ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త జిల్లాలు: మెడిక‌ల్ కాలేజీల కోసం మూడు జిల్లాలు ఏర్పాటు చేస్తారా?

New districts in Andhra Pradesh
బిబిసి| Last Modified మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (17:53 IST)
వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల విభ‌జ‌న దిశగా ప్ర‌భుత్వం అడుగులు వేస్తోంది. ప్ర‌తీ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఒక జిల్లాగా మార్పు చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌న ఎన్నిక‌ల మ్యానిఫెస్టోలో ప్ర‌క‌టించారు. దీనిపై త్వ‌ర‌లో నిర్ణ‌యం తీసుకుంటామ‌ని రెవెన్యూ మంత్రిగా ఉన్న ఉప ముఖ్య‌మంత్రి పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ ప్ర‌క‌టించారు.

ఈలోగా కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు అనుగుణంగా మూడు జిల్లాలను ఏర్పాటు చేయాలన్న ప్ర‌తిపాద‌న ప్రభుత్వం ముందుకు వ‌చ్చింది. మ‌చిలీప‌ట్నం, అర‌కు, గుర‌జాల కేంద్రాలుగా కొత్త జిల్లాల ఏర్పాటు విష‌యంలో ప్ర‌భుత్వం స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు చెబుతున్నారు. నర్సారావుపేట పార్లమెంటు నియోజకవర్గానికి నర్సారావు పేట కేంద్రంగా ఉంది. గురజాల కూడా ఇదే నియోజకవర్గంలో ఉంది. దీంతో గురజాలను జిల్లా కేంద్రం చేస్తారన్న ప్రతిపాదనపై కొంద‌రు అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తున్నారు.

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ పున‌ర్విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత తెలంగాణలో కేసీఆర్ ప్ర‌భుత్వం కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేసింది. పాల‌న వికేంద్రీక‌ర‌ణ‌లో భాగంగా జిల్లాల విభ‌జ‌న చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. 13 జిల్లాలు ఉన్న ఏపీలో మాత్రం కొత్తగా ఇంకొక జిల్లాను ఏర్పాటు చేయాల‌ని గతంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించింది. రంప‌చోడ‌వ‌రం కేంద్రంగా 14వ జిల్లా ఏర్పాటుకి ప్ర‌య‌త్నించింది.

పోల‌వ‌రం ప్రాజెక్ట్ ముంపు గ్రామాల పేరుతో 6 మండ‌లాల‌ను తెలంగాణ నుంచి ఏపీలో విలీనం చేసిన నేప‌థ్యంలో వాటితో పాటుగా తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లోని ఏజ‌న్సీ ప్రాంతాల‌ను క‌లిపి కొత్త జిల్లా ఏర్పాటు చేయాల‌నే ఆలోచ‌న‌తో రంగంలోకి దిగింది. ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ‌కు కొంత ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ, ప‌లువురు అభ్యంత‌రాలు వ్య‌క్తం చేయ‌డంతో అప్ప‌ట్లో దానిని నిలిపివేశారు.

25 జిల్లాలు చేస్తామ‌ని జ‌గ‌న్ హామీ
గ‌త ఎన్నిక‌ల‌కు ముందే వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ కొత్త జిల్లాల ఏర్పాటు ప్ర‌క‌ట‌న చేశారు. తాము అధికారంలోకి వ‌స్తే 25 పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల‌ను 25 జిల్లాలుగా విభ‌జిస్తామ‌ని మ్యానిఫెస్టోలో కూడా పేర్కొన్నారు. అదే స‌మ‌యంలో ఎన్టీఆర్ పేరుతో జిల్లా ఏర్పాటు చేస్తామ‌ని కూడా ఆయన త‌న పాద‌యాత్ర సంద‌ర్భంగా హామీ ఇచ్చారు. ఇలాంటి ప్ర‌క‌ట‌న‌ల నేప‌థ్యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత జిల్లాల విభ‌జ‌న అంశం ప‌దే ప‌దే చ‌ర్చ‌కు వ‌స్తోంది.

ఈ విష‌యంపై ఉప ముఖ్య‌మంత్రి పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ బీబీసీతో మాట్లాడారు. "కొత్త జిల్లాల ఏర్పాటు ప్ర‌తిపాద‌న ప్ర‌భుత్వం వ‌ద్ద ఉంది. త్వ‌ర‌లోనే ప్ర‌క్రియ ప్రారంభిస్తాం. 25 జిల్లాల‌ను ఏర్పాటు చేసే అంశంలో ముఖ్య‌మంత్రి క‌ట్టుబ‌డి ఉన్నారు. ఇటీవ‌ల వైద్య కళాశాలల ఏర్పాటు విష‌యంలో కొంత చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ విష‌యంలో ఎటువంటి నిర్ణ‌యమూ తీసుకోలేదు. త్వ‌ర‌లోనే అధికారికంగా దానిపై స్ప‌ష్ట‌త వ‌స్తుంది" అంటూ వివ‌రించారు.

ఏపీలో ప్ర‌స్తుతం 11 ప్ర‌భుత్వ‌ మెడికల్ కళాశాలలు ఉన్నాయి. విశాఖ‌లో ఆంధ్రా వైద్య కళాశాల, కాకినాడ‌లో రంగ‌రాయ వైద్య కళాశాల, విజ‌య‌వాడలో సిద్ధార్థ వైద్య కళాశాల, తిరుప‌తిలో ఎస్వీ వైద్య కళాశాల, ప‌ద్మావ‌తి వైద్య కళాశాలతో పాటుగా గుంటూరు, క‌ర్నూలు, అనంత‌పురం ప్ర‌భుత్వ వైద్య కళాశాలలు.. ఒంగోలు, క‌డ‌ప‌, శ్రీకాకుళంలో ఉన్న రిమ్స్ ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్నాయి.

ఇవి కాకుండా రాష్ట్రంలో మ‌రో 20 ప్రైవేటు వైద్య కళాశాలలు వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. తాజాగా మ‌రో మూడు ప్ర‌భుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమ‌తి మంజూరైంది. కొత్త కళాశాలలను గుంటూరు జిల్లా గుర‌జాల‌, కృష్ణా జిల్లా కేంద్రంగా ఉన్న‌ మ‌చిలీప‌ట్నం, విశాఖ‌లోని ఏజ‌న్సీ ప్రాంత‌మైన అర‌కులో ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

ఇప్ప‌టికే గుర‌జాల‌లో కళాశాలకు అనువైన స్థ‌లాన్ని కూడా కేటాయించారు. మిగిలిన రెండు చోట్లా కూడా అందుకు అనుగుణంగా చ‌ర్య‌లు తీసుకున్నారు. విశాఖ‌లో ఆంధ్రా వైద్య కళాశాల ఉంది. అదే జిల్లాలో అర‌కు ఉండటంతో, మ‌రో ప్ర‌భుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు సాంకేతికంగా అడ్డంకులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.


గుంటూరులో ఉన్న ప్ర‌భుత్వ వైద్య కళాశాల కార‌ణంగా గుర‌జాల వైద్య కళాశాల ఏర్పాటుకు కూడా స‌మ‌స్య ఏర్ప‌డుతోంది. విజ‌య‌వాడ‌లో సిద్ధార్థ వైద్య కళాశాల ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో ఉండటంతో మ‌చిలీప‌ట్నంలో మ‌రో వైద్య కళాశాల ఏర్పాటుకు చిక్కులు త‌ప్ప‌వ‌ని అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో స‌త్వ‌రం మూడు జిల్లాల ఏర్పాటు ద్వారా సాంకేతిక అడ్డంకులు తొల‌గించుకునేందుకు ఏపీ ప్ర‌భుత్వం రంగంలో దిగిన‌ట్టుగా క‌నిపిస్తోంది. గుంటూరు జిల్లా నుంచి గుర‌జాలను వేరు చేసి న‌ర్సారావుపేట పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌తో కొత్త జిల్లా ఏర్పాటు చేసేందుకు ప్ర‌తిపాద‌న‌లు ప్ర‌భుత్వం ముందు ఉన్నాయి.

అదే స‌మ‌యంలో మ‌చిలీప‌ట్నం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం జిల్లాగానూ, అర‌కు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ఒక జిల్లాగానూ ఏర్పాటు చేసే ఆలోచ‌న చేస్తున్న‌ట్టు మంత్రి పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ తెలిపారు. వీటిపై తుది నిర్ణ‌యం ఏదీ తీసుకోలేద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. జిల్లాల ప్ర‌తిపాద‌న‌కు సంబంధించి పూర్తి స్థాయిలో ప‌రిశీల‌న చేయాల్సి ఉంద‌ని, ఇంకా తుది నిర్ణ‌యం తీసుకోలేద‌ని రెవెన్యూ శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ ఉషారాణి బీబీసీకి తెలిపారు.

ఆమె మాట్లాడుతూ "జిల్లాల విభ‌జ‌న‌కు సంబంధించి స్పష్టమైన ప్ర‌తిపాద‌న ఏదీ ఇంకా పూర్తి కాలేదు. మంత్రి గారి వ‌ద్ద ఉన్న‌దే అధికారిక స‌మాచారం. ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న త‌ర్వాత ప్రతిపాద‌న‌లు సిద్ధం చేస్తాం. ప్ర‌స్తుతానికి ఎటువంటి నిర్ణ‌యం తీసుకోలేదు'' అని తెలిపారు.


‘కేంద్ర నిధుల కోస‌మే ఆ ప్ర‌తిపాద‌న‌లు’
న‌ర్సారావుపేట పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంగా ఉండ‌గా, గుర‌జాల‌లో జిల్లా కేంద్రం ఏర్పాటు చేస్తున్న‌ట్టు క‌థ‌నాలు రావ‌డంతో కొంద‌రు అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశారు. వీటిపై న‌ర్సారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస‌రెడ్డి స్పందించారు. "కొత్త‌గా మూడు వైద్య కళాశాలలు మంజూర‌య్యాయి. వాటికి కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉంది. అందుకోస‌మే మూడు జిల్లాలుగా ప్ర‌తిపాద‌న‌లు చేశారు.


ఆ విష‌యం తెలియ‌గానే సీఎంఓని సంప్ర‌దించాను. ప్ర‌క్రియ ఇంకా ప్రారంభం కాలేద‌ని తెలిపారు. కేంద్రానికి స‌మాచారం అందించిన‌ప్ప‌టికీ పూర్తి చేయ‌డానికి ఇంకా స‌మ‌యం ప‌డుతుందని తెలిపారు. న‌ర్సారావుపేట‌నే జిల్లా కేంద్రంగా ఉంచుతారు. ఆందోళ‌న అవ‌స‌రం లేదు. దానికోసం నేను ప్ర‌య‌త్నిస్తాను" అని ఆయన వివ‌రించారు. ప్ర‌భుత్వ ప్ర‌తిపాద‌న‌లు ఇంకా పూర్తిగా కొలిక్కి రాలేద‌ని మంత్రులు చెబుతున్నా, కొత్త జిల్లాల ఏర్పాటు విష‌యంలో మాత్రం చ‌ర్చ జోరుగా సాగుతోంది.

జిల్లా సరిహద్దులు మార్చొద్దంటూ కేంద్రం సూచన
మరోపక్క జ‌నాభా లెక్క‌ల‌ సేకరణకు కేంద్ర ప్రభుత్వం స‌న్నాహాలు పూర్తి చేసింది. వ‌చ్చే ఏప్రిల్ 1 నుంచి జ‌నాభా వివ‌రాల సేక‌ర‌ణ ప్రారంభం అవుతోంది. ఈ నేప‌థ్యంలో దేశ వ్యాప్తంగా జిల్లాల స‌రిహద్దుల మార్పులు చేయ‌వ‌ద్దంటూ కేంద్రం అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు సూచించింది. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల‌కు లేఖ‌లు కూడా రాసింది.

2021 మార్చి 31 వ‌ర‌కూ జిల్లాల స‌రిహ‌ద్దుల‌ను మార్చే ఆలోచ‌న‌లు విర‌మించుకోవాల‌ని సూచించిన‌ట్టు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. దాంతో ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశం ప్ర‌స్తుతానికి ప్ర‌శ్నార్థ‌కంగా మారుతోంది.

దీనిపై మరింత చదవండి :