెట్టుకోదగినదే. కానీ, ఈ పరిస్థితుల కారణంగా నాలో డిజార్డర్ బాగా పెరిగింది. ఆమె ప్రవర్తనను చూసిన తర్వాత, ఆమెలో మానసిక ఆందోళన (యాంగ్జైటీ డిజార్డర్) లాంటి లక్షణాలు ఉన్నట్లు గుర్తించాను.
బాడీ డిస్‌మార్ఫిక్ డిజార్డర్
స్థానిక డాక్టర్‌కు చూపించుకోవాలని సూచించాను. వెళ్లాం. ఆమె బాడీ డిస్‌మార్ఫిక్ డిజార్డర్ (బీడీడీ)తో బాధపడుతున్నట్లు వైద్యులు తేల్చారు. ప్రపంచంలో 2 శాతం మంది మాత్రమే ఈ డిజార్డర్ బారిన పడుతుంటారు. దీని బాధితులు ఎప్పుడూ ఇతరులతో తమను పోల్చుకుంటూ తాము అందవిహీనంగా ఉన్నామని, ముఖం బాలేదు, జుట్టు బాలేదు, పొట్ట పెద్దగా ఉంది... అని లోలోపల అనుకుంటూ చింతిస్తుంటారు. లియాన్ ఇటీవలే చికిత్స తీసుకోవడం ప్రారంభించింది. ఇంకా ఆమెలో పెద్దగా మార్పు రాలేదు.
నేను ఆ రుగ్మత లేనప్పటికీ, ఆమెతో కలిసి ఉండటం వల్ల నా దైనందిన జీవితంలో అది కూడా ఒక భాగమైంది. ఆ డిజార్డర్ కారణంగా మేము చాలా ఇబ్బందులు పడాల్సివస్తోంది. సరదాగా బయటకు వెళ్లాలని అనుకుంటాం. ఆమె కూడా ఒప్పుకుంటుంది. తీరా వెళ్లే సమయానికి ఉన్నట్టుండి మనం బయటికెళ్లేందుకు వీళ్లేదని అంటుంది. ఓసారి జ్యూస్ బార్‌కు వెళ్లాలనుకున్నాం. కానీ, హఠాత్తుగా ఆ బార్‌లో తనకంటే అందమైన అమ్మాయి ఉందని, నేను రానని లియాన్ మొండికేసి కూర్చుంది.
ఇంకో రోజు స్నేహితులతో కలిసి ఒక బార్‌లో ఉన్నాం. ఇద్దరు కుర్రాళ్ళు తమకు తెలిసిన కొంతమంది మహిళలతో అక్కడికి వచ్చారు. వాళ్లను చూడగానే లియాన్‌లో ఒక్కసారిగా కోపం పెరిగిపోయింది. ఆ మహిళలతో పోలిస్తే తాను అందవిహీనంగా ఉన్నానని ఆమె భావన. ఆ కోపంతో నాపై విరుచుకుపడింది.
పోర్న్ చూడాల్సి వస్తోంది
చెప్పాలంటే, మా పరిస్థితి ఎంతో భయానకంగా ఉంటుంది. లియాన్ తరచూ తన ముఖాన్ని గీసుకోవాలని, జుట్టును కాల్చేయాలని ఉందని చెబుతుంటుంది. ఒకరోజు నా ముందే జుట్టును కాల్చుకునేందుకు ప్రయత్నించింది. నేను వెంటనే ఆమె చేతిలోని లైటర్‌ను లాక్కోవడంతో ప్రమాదం తప్పింది. తన పరిస్థితి చూసి చాలా భయపడ్డాను. ఆ డిజార్డర్ నుంచి ఆమెను ఎలా బయటపడేయాలో నాకర్థం కాలేదు.
మా జీవితంలో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే.. మేము ఎన్నడూ శారీరకంగా కలవలేదు. నా ముందు వివస్త్రగా మారడం లియానేకు చాలా అసౌకర్యంగా ఉంటుంది. కొన్ని నెలల క్రితం శారీరకంగా కలిసేందుకు ప్రయత్నించాం. కానీ, సంభోగం దాకా వెళ్లలేదు.
శృంగారానికి తను మానసికంగా సిద్ధంగా ఉందో లేదో తెలుసుకునేందుకు, ఆమె ముందుగా చొరవ తీసుకోవాలని నేను వేచిచూస్తుంటాను. కానీ, ఆమె మాత్రం నేనే ముందు ప్రయత్నించాలని చూస్తుంటుంది. తప్పని పరిస్థితిలో నేను 'స్వీయ ఔషధంగా' పోర్న్ చూడాల్సి వస్తోంది.
నా ఫోన్‌లో పోర్న్ వీడియోలు కనిపించినప్పుడు లియానే చాలా కోప్పడుతుంది. పోర్న్ చూడొద్దని వారిస్తుంది. ఎందుకంటే, నేను ఆమెతో సెక్స్ చేయడం కంటే పోర్న్ చూసేందుకు మొగ్గుచూపుతున్నానని ఆమె భావన. శారీరకంగా కలిసేందుకు అనేక సార్లు ప్రయత్నించాం. కానీ, ఆమెకు సౌకర్యవంతంగా అనిపించనప్పుడు అది సాధ్యమయ్యే పనికాదు. భవిష్యత్తులో అది జరుగుతుందన్న నమ్మకం కూడా లేదు. దాంతో, భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోలేకపోతున్నాం.
సమస్య అంతా దానివల్లే
మా ఇద్దరి వయసూ 29 ఏళ్లు. ఆమె స్నేహితులందరూ పెళ్లి చేసుకుంటున్నారు. మరికొన్ని నెలల్లో మేము కూడా వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాం. పెళ్లి, పిల్లల గురించి చర్చించుకున్నాం. నాకు పిల్లలు అంటే ఇష్టం. కానీ, సమస్య అంతా డిజార్డర్ వల్లే. తనకు పెళ్లి చేసుకోవాలనుందని లియాన్ చెబుతుంటుంది. తర్వాత పెళ్లి చేసుకుని పిల్లలను కంటే తన శరీర ఆకృతి దెబ్బతింటుందేమో అని చింతిస్తుంటుంది.
మేము విడిపోతే బాగుంటుందేమో అన్న ఆలోచనలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ, బాగా ఆలోచించి మళ్లీ వెనక్కి తగ్గాను. ఇన్ని ఇబ్బందులు వస్తున్నా, ఇదంతా లియానే వ్యక్తిగత విషయం అన్న ఆలోచనతో చాలా రోజుల పాటు మా కుటుంబ సభ్యులకు, నా స్నేహితులకు చెప్పలేదు. కానీ, ఏడాది క్రితం ఆవేశంలో మా అమ్మానాన్నలకు చెప్పేశాను. వాళ్లు కూడా మాకు అండగా ఉంటున్నారు. మా అమ్మ ఓ మానసిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తారు. లియానే పరిస్థితిని ఆమె అర్థం చేసుకోగలిగారు. నేను లియానే ప్రేమను నమ్ముకున్నాను. తను ఇప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్. ఆమెకు అండగా ఉంటాను. ప్రతిరోజూ ఇద్దరం సంతోషంగా గడిపేందుకు ప్రయత్నిస్తున్నాం.