షాద్ నగర్ అత్యాచారంపై రేణూ దేశాయ్ అభిప్రాయం: ‘‘ఒక తల్లిగా నేను నా కూతుర్ని నిరంతరం భయంతో పెంచటం మాత్రమేనా?’’

బిబిసి| Last Modified సోమవారం, 2 డిశెంబరు 2019 (12:07 IST)

భారతదేశంలో ఒక మామూలు రోజు...

హైదరాబాద్‌లో ఒక డాక్టర్‌ మీద అత్యాచారం చేసి సజీవ దహనం చేశారు.
రాంచీలో ఒక 25 ఏళ్ల విద్యార్థిని మీద 12 మంది పురుషులు అత్యాచారం చేసి హత్య చేశారు.
తమిళనాడులో ఒక బాలిక మీద సామూహిక అత్యాచారం చేసి చంపేశారు.
ఛత్తీస్‌గఢ్‌లో మరొక బాలిక మీద ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడు.

నవంబర్ 28వ తేదీన ఇంటర్నెట్‌లో పోస్టు చేయటానికి ఒక కొత్త హ్యాష్‌ట్యాగ్ లభించింది. ఆ వార్త వెలువడిన వెంటనే బాధితురాలి పేరుమీద హ్యాష్ ట్యాగ్ వైరల్‌గా మారింది. మన దేశంలో ప్రతి అత్యాచార ఘటనా ఒక అర్థరహిత అంకె. ప్రతి అమాయక బాధితురాలూ కేవలం ఒక హ్యాష్‌ ట్యాగ్. మనం అందరమూ ఒక సమాజంగా విఫలమవుతున్నాం. ఒక సమాజంగా పురోగమించటానికి బదులు తిరోగమిస్తున్నాం. బాలికకు చదువు చెప్పించినంత మాత్రాన ఆమెకు భద్రత లభించదు.

మన మగపిల్లాడికి భిన్నమైన విద్యా వ్యవస్థ అవసరం. స్త్రీ స్వరూపం గురించి అతడికి బోధించాల్సిన అవసరముంది. ఒక స్త్రీ కేవలం ఒక తల్లి, ఒక చెల్లి, ఒక భార్య మాత్రమే కాదని.. ఆమెకు ఆమెగా ఒక వ్యక్తి అని పురుషులకు వివరించాల్సి ఉంది. వినియోగించుకోవటానికి, దుర్వినియోగం చేయటానికి ఆమె ఒక వినియోగ వస్తువు కాదని చెప్పాలి.


దేవతల మహిళా రూపాలను అత్యుత్సాహంతో కొలిచే ఒక దేశంలో మహిళలను అత్యధికంగా అవమానిస్తున్న, అకృత్యాల పాలు చేస్తున్న తీరును నేను ఎన్నడూ జీర్ణం చేసుకోలేను. పురుషులు దేవుళ్ల గదిలో లక్ష్మీదేవికి అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. ఆమె మానవ రూపం మీద అకృత్యాలు జరుపుతారు.

హైదరాబాద్‌కు చెందిన ఆ వెటర్నరీ డాక్టర్ విద్యావంతురాలైన యువతి. జనసమ్మర్థమైన ఒక రాజధాని నగరంలో తన రోజు వారీ విధులను నిర్వర్తిస్తోంది. ఆమె ధరించిన దుస్తులను కానీ, ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయాన్ని కానీ, ఆమె ప్రవర్తనను కానీ మనం తప్పుపట్టలేం. అయినా కానీ ఆమె మీద పాశవికంగా అత్యాచారం చేశారు. ఆమెను అమానవీయంగా హత్యచేశారు. అదే సమయంలో మరో నగరంలో ఒక యువతి తన పుట్టిన రోజున గుడికి వెళుతుంది. ఆమె సహ విద్యార్థి ఆమెపై అత్యాచారం చేసి చంపేస్తాడు!

నా రక్తం నిస్సహాయతతో రగిలిపోతోంది. ఒక పౌరురాలిగా నేను చేయగలిగిన అతి పెద్ద పని.. సోషల్ మీడియాలో పోస్టు చేసి హ్యాష్‌ట్యాగ్‌లతో ఆగ్రహం వెలిబుచ్చటం మాత్రమేనా. ఒక తల్లిగా నేను చేయగలిగింది.. నా కూతురును నిరంతరం భయంతో పెంచటం మాత్రమేనా. ఆమెకు నాట్యసంగీతాలు నేర్పించటానికి బదులు.. ఆమెకు నేను ఆత్మరక్షణ నేర్పించాల్సి ఉంటుంది. ఓ అందమైన, సున్నితమైన బాలికకు జన్మనిచ్చినందుకు సంతోషించటానికి బదులు.. ఆమె భద్రత గురించి దిగులు పడుతూ నేను రాత్రిళ్లు జాగారం చేయాలి.

ఒక ఆవును చంపినందుకు ఒక పురుషుడిని ఒక గుంపు కొట్టి చంపింది. కానీ ఒక మహిళను కిరాతకంగా అత్యాచారం చేసి హత్యచేస్తే కేవలం అంతులేని చర్చలు జరుగుతాయి. సత్వర విచారణలు, శిక్షలు తక్కువ. నేరస్తులు భయపడే వాతావరణం లేదు. నేరం చేయాలంటే భయపడే పరిస్థితులు ఉండాలి.


ఆడపిల్లను కాపాడటం గురించి, చదువు చెప్పించటం గురించి మన ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. కానీ పనిచేసే మహిళలకు కనీస రక్షణ కల్పించటంలో ఎందుకు విఫలమవుతోంది. బాగా చదువుకున్న తరువాత ఒక మహిళ ఏం చేస్తుంది? భయంతో ఇంటి దగ్గర కూర్చుంటుందా లేక బయటకు వెళ్లి కిరాతకంగా అత్యాచారానికి, హత్యకు గురయ్యే ప్రమాదంలో పడుతుందా? రోజువారీ పనులు చేసుకోవడానికి కూడా ముందూ వెనుకా చూసుకోవాల్సిన పరిస్తితి తలెత్తడమే సరైంది కాదు. నేను కూడా కొన్నిసార్లు.. షూటింగ్ రాత్రి పొద్దుపోయే వరకూ జరిగినపుడు ప్రొడక్షన్ కారులో కేవలం ఒక డ్రైవరుతో కలిసి ప్రయాణించటానికి భయపడతాను. రోజంతా సుదీర్ఘంగా కష్టపడి పనిచేసిన తర్వాత భయం ప్రధాన భావోద్వేగంగా ఉండకూడదు!

ఒక స్వల్పకాలిక, దీర్ఘకాలిక పరిష్కారాన్ని అమలు చేయాలి. అవి చిన్ని చిన్ని అడుగులు కావచ్చు. అన్నిటికన్నా మొదటి అడుగు.. నేరం చేసినవారికి సత్వరం కఠిన శిక్ష పడుతుందనే భయం ఉండాలి. సత్వర విచారణలు జరగాలి. ప్రభుత్వం దీనిని జాతీయ అత్యవసర ప్రాతిపదికన అమలు చేయాల్సి ఉంది.


మన దేశ రాజధాని.. మహిళల మీద జరిగే నేరాలకు అత్యధిక శిక్షలతో ఒక ప్రమాణాన్ని నిర్ణయించినపుడు మిగతా రాష్ట్రాలు దానిని అనుసరిస్తాయి.

పురుషుడికి లైంగిక వాంఛలు సవ్యంగా తీరక అర్రులు చాస్తున్నట్టు అనిపిస్తోంది. అతడికి స్త్రీ గురించి ఎటువంటి బోధనా లేదు. మనం దాని గురించి మాట్లాడం. మాట్లాడటానికి ఇష్టపడం. సెక్స్ గురించి బాలురితో మాట్లాడటం, వారికి బోధించటం నిషిద్ధం. సంప్రదాయం, సంస్కృతి ముసుగులో సమాజంలోని అతి కింది వర్గం నుంచి అత్యంత సంపన్న వర్గం వరకూ.. స్త్రీ గుర్తింపును చాప కింద దాచేశారు. పితృస్వామ్యాన్ని ఆమోదించాం , బాధితులపైనే బండలు వేయడానికి అనుమతిస్తున్నాం.. సెక్స్ అనే అంశం పట్ల మనం కళ్లు మూసేసుకుంటాం. రొమ్ములు, యోని అనేవి చెడ్డ పదాలైపోయాయి. అపవిత్రమైన అంశాలైపోయాయి. బిడ్డకు పాలందించే భాగాలను కూడా అలాగే చూసే పరిస్థితి. తాము ఎక్కడినుంచి వచ్చామో అదే భాగాలపై దాడులు చేసే పరిస్థితి.

మహిళల మీద అకృత్యాల పైన ధర్మయుద్ధాన్ని మగాళ్లు చేపట్టనిదే.. ఇది కేవలం మరొక వ్యాసంగా, మరొక హ్యాష్‌ట్యాగ్ మిగులుతుంది! తర్వాతి బాధితురాలు తమ సొంత వారు కావచ్చుననే కఠోర వాస్తవాన్ని తండ్రులు, అన్నలు, తమ్ముళ్లు, మగ బంధువులు తెలుసుకోవలసిన సమయం ఆసన్నమైంది. చేసిన నేరాలకు సత్వర విచారణ జరిగి శిక్షలు వేగంగా పడేలా వ్యవస్థలో మార్పులు తేవాలని డిమాండ్ చేయాల్సిన సయమం ఆసన్నమైంది.

దీనిపై మరింత చదవండి :