శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శనివారం, 30 మార్చి 2024 (13:57 IST)

బెంగళూరులా విశాఖపట్నానికి నీటి సమస్య వస్తుందా? నిల్వలు ఎలా ఉన్నాయి?

visakha beach
బెంగళూరు నీటి సమస్యతో ఇప్పుడు నగరాల్లో నీటి ఎద్దడిపై చర్చ జరుగుతోంది. నగరాలు, పట్టణాలతోపాటు గ్రామాల్లోనూ రానున్న వేసవిలో నీటి కష్టాలు ఎలా ఉంటాయోననే ఆందోళన ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో జనాభాలోనూ, పారిశ్రామికపరంగానూ పెద్ద నగరాల్లో ఒకటి, పర్యాటక ఆకర్షణ కూడా కలిగిన విశాఖపట్నంపై వేసవి ప్రభావం ఎలా ఉండబోతోందన్న చర్చ కూడా నడుస్తోంది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) పరిధిలోని విశాఖపట్నం నగర జనాభా 22 లక్షలు. విశాఖకు రోజూ ఎంత తాగునీరు కావాలి? ఇక్కడ తాగునీటి సమస్య ఏ స్థాయిలో ఉంది?వేసవిలో జీవీఎంసీ పరిధిలో నీటి అవసరాలకు సరిపడ నిల్వలు ఉన్నాయా? జీవీఎంసీకి నీటి సరఫరా వనరులు ఏమిటి?
 
విశాఖ నీటి వనరులు ఏమిటి?
జీవీఎంసీ పరిధిలోని ప్రజలు, పరిశ్రమల రోజువారీ అవసరాలకు నీటిని జీవీఎంసీయే సరఫరా చేస్తుంది. నగరంలో తాగు నీటిని కుళాయిల ద్వారా అందిస్తుండగా, శివారు ప్రాంతాలకు జీవీఎంసీ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తోంది. నగర జనాభాతో పాటు విశాఖలోని పరిశ్రమలకు నీటిని సరఫరా చేసే బాధ్యత కూడా జీవీఎంసీదే. విశాఖకు ప్రధానంగా ఏడు రిజర్వాయర్ల నుంచి నీరు సరఫరా అవుతుంది. ఏలేరు, రైవాడ, తాటిపూడి, ముడసర్లోవ, మేఘాద్రి గెడ్డ, గోస్తాని, గంభీరం రిజర్వాయర్లు అందులో ఉన్నాయి.
 
ఏలేరు నుంచి రోజుకు 42.65 మిలియన్ గ్యాలన్లు, రైవాడ నుంచి 13.20, తాటిపూడి నుంచి 10.01, మేఘాద్రి గెడ్డ నుంచి 8.01, గోస్తనీ నుంచి 5, గంభీరం నుంచి 1.10, ముడసర్లోవ నుంచి 1.1 మిలియన్ గ్యాలన్ల చొప్పున నీరు సరఫరా అవుతోంది. వీటికి అదనంగా ఇతర పబ్లిక్ వాటర్ స్కీమ్స్ అంటే, బావులు, బోర్ల ద్వారా విశాఖకు 5.45 ఎంజీడీల(మిలియన్ గ్యాలన్స్ పర్ డే) నీరు రోజూ వినియోగంలోకి వస్తుంది. ఒక గ్యాలన్ అంటే 4.546 లీటర్లు.
 
విశాఖకు రోజూ 80 ఎంజీడీల నీరు అవసరం అవుతుంది. ఇందులో 15 ఎంజీడీలు పరిశ్రమలకు అందిస్తారు. ఏలేరు నుంచి వచ్చే నీటితోనే జీవీఎంసీ పరిధిలోని రోజువారీ 60 శాతం నీటి అవసరాలు తీరుతాయి. విశాఖకు వివిధ రిజర్వాయర్ల నుంచి వచ్చే నీటిని 11 ట్రీట్‌మెంట్ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేస్తారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఏలేరు నుంచి విశాఖకు 125 ఎంజీడీల నీటిని సరఫరా చేసే విధంగా పైప్‌లైన్‌ పనులు జరుగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే అక్కడి నుంచి నీరు విశాఖకు తీసుకొస్తారు.
 
ఏలేరు కీలకం
తాగునీటితోపాటు నగర పరిధిలో ఉన్న స్టీల్‌ ప్లాంటు, ఎన్‌టీపీసీ, ఏపీఐఐసీ, గంగవరం పోర్టు, వైజాగ్‌ పోర్టు ట్రస్టు వంటి పరిశ్రమలకు అవసరమైన నీరు కూడా ఏలేరు నుంచే సరఫరా అవుతుంది. ఏలేరు రిజర్వాయర్‌ నీటిని వ్యవసాయ అవసరాలకు విడుదల చేస్తూనే, నగర తాగునీటి, పరిశ్రమల అవసరాలకు కేటాయిస్తుంటామని జీవీఎంసీ సూపరింటెండెంట్ ఇంజినీర్ కేవీఎన్ రవి బీబీసీతో చెప్పారు.
 
ఏయే రిజర్వాయర్ నుంచి ఎంతెంత?
vizag water
విశాఖకు వివిధ రిజర్వాయర్ల నుంచి వచ్చే నీటిని 11 ట్రీట్‌మెంట్ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేస్తారు. కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సెంట్రల్ పబ్లిక్ హెల్త్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ ఆర్గనైజేషన్(సీపీహెచ్‌ఈఈవో) నిబంధనల ప్రకారం, ప్రతి వ్యక్తికి రోజుకు 135 లీటర్ల నీటిని సరఫరా చేయాల్సి ఉంది. అయితే 110 నుంచి 115 లీటర్ల వరకే జీవీఎంసీ సరఫరా చేయగలుగుతోంది. విశాఖలోని ముడసర్లోవ రిజర్వాయర్‌పై ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ నిర్మించారు. ఇది నగరవాసుల తాగునీటి అవసరాలతో పాటు విద్యుత్ అవసరాన్ని కొంత మేర తీరుస్తోంది.
 
జులై వరకు ఇబ్బంది లేదు: జీవీఎంసీ
విశాఖలో పరిశ్రమలకు నీరు, ప్రజల తాగునీటి అవసరాలకు సరిపడ నీటిని ప్రస్తుతానికి జీవీఎంసీ సరఫరా చేయగలుగుతోంది. వేసవిలో మరింత ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ, రిజర్వాయర్లలో కొద్దిమేర నీటిమట్టం తగ్గినా నగరవాసుల నీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని జీవీఎంసీ అధికారులు చెప్పారు. ప్రస్తుత నిల్వలు జులై వరకు తాగు, పరిశ్రమల అవసరాలకు సరిపోతాయని సూపరింటెండెంట్ ఇంజినీర్ రవి చెప్పారు.
 
“మంచినీటి బోర్లు, మోటార్లు, పైపులు, కుళాయిలకు మరమ్మతులు అవసరమైతే తక్షణమే చేస్తున్నాం. తాగునీరు వృథా కాకుండా నీటి వనరులు, వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. ఏలేరు నుంచి మేఘాద్రి గెడ్డకు పంపింగ్ ద్వారా నీటిని పంపించేలా ప్రయత్నం చేస్తున్నాం. ఏప్రిల్ 15 నుంచి జులై వరకు ఈ ప్రయోగం చేయడం ద్వారా రోజుకు అదనంగా 50 క్యూసెక్కుల నీటిని విశాఖ ప్రజలు వినియోగించుకునే అవకాశం లభిస్తుంది” అని జీవీఎంసీ కమిషనర్ సాయి శ్రీకాంత్ వర్మ చెప్పారు.
 
‘వర్షాలు పడకపోతే తప్ప ఇబ్బంది రాదు’
విశాఖకు అవసరమైన స్థాయిలో నీటి సరఫరాకు ప్రస్తుతానికి ఇబ్బందులు లేనప్పటికీ, రానున్న వేసవిలో ఉష్ణోగ్రతలు తీవ్రమైనప్పుడు రిజర్వాయర్లలో నీటిమట్టాలు తగ్గుతాయి. ఇది ఏటా జరిగేదే. అయితే జూన్ నుంచి వర్షాలు కురుస్తాయి కాబట్టి, మళ్లీ రిజర్వాయర్ల నీటి మట్టాలు, భూగర్బ జలాలు పెరుగుతాయని జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు. రుతుపవనాల ప్రభావంతో జూన్‌, జులైలో వర్షాలు పడకపోతే మినహా విశాఖలో తాగునీటికి ఇబ్బందులు ఉండవని కేవీఎన్ రవి చెప్పారు. “ఏలేరు రిజర్వాయర్‌తో పాటు మిగిలిన రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఎక్కువగానే ఉన్నాయి. మేఘాద్రి గెడ్డలో ఉన్న నీరు జులై వరకు సరిపోతుంది. ఎలాంటి ఇబ్బందీ ఉండదు” అని ఆయన తెలిపారు.
 
“ఇటు తాగునీటి అవసరాలకు, అటు పారిశ్రామిక అవసరాలకు జీవీఎంసీ సరఫరా చేస్తున్న నీటి విషయంలో నాలుగైదు ఏళ్లుగా ఎలాంటి సమస్యా రాలేదు. ఈ ఏడాది కూడా ఇబ్బంది తలెత్తే అవకాశం లేదు. ఎందుకంటే తగినంత నీటి నిల్వలు రిజర్వాయర్లలో ఉన్నాయి. రిజర్వాయర్లలో పూడికతీత, మరమ్మతులు చేయడం వల్ల నీటి నిల్వలు పెరుగుతూ వస్తున్నాయి. రిజర్వాయర్లు కాకుండా జీవీఎంసీ నీటి అవసరాల కోసం 8,400 బోర్లు కూడా ఉన్నాయి. నగరంలోని తాగునీటి అవసరాలకు రోజూ కుళాయిలకు 45 నిమిషాల నుంచి గంట సమయం వరకు నీటిని సరఫరా చేస్తున్నాం” అని రవి వివరించారు.
 
అధికారుల మాటల్లో నిజమెంత?
జీవీఎంసీ వాటర్ సప్లై విభాగం అధికారులు చెప్పిన విషయాలను బీబీసీ క్షేత్రస్థాయిలో పరిశీలించింది. గత రెండు, మూడు ఏళ్లుగా నగర పరిధిలో పెద్దగా నీటి సమస్య రాలేదు. కాకపోతే అధికారులు చెప్పినట్లు అన్నిచోట్లా నీరు రోజూ 45 నిమిషాల నుంచి గంటపాటు సరఫరా కావడం లేదు. ముఖ్యంగా వేసవిలో ఇది చాలా చోట్ల 20 నుంచి 30 నిముషాల మధ్యే ఉంటోంది. విశాఖపట్నం అక్కయ్యపాలెంలో నివాసముంటున్న గృహిణి సునీత కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఈ పరిస్థితి నగరానికి 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుజాత నగర్, పెందుర్తి ప్రాంతాల్లో కూడా ఉంది.
 
“వర్షాకాలంలో జీవీఎంసీ సరఫరా చేసే తాగునీరు రంగు మారుతుంది. అవి తాగడానికి ఇబ్బంది పడుతున్నాం. ఎండాకాలంలో నీటి సరఫరా వేళలు మారిపోవడంతోపాటు తక్కువ సమయమే నీరు వస్తోంది. ఒక్కోసారి ఒకటి, రెండు రోజులు నీరు రావడం లేదు. మిగతా రోజుల్లో నీటి సరఫరాలో పెద్దగా ఇబ్బందులు ఉండవు” అని సునీత బీబీసీతో అన్నారు. భీమిలిపట్నం నుంచి అనకాపల్లి వరకు గ్రేటర్ విశాఖ పరిధిని పెంచడంతో చాలా చోట్ల తాగునీటి సమస్య కనిపిస్తోంది. “రెండు, మూడేళ్ల క్రితం 30 నుంచి 45 నిమిషాలు నీటిని సరఫరా చేసేవారు. ఇప్పుడు లేదు. దాంతో అపార్ట్‌మెంట్ వాళ్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. బోర్ల మీద ఆధారపడాల్సి వస్తోంది. అదీ సరిపోక ట్యాంకర్లతో జీవీఎంసీ వద్ద నీళ్లు కొనుక్కుంటున్నారు. పోలవరం నీళ్లు వస్తే తప్ప విశాఖకు పూర్తిస్థాయి నీటి సమస్య తప్పినట్లు కాదు” అని విశాఖపట్నం అపార్ట్‌మెంట్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ (వర్వా) కార్యదర్శి పి. నారాయణ మూర్తి బీబీసీకి చెప్పారు.
 
జాగ్రత్తపడాలి: జియాలజీ నిపుణులు
విశాఖపట్నంలో ప్రస్తుతానికి పరిస్థితి బాగానే ఉందని, కానీ, భవిష్యత్తులో విశాఖలో నీటి సమస్య వచ్చే అవకాశాలున్నందున ప్రజలు తాగునీటిని వృథా చేయకుండా వినియోగించడంతో పాటు భూగర్భ జలాలను పెంపొందించే విధంగా చూడాలని జియాలజీ ప్రొఫెసర్ ఏవీఎస్ఎస్ ఆనంద్ చెప్పారు. విశాఖలో అపార్ట్‌మెంట్లు, వ్యాపార సముదాయాలలో నీటి అసవరాల కోసం ఎక్కువ అడుగులు బోర్లు తీయిస్తున్నారని, ఇది భూగర్భ జలాలను కలుషితం చేసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
 
తీర ప్రాంతానికి ఆనుకుని నగరం ఉండటంతో బోర్లు కొట్టి, నీరుపడని చోట ఉప్పు నీరు చేరే అవకాశం ఉంది. ఇది భూగర్భ జలాలను ఉప్పుమయం చేస్తుంది. ‘‘విశాఖలో రాతి నేలలు అధికంగా ఉండటంతో, వర్షం కురిసిన నీరు 7 నుంచి 10 శాతం మాత్రమే భూగర్భ జలాలుగా మారుతుంది. ఇది 15 శాతం ఉండాలి. కనుక విశాఖ వాసులు నీటి వనరులను వృథా చేయకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది’’ అని ప్రొఫెసర్ ఆనంద్ చెప్పారు.