1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: ఆదివారం, 26 మే 2024 (18:54 IST)

పాయల్ కపాడియా: 30 ఏళ్ల తర్వాత భారత్‌ తరఫున కేన్స్‌లో చరిత్ర సృష్టించిన ఈమె ఎవరు?

Payal Kapadia
భారత చిత్ర దర్శకురాలు పాయల్ కపాడియా కొత్త సినిమా ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జ్యూరీ అవార్డును దక్కించుకుంది. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రధాన పోటీ విభాగంలో ఒక భారతీయ చిత్రాన్ని ప్రదర్శించడం గత 30 ఏళ్లలో ఇదే తొలిసారి. ఈ ఫెస్టివల్‌లో ఇది రెండో అతిపెద్ద అవార్డు. ముంబయి అంటే సంపన్న వర్గాలకు, బాలీవుడ్ స్టార్లకు, బిలియనీర్ వ్యాపారవేత్తలకు పెట్టింది పేరు. అందుకు భిన్నంగా ఈ నగర వాసుల అసలైన జీవితాన్ని ఈ చిత్రం కళ్లకు కట్టినట్లు చూపించింది. ముంబయి వీధులకు, ఆ నగర వలసదారుల జీవితాలకు కపాడియా తన చిత్రంలో ప్రధాన స్థానం కల్పించారు.
 
ఆర్థిక రాజధానిగా పేరున్న ముంబయి నగరానికి ఎంతో మంది వలసదారులు బతుకుదెరువు కోసం వస్తుంటారు. వీరే ఈ నగర హృదయ స్పందన. ఇది కపాడియా తొలి నెరేటివ్ ఫీచర్ ఫిల్మ్. గురువారం రాత్రి కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రధాన కాంపిటిషన్ సెక్షన్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. కాన్స్ ఫెస్టివల్‌లో ఈ చిత్ర ప్రదర్శన ముగియగానే, ప్రేక్షకులంతా లేచి నిల్చుని 8 నిమిషాల పాటు చప్పట్లు కొట్టారు. ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’ సినిమా జ్యూరీ అవార్డును దక్కించుకోవడం కేవలం ఆ చిత్ర దర్శకురాలికే కాదు, భారతదేశం మొత్తానికి గర్వకారణం.
 
భారతీయ చిత్రాలకు అంతర్జాతీయ అవార్డులు
ఈ అవార్డుతో ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోల, యోర్గోస్ ల్యాంటిమోస్, అలి అబ్బాసి, జియా ఝాంగ్కే, జాక్వెస్ ఆడియార్డ్‌ లాంటి దర్శకుల సరసన కపాడియా కూడా నిలిచారు. గత నాలుగు దశాబ్దాలలో, భారతీయ చిత్రాలు అంతర్జాతీయ సినీ వేడుకలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాయి. మీరా నాయర్ చిత్రం సలామ్ బాంబే 1988 కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కెమెరా డీ‘ఓర్ అవార్డును దక్కించుకుంది. సెప్టెంబర్ 11 ఉగ్రవాద దాడులకు కొన్ని రోజుల ముందు 2001లోని మీరా నాయర్ క్లాసిక్ ‘మాన్‌సూన్ వెడ్డింగ్’ చిత్రం వెనీస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గోల్డెన్ లయన్ అవార్డును పొందింది.
 
డైరెక్టర్ రితేష్ బాత్రా 2013లోని ‘ది లంచ్‌బాక్స్’ చిత్రం కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘గ్రాండ్ గోల్డెన్ రైల్’ అవార్డును దక్కించుకుంది. అదే ఏడాది శుచి తలతి ‘గర్ల్స్ విల్ బి గర్ల్స్’ అనే చిత్రం సన్‌డ్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గ్రాండ్ జ్యూరీ, ఆడియన్స్ ప్రైజ్‌లను పొందింది. ఈ ఏడాది కపాడియా తెరకెక్కించిన ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’ చిత్రం కూడా ఏదో ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకుంటుందని సినీ ప్రేమికులు ఆశించారు. అనుకున్నట్లుగానే అవార్డు దక్కింది.
 
ఈ చిత్రానికి వచ్చిన రివ్యూలన్నీ కపాడియాపై ప్రశంసల వర్షం కురిపించాయి. ‘ది గార్డియన్’ పత్రిక ఈ సినిమాకు 5 స్టార్లు ఇచ్చింది. ‘‘అద్భుతం.. పూర్తి మానవత్వంతో నిండిన కథ’’ అని కొనియాడింది. సత్యజిత్ రే మహానగర్, అరణ్యార్ దిన్ రాత్రితో ఈ సినిమాను పోల్చుతున్నారు. ముంబయి రొమాంటిక్ వ్యూను ఈ సినిమాలో చూపించారు. ఈ మహానగరంలో ప్రజలు తమకు తాము ఎలా భర్తీ చేసుకుంటున్నారు.. అంటే ‘ఒంటరిగా లేదా ఎవరితోనైనా కలిసా’ అనే అంశాన్ని చూపిస్తుంది.
 
ఇద్దరు నర్సుల కథ
పాయల్ కపాడియా ప్రముఖ కళాకారిణి నళిని మలాని కూతురు. ముంబయి నగరంతో, ఆ సిటీ వైవిధ్య, భిన్న సంస్కృతితో ఆమెకు చిన్నప్పటి నుంచే పరిచయం ఉంది. ‘‘ఇతర ప్రాంతాలతో పోలిస్తే మహిళలు తేలికగా పని చేసుకునే ప్రదేశాలలో ముంబై ఒకటి’’ అని కపాడియా చెబుతారు. ఇళ్లను వదిలిపెట్టి, వేరొక ప్రాంతంలో పనిచేసేందుకు వెళ్లే మహిళలపై తాను సినిమా తీయాలనుకున్నానని కపాడియా చెప్పారు. తన చిత్రంలో కేరళ నుంచి వచ్చిన ఇద్దరు నర్సుల రోజువారీ జీవిత కథనాన్ని పాయల్ కపాడియా చూపించారు. ముంబయి నగరంలో వారు ఒక హాస్పిటల్‌లో పనిచేస్తూ, చిన్న, ఇరుకుగా ఉండే అపార్ట్‌మెంట్ కలిసి జీవిస్తున్నట్లు చూపిస్తారు.
 
ప్రభా అనే నర్సు (కని కుశృతి, గర్ల్స్ విల్ బి గర్ల్స్‌లో సపోర్టింగ్ రోల్ చేశారు) ఒక వివాహిత. ఆమె భర్త జర్మనీలో నివసిస్తుంటాడు. ఆమెతో చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. కానీ, ఒకరోజు అకస్మాత్తుగా తన భర్త నుంచి రైస్ కుక్కర్ సర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా వస్తుంది. ఆ కుక్కర్‌ను గట్టిగా హత్తుకున్న ఆమె, వారి పెళ్లి బంధంలో చివరి ప్రేమ కానుకగా భావిస్తుంది. రెండో నర్సు అను. ఈ పాత్రలో దివ్య ప్రభ నటించారు. చాలా సాహసాలతో కూడుకున్న ప్రయాణాన్ని సాగిస్తుంటారు. రహస్యంగా ఒక ముస్లిం యువకుడు షియాజ్(హృదు హరూన్)తో ప్రేమలో పడుతుంది. ఆమె కూడా కేరళ నుంచి వచ్చిన మహిళనే.
 
అను హిందూ కుటుంబంలో పుడుతుంది. షియాజ్‌తో ఆమె బంధాన్ని అను కుటుంబం తిరస్కరిస్తుంది. 2.2 కోట్ల మంది ప్రజలతో నిత్యం రద్దీగా, బిజీగా ఉండే ముంబయిలో అను, షియాజ్‌ల ప్రైవసీకి అసలు అవకాశం దొరకదు. కానీ, అదే ఆస్పత్రిలో పనిచేసే మూడవ నర్సు-పార్వతీ(ఛాయా కదం, ఈ ఏడాది కాన్స్‌లో రెండు సినిమాల్లో కనిపించారు) నగరాన్ని వదిలిపెట్టాలనుకుంటారు. ఎందుకంటే, నగరానికి పేరు కోసం ఆమె నివసిస్తున్న ప్రాంతాన్ని కూల్చివేసి, పునరుద్ధరించాలనుకుంటారు.
 
‘ఏ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్’
కపాడియా అంతకుముందు సినిమా ‘ఏ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్’లోని విద్యార్థుల జీవితాన్ని, పోరాటాన్ని చూపించారు. 2022 కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో దీన్ని ప్రదర్శించారు. ఈ సినిమా గోల్డెన్ ఐ అవార్డును పొందింది. దేశంలో ప్రతిష్టాత్మక ఫిల్మ్, టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్, పుణెలో 2015లో జరిగిన విద్యార్థుల ఆందోళనను ‘ఏ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్’ చూపించింది. కపాడియా కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. 2018లో డైరెక్షన్‌లో ఆమె డిగ్రీ పట్టాను పొందారు.
 
Payal Kapadia
‘నాకు చాలా కంగారుగా అనిపించింది. అందుకే, రాసుకుని వచ్చాను’
అవార్డును పొందిన తర్వాత మాట్లాడిన పాయల్ కపాడియా,‘‘ఇది నిజంగా నమ్మలేకపోతున్నా. నన్ను నేను గిచ్చుకున్నా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నిలబడటం నిజంగా చాలా ప్రత్యేకం’’ అని అన్నారు. ‘‘ఈ పోటీలో ఎంపిక కావాలనే కల నిజమైంది. ఈ అవార్డు నా ఊహకు అందనిది. అవార్డు దక్కించుకోవడానికి మరో భారతీయ సినిమాకు 30 ఏళ్లు పట్టదని అనుకుంటున్నాను.’’ అని పాయల్ కపాడియా కోరారు. అవార్డు ప్రదానోత్సవ సమయంలో, పాయల్ కపాడియా ఈ సినిమాలో నటించిన ముగ్గురు మహిళలను వేదికపైకి పిలిచారు.
 
‘‘వీరు లేకుండా ఈ చిత్రం తీయడం అసాధ్యం. ఈ ముగ్గురు మహిళలు నాకెంతో ఇచ్చారు. కుటుంబం మాదిరి వారు ఈ చిత్రాన్ని తమదని భావించారు.’’ అని వారిని కొనియాడారు. ఈ చిత్రం ముగ్గురు మహిళల స్నేహానికి సంబంధించిన కథని చెప్పారు. స్నేహం ఎంతో ముఖ్యమైన సంబంధమని తెలిపారు.