శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 24 మే 2024 (13:18 IST)

మద్యం తాగడం ఒక్కసారిగా మానేస్తే ఏమవుతుంది?

alchohol
మద్యానికి అలవాటు పడ్డవారు అకస్మాత్తుగా తాగడం మానేస్తే వారి శరీరంలో ఏం జరుగుతుంది? అసలు అలా మానేయడం సాధ్యమేనా? డీ అడిక్షన్ సెంటర్లు మద్యాన్ని మాన్పించగలవా? అనే విషయాల గురించి చర్చిస్తోంది ఈ కథనం. పెరుగుతున్న మద్యం ధరల కంటే శరీరం మీద మద్యం చూపించే ప్రభావం చాలా ఎక్కువ. మరీ ముఖ్యంగా ఆల్కహాల్ వల్ల వచ్చే అనారోగ్యాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. మద్యం రోజూ తాగినా, అప్పుడప్పుడూ తాగినా, అది శరీరంలోని కీలక అవయవాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
 
మనం తాగే ఆల్కహాల్ ఎక్కడికి వెళ్తుంది?
మద్యం తాగిన తర్వాత అది నేరుగా పొట్టలోకి వెళ్లి మూత్రం రూపంలో శరీరాన్ని వదిలి వెళుతుందని చాలా మంది భావిస్తారు. అది శరీరంలోకి వెళ్లిన తర్వాత అవయవాల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై చాలా మందికి అవగాహన ఉండదు. దీని గురించి ఎంజీఎం హెల్త్‌కేర్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ త్యాగరాజన్‌తో బీబీసీ మాట్లాడింది. “ఎంత తాగుతున్నారు? ఎప్పుడు తాగుతున్నారు? ఎంత కాలం నుంచి తాగుతున్నారు? అన్న విషయాలను పక్కన పెడితే ఆల్కహాల్ శరీరానికి ప్రమాదకరం. దీని వల్ల పురుషుల కంటే మహిళలకు ఎక్కువ ప్రమాదం ఉంది” అని ఆయన చెప్పారు.
 
“ఆల్కహాల్ తాగిన తర్వాత అది పొట్టలోని చిన్న పేగులోకి వెళుతుంది. అక్కడ అది అల్డిహైడ్స్ అనే రసాయనంగా విడిపోతుంది” అని ఆయన చెప్పారు. “పొట్ట, పేగుల్లోని రక్తం లివర్ ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు చేరుకుంది. కాలేయం మనం తిన్న ఆహారంలో పోషకాలను వేరు చేసి రక్తంలో కలిపి, ఆ రక్తాన్ని శరీరంలోని ఇతర భాగాలకు సరఫరా చేస్తుంది. అలాగే ఆహారంలో పనికిరాని వాటిని వేరు చేసి మలం, మూత్రం రూపాల్లో బయటకు పంపిస్తుంది”. “అల్డిహైడ్ చాలా ప్రమాదకరమైనది. ఇది రక్తం ద్వారా కాలేయానికి చేరుకుని కాలేయాన్ని దెబ్బ తీస్తుంది. అందుకే మీరు తక్కువ కాలంలో ఎక్కువ ఆల్కహాల్ తాగితే శరీరంలో అల్డిహైడ్ల పరిమాణం పెరుగుతుంది. దీంతో కాలేయం పని చేయడం ఆపేస్తుంది” అని త్యాగరాజన్ చెప్పారు.
 
ఆల్కహాల్ మహిళలకు మరింత ప్రమాదం
పురుషులైనా, మహిళలైనా ఆల్కహాల్ ప్రభావం అందరిలోనూ ఒకేలా ఉంటుంది. అయితే జన్యుపరంగా చూస్తే మహిళలకు ముప్పు ఎక్కువని డాక్టర్ త్యాగరాజన్ చెప్పారు. “తరచూ మద్యం తాగడం వల్ల కాలేయం మీద ప్రమాదకరమైన మచ్చలు ఏర్పడతాయి. ఇవి కాలేయాన్ని దెబ్బ తీస్తాయి. ఇది ఫైబ్రోసిస్‌కు దారి తీస్తుంది. కాలేయం మీద మచ్చలు, కాలేయంలో కణాలు బరువెక్కడం, మృదుత్వాన్ని కోల్పోవడం వంటివి జరుగుతాయి. ఇది లివర్ సిరోసిస్‌కు దారి తీస్తుంది. కాలేయంలోని మంచి కణాల స్థానంలో మచ్చలున్న, బరువైన కణాల సంఖ్య పెరుగుతుంది” అని ఆయన చెప్పారు. అయితే ఈ వ్యాధి తీవ్రత త్వరగా బయటపడుతుందా లేక ఆలస్యంగానా అనేది వ్యక్తుల కణజాల నిర్మాణం, ఆ వ్యక్తి ఎంత ఆల్కహాల్ తీసుకుంటున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. మద్యం తాగే మహిళల్లో కాలేయ సమస్యలు త్వరగా, ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
 
ఆల్కహాల్ సేవించడం వల్ల వచ్చే కాలేయ వ్యాధులు ఏంటి?
మద్యపానం వల్ల కాలేయానికి అనేక సమస్యలు వస్తాయి. గత దశాబ్ధంలో దేశవ్యాప్తంగా కాలేయ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. భారతీయుల్లోని ప్రతి ఐదుగురిలో ఒకరికి కాలేయ సంబంధ వ్యాధి ఉంది. కాలేయ వ్యాధుల వల్ల మరణిస్తున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. మద్యపానం వల్ల ప్రధాన సమస్య లివర్ సిరోసిస్ అని డాక్టర్ త్యాగరాజన్ చెప్పారు. లివర్ సిరోసిస్ దీర్ఘకాలం కొనసాగితే కాలేయంలోని కణాల్లో వాపు పెరుగుతుంది. దీని వల్ల కీళ్ల నొప్పులు, ఇతర ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. ఇదిలాగే కొనసాగితే కాలేయం పని చేయడం నెమ్మదిగా తగ్గిపోతుంది. శరీరంలో శక్తి కోల్పోవడం, కండరాల బలహీనత, డీ హైడ్రేషన్, కామెర్లు, వాంతుల్లో రక్తం పడటం లాంటివి లివర్ సిరోసిస్ లక్షణాలు.
 
హెపటైటిస్ లేదా లివర్ ఫెయిల్యూర్ (అక్యూట్ ఆల్కహాలిక్ హెపటైటిస్)
సరైన ఆహారం తీసుకోకుండా రేయింబవళ్లు మద్యం తాగేవారిలో ఈ సమస్య తలెత్తుతుంది. కామెర్లు, రక్తం గడ్డకట్టడంతో పాటు మెదడులోని కణజాలాన్ని ప్రభావితం చేస్తుంది. దీని వల్ల కొన్నిసార్లు కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. ‘‘మీరు ఎంత మద్యం తాగుతున్నారని కాదు, మద్యపానం వల్ల దీర్ఘకాలంలో కాలేయం దెబ్బ తింటుంది, కొన్ని సందర్భాల్లో హఠాత్తుగా కాలేయం పని చేయడం మానేస్తుంది’’ అని డాక్టర్ త్యాగరాజన్ చెప్పారు. కాలేయం అనారోగ్యానికి సంబంధించి మూడు సందర్భాల్లో చికిత్స అవసరం. రోగుల పరిస్థితిని బట్టి వైద్యం చేస్తారని ఆయన అన్నారు.
 
ఆల్కహాల్‌తో ఫ్యాటీ లివర్ వస్తుందా?
గతేడాది ఎయిమ్స్ ప్రచురించిన ఓ అధ్యయన పత్రం ప్రకారం, 38 శాతం మంది భారతీయులకు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్య ఉందని తేలింది. లివర్ కణాలలో కొవ్వు సహజంగానే ఉంటుంది. అయితే ఇది ఐదు శాతం కంటే తక్కువగా ఉంటుంది. లివర్ కణాలలో ఉండే కొవ్వు 20-25 శాతం దాటితే అది కాలేయం పని తీరుని దెబ్బ తీస్తుంది. దీన్నే ఫ్యాటీ లివర్ అని పిలుస్తున్నారు. ఫ్యాటీ లివర్‌లో ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అని రెండు రకాలు ఉన్నాయని డాక్టర్ త్యాగరాజన్ చెప్పారు. రోజువారీ జీవితంలో మార్పులు, సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం లాంటి అంశాలు ఫ్యాటీ లివర్‌కు దారి తీస్తాయి. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనేది సాధారణ అంశం.
 
రోజుకు ఎంత ఆల్కహాల్ తీసుకోవడం సురక్షితం?
కొంతమంది ఎంత మద్యం తాగినా నియంత్రణ కోల్పోకుండా ప్రవర్తిస్తుంటారు. అయితే రోజూ కొద్ది మొత్తంలో ఆల్కహాల్‌ను తీసుకోవడం మంచిదేనని వైద్యులు చెబుతున్నారు. “రోజుకు 30 ఎంఎల్ ఆల్కహాల్ తీసుకోవడం సురక్షితం. రోజూ అంత మొత్తంలో తాగడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలా తాగాలన్నా మీ కాలేయడం జన్యుపరంగా ఆరోగ్యంగా ఉండాలి. లివర్‌కు సంబంధించి ఇతరత్రా ఎలాంటి సమస్యలు ఉండకూడదు” అని డాక్టర్ చెప్పారు.
అదే సమయంలో మద్యానికి బానిసలుగా మారితే, ఎంత స్వీయ నియంత్రణ ఉన్నా కొద్ది మొత్తంతో సరిపెట్టడం సాధ్యం కాదు. మద్యం తాగడం అలవాటుగా మారితే తాగే పరిమాణం రోజురోజుకీ పెరుగుతుందే తప్ప, తగ్గదు. అందుకే ఆల్కహాల్‌ను పూర్తిగా పక్కన పెట్టడం మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.
 
మద్యం మానేస్తే కాలేయం మెరుగుపడుతుందా?
కొన్ని సార్లు చాలా కాలంగా మద్యం సేవిస్తున్నవారు మానేయాలని నిర్ణయించుకుంటారు. దీని వల్ల అనారోగ్యం నుంచి బయటపడొచ్చని అనుకుంటారు. 
అయితే దీర్ఘకాలం మద్యానికి బానిసలైనవారు హఠాత్తుగా దాన్ని మానేసినా కాలేయ సంబంధిత వ్యాధుల నుంచి తప్పించుకోలేరని వైద్యులు చెబుతున్నారు. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ లేదా ఫైబ్రోసిస్ తొలి దశలో మద్యం తాగడం మానేస్తే, కాలేయం మరింత దెబ్బ తినకుండా ఆపవచ్చు. వైద్య చికిత్స ద్వారా త్వరగా కోలుకోవచ్చు అని డాక్టర్ త్యాగరాజన్ చెప్పారు. “ఏదేమైనప్పటికీ, లివర్ సిరోసిస్ వస్తే, ఆల్కహాల్ తాగడం పూర్తిగా మానేసినా, దాన్నుంచి కోలుకోవడం సాధ్యం కాదు. లివర్ సిరోసిస్‌కు వైద్యుల ద్వారా చికిత్స తీసుకోవాల్సిందే. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. లివర్ డ్యామేజ్ ఏ దశలో ఉన్నా, మద్యం తాగడం ఆపేస్తే కాలేయానికి అదనపు నష్టం జరగడం ఆగిపోతుందని డాక్టర్ త్యాగరాజన్ చెప్పారు.
 
ఆల్కహాల్ వల్ల మానసిక అనారోగ్యం
మద్యపానం వల్ల దెబ్బ తినే మరో అవయవం మెదడు. అందుకే మద్యం అలవాటు ఉన్న వారు మానసికంగా సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఈ విషయం గురించి కల్పక్కం గవర్నమెంట్ సైకియాట్రీ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ పూర్ణ చంద్రికతో బీబీసీ మాట్లాడింది. ఒక వ్యక్తి ఎంత మద్యం తీసుకుంటున్నారు? ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు? ఆ వ్యక్తిలో ఎంత ఆల్కహాల్‌ను భరించే సామర్థ్యం ఉంది అనే దానిపై మానసిక ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని డాక్టర్ పూర్ణ చంద్రిక చెప్పారు.
 
మద్యం అధికంగా తాగితే వచ్చే సమస్యలు
కొంతమంది తక్కువగానే తాగినా, ఆల్కహాల్‌కు పూర్తిగా అలవాటు పడకపోయినా లేదా బానిసలుగా మారినా వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాళ్లు వస్తువులను పగలగొడుతుంటారు. మద్యం వల్ల వచ్చే మానసిక సమస్యల్లో ఇది తొలి అడుగు అని డాక్టర్ చెప్పారు. “ఇందులో తర్వాతి దశ డెలిరియం ట్రెమెన్స్. ఇందులో పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, పెద్దగా అరవడం, పోలీసులు వచ్చి తమను అరెస్ట్ చేస్తారని చెప్పడం లాంటివి ఉంటాయి. దీంతో పాటు బ్రాంతి, మానసిక అనారోగ్య లక్షణాలైన నిద్రలేమి, అయోమయం, మతిమరుపు, అలసట, చెవిలో ఏదో శబ్ధాలు వచ్చినట్లు అనిపిస్తుంది” అని డాక్టర్ పూర్ణ చంద్రిక బీబీసీకి వివరించారు.
 
ఆల్కహాల్‌ మానేసిన తర్వాత ఏమవుతుంది ?
మద్యం తాగడం వల్ల మానసికంగా, శారీరకంగా ప్రభావం పడుతుంది. అయితే తాగడం మానేసిన తర్వాత కొంతమందిలో తీవ్రమైన సమస్యలు కనిపిస్తాయి. దీన్ని విత్‌డ్రాయల్ సిండ్రోమ్ అంటారు. మద్యం హఠాత్తుగా మానేసిన తర్వాత కొంతమందిలో టెన్షన్, ప్రకంపనలు, అలసట కనిపిస్తాయి.
అదే సమయంలో కొన్నేళ్ల నుంచి మద్యం తాగుతూ, హఠాత్తుగా మానేస్తే మానసిక సమస్యలు తలెత్తవచ్చని డాక్టర్ పూర్ణ చంద్రిక చెప్పారు. “కొంతమంది మద్యం తాగడం మానేసిన తర్వాత వారికి చెవుల్లో పెద్ద పెద్ద శబ్ధాలు వినిపిస్తుంటాయి. ఎవరో తమను పిలుస్తున్నట్లు అనిపిస్తుంది. దీన్నే ఆల్కహాల్ ప్రేరేపిత బ్రాంతి అంటారు అని డాక్టర్ పూర్ణ చంద్రిక చెప్పారు. ఏళ్ల తరబడి మద్యం తాగుతూ ఏదో ఒక కారణంతో హఠాత్తుగా మద్యం మానేసినవారిలో మూడు రోజుల్లో మానసిక సమస్యలు తలెత్తుతాయి. అయోమయం, కోపం, తమ ముందు ఏముందో తెలియని పరిస్థితుల్లోకి జారి పోతారు.
 
వెర్నికే ఎన్సెఫలోపతి కోర్షాఫ్
మద్యం మానేయడం వల్ల వచ్చే మానసిక సమస్యలు తీవ్రమైతే తర్వాతి దశలో అది న్యూరోలాజికల్ సమస్యలకు దారి తీస్తుంది. దీన్ని వెర్నికే ఎన్సెఫలోపతి కోర్షాఫ్ అంటారు. ఈ దశలో అన్నింటినీ మర్చిపోతుంటారు. ఇదెలా ఉంటుందంటే అకస్మాత్తుగా వారు ఒక ప్రశ్న అడిగి, దానికి సమాధానం చెప్పేలోపే తాము ప్రశ్న అడిగిన విషయాన్ని మర్చిపోతుంటారు. తమకు మతిమరుపు ఉందనే విషయాన్ని చెప్పకుండా ఏదో ఒకటి చెప్పేందుకు ప్రయత్నిస్తుంటారు. న్యూరాలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే ఇవేనని చెప్పారు డాక్టర్ పూర్ణ చంద్రిక. దీనికి తోడు నరాలకు సంబంధించిన సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. మియోపతి, న్యూరోపతికి సంబంధించిన సమస్యల వల్ల నిలబడటం, పని చెయ్యడం అసాధ్యంగా మారుతుంది. అలాగే శరీరంపై సూదులు, పిన్నులతో పొడుస్తున్నట్టు అనిపిస్తుంది.
 
డీ అడిక్షన్ సెంటర్లు, రిహాబిలిటేషన్ సెంటర్లతో ప్రయోజనం ఉంటుందా?
మద్యపానం, మాదక ద్రవ్యాలకు అలవాటు పడినవారితో ఆ అలవాటు మాన్పించేందుకు డీ అడిక్షన్ సెంటర్ల సంఖ్య పెరుగుతోంది. అయితే కొన్ని సెంటర్లలో బాధితులను కొట్టడం, హింసించడం లాంటివి జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య రీహాబిలిటేషన్ సెంటర్ల వల్ల ఉపయోగం ఉంటుందా అని బీబీసీ వైద్యులను అడగింది. “కొన్ని డీ అడిక్షన్ సెంటర్లలో ఇబ్బందులు ఉన్నప్పటికీ, మంచివి కూడా ఉన్నాయి. కొన్ని సెంటర్లలో నిజంగా ఏం జరుగుతుందో నాకు తెలియదు. అలాంటి కేసుల్లో వైద్యుల ద్వారా చికిత్స చేయించుకోవడం మంచిది. చికిత్సతో పాటు రోగులలో మానసిక సంకల్పం కూడా ముఖ్యం. బలవంతంగా ఎవరినీ మార్చలేం” అని డాక్టర్ త్యాగరాజన్ చెప్పారు. దేశంలోని అనేక రిహాబిలిటేషన్ సెంటర్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి తీసుకుని పని చేస్తున్నాయని డాక్టర్ పూర్ణ చంద్రిక చెప్పారు. అనుమతి లేని సెంటర్లను నమ్మొద్దని సూచించారు.
 
“డీ అడిక్షన్ సెంటర్లలో బాధితులు కుటుంబ సభ్యుల్ని కలిసేందుకు అనుమతించకపోవడం, వాళ్లను ఒంటరిగా వదిలేయడం లాంటివి చేస్తుంటే ఆ సెంటర్లను నమ్మవద్దు. మద్యం మానేసేలా స్ఫూర్తి ఇవ్వడం, కుటుంబంతో ఉండేందుకు ప్రోత్సహించడం లాంటివి అవసరం. సెంటర్ల విషయంలో ఎలాంటి సందేహాలు తలెత్తినా స్టేట్ మెంటల్ హెల్త్ కమిషన్‌కు ఫిర్యాదు చెయ్యండి” అని పూర్ణ చంద్రిక చెప్పారు.