శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 8 జూన్ 2021 (20:40 IST)

ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో పాకిస్తాన్ నటికి లైంగిక వేధింపులు, అసలేం జరిగింది?

''మహిళలను ద్వేషించే ఈ ప్రపంచంలో ద్వంద్వ ప్రమాణాలు నిజాయితీపై ఆధిపత్యం చెలాయిస్తాయి. ఇతరుల అభిప్రాయానికి ఇక్కడ గౌరవం ఉండదు. స్త్రీని చిన్నచూపు చూసే వారికి గౌరవం దక్కుతుంది. కానీ, అదే పని స్త్రీ చేస్తే ఆమెను అంతా అసహ్యించుకుంటారు. ఒక స్త్రీ తనకు నచ్చిన వ్యక్తిని ప్రేమించడం, ఇష్టమైన వారితో మాట్లాడటం తప్పెలా అవుతుంది ? ఒక స్త్రీ ఫొటో ముందు ఒక పురుషుడు హస్త ప్రయోగం చేసుకునే వీడియో మాత్రం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది''

 
ఈ వ్యాఖ్యలను పాకిస్తానీ నటి హనియా అమీర్ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోతో పాటు పోస్ట్ చేశారు. ఈ వీడియోలో హనియా తన సోదరితో కూర్చుని చాలా విచారంగా మాట్లాడుతూ కనిపిస్తారు.. మధ్యమధ్యలో ఆమె కన్నీళ్లు తుడుచుకుంటారు. హనియా అమీర్ తన ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నిత్యం ఆన్‌లైన్‌లో ఉంటారు. మరి ఎప్పుడూ సరదా సంగతులు చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే హనియా, ఎందుకింత విచారంగా కూర్చున్నారు?

 
రెండు వీడియోల వ్యవహారం
గత శుక్రవారం, హనియా ఇన్‌స్టాగ్రామ్ నుంచి తన ఫ్యాన్స్‌తో వీడియో లైవ్ పాల్గొన్నారు. అదే సమయంలో ఆమె ఫ్యాన్ ఒకరు లైవ్ సెషన్‌లోనే ఆమె ఫొటో ముందు హస్త ప్రయోగం చేసుకుంటూ కనిపించారు. హఠాత్తుగా దృశ్యాలు ప్రత్యక్షం కావడంతో ఆమె ముఖ కవళికలు మారిపోయాయి. ఆ వెంటనే ఆమె లైవ్ సెషన్‌ను కట్ చేశారు. అయితే, కొంత కాలం తర్వాత ఈ లైవ్ సెషన్ వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అది ఇప్పుడు వైరల్‌గా మారింది.

 
అయితే, ఈ వీడియోను ఇంకా ధృవీకరించలేదు. కొందరు యూజర్లు మాత్రం ఇది నకిలీ వీడియో అని, ఎడిట్ చేసిందని అంటున్నారు. కానీ, సమస్య ఈ ఒక్క వీడియోతోనే కాదు. ఆమె పాల్గొన్న మరో వీడియో కూడా ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

 
రెండో వీడియో వివాదమేంటి?
రెండో వీడియోలో ఆమెతోపాటు, దర్శకుడు వజాహత్ రవూఫ్ కొడుకులైన ఆషీర్ వజాహత్, నాయెల్ వజాహత్‌లు కనిపిస్తారు. ఓ వీడియో సాంగ్ సందర్భంగా హనియా వజాహత్ సోదరులలో ఒకరిని కౌగిలించుకుని కనిపిస్తారు. వజాహత్ కుమారులను, వారి బంధువులను హనియా తరచూ తన కుటుంబ సభ్యులుగా చెబుతుంటారు.

 
అయితే, ఒకవైపు హనియాపై లైవ్‌లో వేధింపుల వ్యవహారాన్ని చాలామంది ఖండిస్తుండగా, కొందరు యూజర్లు మాత్రం వజాహత్‌లతో ఉన్న వీడియోలో ఆమె సిగ్గు విడిచి వ్యవహరించారని, అశ్లీలతను వ్యాప్తి చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈ రెండు వీడియోల కారణంగా హనియా గత రెండు రోజులుగా పాకిస్తాన్‌లో టాప్‌ ట్రెండింగ్‌లో నిలిచారు.

 
''ఎందుకు ద్వంద్వ ప్రమాణాలు?''
పాకిస్తానీ సమాజంలో నెలకొన్న ద్వంద్వ ప్రమాణాల గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఒకవైపు హనియా పాల్గొన్న వీడియోపై కొందరు విమర్శలు గుప్పిస్తుండగా, మరికొందరు హనియా మీద తయారు చేసిన వేధింపుల వీడియోను వైరల్ చేస్తున్నారు. కొందరు హనియాను విమర్శించడాన్ని సమర్ధిస్తున్నారు, కానీ వేధింపుల గురించి మాత్రం మాట్లాడటం లేదు.

 
''ఇది సిగ్గుపడాల్సిన విషయం. వేధింపుల గురించి ఎవరూ మాట్లాడ్డం లేదు. కానీ, ఇటీవల కొందరు మాత్రం మలాల యూసఫ్‌ జాయ్‌కి ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో పాఠాలు బోధిస్తున్నారు'' అని ఖలీద్ అనే యూజర్ విమర్శించారు. ''తనకు నచ్చినట్లు జీవించే హక్కు హనియాకు ఉంది. కానీ, ఆమెకు జరిగిన వేధింపుల గురించి మాత్రం ఎవరూ ఎందుకు మాట్లాడటం లేదు? అందరి ముందు ఆ అమ్మాయిని అలా ఇబ్బంది పెట్టడం సబబేనా?'' అని హుదా ఇస్మాయిల్ అనే యూజర్ ప్రశ్నించారు.

 
'' వీళ్లను చూస్తుంటే జాలేస్తోంది. హనియాకు జరిగిన అవమానం మహిళలందరికీ ఒక రెడ్ సిగ్నల్. వాళ్లు పబ్లిక్ పర్సనాలిటీ అయినంత మాత్రాన వారిని అవమానించే హక్కు ఎవరికీ లేదు. అది మీ నైతిక విలువకు నిదర్శనం'' అని సిద్ధికా అనే యూజర్ పేర్కొన్నారు.

 
చర్య తీసుకోవాలని డిమాండ్
లైవ్ సెషన్‌లో హనియా ఫొటోతో అసభ్యకరంగా వ్యవహరించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కొందరు సోషల్ మీడియా యూజర్లు డిమాండ్ చేశారు. ''హనియా చేసిన తప్పేంటి? అమ్మాయిగా పుట్టడం ఆమె చేసిన నేరమా? ఆమె అనుభవిస్తున్న మానసిక వేదనను ఊహించలేము'' అని మలైకా అనే యూజర్ అన్నారు. ''సొసైటీగా మనం విఫలమయ్యాం. ఒక వ్యక్తిని దారుణంగా హింసించాం. అలాంటి వారు ఆత్మహత్య చేసుకుంటారు. తర్వాత మనకు ఏమీ తెలియనట్లు నటిస్తాం'' అని ఆమె అన్నారు.

 
హనియా పైనా విమర్శలు
’’వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడం వల్లే ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి‘‘ అని గుల్జార్ అనే యూజర్ వ్యాఖ్యానించారు. జీవితంలో కొన్ని నియమాలు పాటించడం కూడా ముఖ్యమే అన్నారాయన. హనియా తన స్నేహితులతో సరదాగా గడిపేటప్పుడు తరచుగా 'ఫన్నీ వీడియోలు' పోస్ట్ చేస్తారని, అయితే విమర్శకులు అవమానించడానికి, సంతోషాన్ని నాశనం చేయడానికి అవకాశం ఇవ్వవద్దని చాలా మంది యూజర్లు ఆమెకు సూచించారు.

 
2018 ఆగస్టులో కూడా అభిమానుల నుంచి తనకు లైంగిక వేధింపుల ఎదురైనట్లు హనియా ఫిర్యాదు చేశారు. ''నటిగా ఒక సెలబ్రిటీగా ఉండటం అంటే మేము ప్రజల ఆస్తి అని అర్ధం కాదు. అభిమానుల ముసుగులో కొందరు వ్యక్తులు మమ్మల్ని వేధిస్తుంటారు'' అని ఆమె అనేవారు. ''మనం వాళ్లకు ప్రేమను పంచుతున్నాం. కానీ, వాళ్లు మాకు వేధింపులను, బాధను, మానసిక వేదనను మిగుల్చుతుంటే వారిని అభిమానులు అని ఎలా అంటాం'' అన్నారు హనియా.

 
హనియా అమీర్ సోషల్ మీడియాను ఎందుకు ఉపయోగిస్తున్నారు?
''నేను నా జీవితంలోని ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటాను. అది కొంతమందికి ఇష్టం ఉండొచ్చు. కొందరికి ఇష్టంలేక పోవచ్చు'' అన్నారామె. అభిమానులకు దగ్గరగా ఉండేందుకే సోషల్ మీడియాలో వ్యక్తిగత జీవితం గురించి కూడా పోస్టులు పెడుతుంటానని హనియా అన్నారు. ''ఒక చిరునవ్వును పంచడానికి నేను ఇక్కడ ఉన్నాను. అర్ధవంతమైన సంభాషణలతో మీ హృదయాలను తాకే ప్రియమైన అమ్మాయిగా నన్ను గుర్తుంచుకోండి'' అని హనియా రాశారు.