గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Updated : సోమవారం, 26 ఆగస్టు 2019 (14:48 IST)

బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం... ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్ సింధు

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చరిత్ర సృష్టించింది. ఈ మెగా టోర్నీలో తొలిసారి భారత్‌కు ఆమె స్వర్ణ పతకం సాధించిపెట్టింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు 21-7, 21-7 తేడాతో ప్రత్యర్థి నొజొమి ఒకుహారా (జపాన్)ను చిత్తు చేసింది. దీనికి ముందు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఏ విభాగంలోనూ భారత్‌కు స్వర్ణం దక్కలేదు.
 
అంతకుముందు సెమీస్‌లో సింధు చైనా క్రీడాకారిణి చెన్ యూ ఫీపై విజయం సాధించింది. సింధుకు ప్రపంచ చాంపియన్‌షిప్‌ టోర్నీలో ఇది ఐదో పథకం. ఇదివరకు రెండు రజతాలు, రెండు కాంస్యాలు ఆమె సొంతం చేసుకుంది. మహిళల సింగిల్స్ విభాగంలో 2013, 2014ల్లో కాంస్యాలు సాధించిన ఆమె.. 2017, 2018ల్లో ఫైనల్స్ వెళ్లినా, రజతాలతో సరిపెట్టుకుంది.
 
ఏకపక్షమే.. 
ఫైనల్ మ్యాచ్‌లో సింధు ఒకుహారాపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ప్రత్యర్థికి ఏ దశలోనూ అవకాశమే ఇవ్వలేదు. రెండు గేమ్‌లనూ 21-7 స్కోరుతో సొంతం చేసుకుంది. సింధుకు ఇది వరుసగా మూడో ప్రపంచ చాంపియన్‌షిప్‌ ఫైనల్. స్విట్జర్లాండ్‌లోని బేసెల్‌లో ఈ సారి టోర్నీ జరుగుతోంది. పతకం అందుకుంటూ ఈ విజయాన్ని తన తల్లి పి.విజయకు అంకితం చేస్తున్నట్లు సింధు ప్రకటించింది. ‘‘ఈ రోజు అమ్మ పట్టిన రోజు. అందుకే, ఈ పతకాన్ని ఆమెకే అంకితం ఇస్తున్నా’’ అని చెప్పింది.
 
ప్రశంసల వెల్లువ 
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన సింధుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సింధు మరోసారి దేశం గర్వించే విజయం సాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. భావి తరాలకు ఆమె విజయాలు స్ఫూర్తిగా నిలుస్తాయని వ్యాఖ్యానించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు కూడా సింధుకు అభినందనలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.