గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శనివారం, 26 అక్టోబరు 2019 (14:27 IST)

బీజేపీ విజయాలకు కారణం కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ లేకపోవడమేనా - అభిప్రాయం

నిరుద్యోగ రేటు గత 45 ఏళ్లలోనే అత్యధిక స్థాయికి చేరుకున్నా, గత లోక్‌సభ ఎన్నికల్లో తిరుగులేని విజయంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఆర్థికపరమైన ప్రదర్శన ఎన్నికల అంశమే కాదన్నట్లుగా పరిస్థితిని బీజేపీ మార్చేసిందా అని కొందరు ఆశ్చర్యపోయారు.

 
2014 లోక్‌సభ ఎన్నికల కన్నా 2019లో మోదీ ఎక్కువ సీట్లు గెలుచుకున్నారు. కశ్మీర్‌లో జరిగిన మిలిటెంట్ దాడికి ప్రతీకార చర్యగా పాకిస్తాన్‌లోని బాలాకోట్‌పై జరిపిన వైమానిక దాడులు ఆయన విజయానికి ఎంతగానో తోడ్పడ్డాయి. కూడు, గూడు, గుడ్డ లాంటి అంశాల కన్నా జాతీయవాదానికే భారతీయ ఓటర్లు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా అన్న ప్రశ్న అప్పుడు తలెత్తింది. అయితే, పేదలకు గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం, ఇళ్లు, మరుగుదొడ్ల నిర్మాణం, అనేక సంక్షేమ పథకాలు తెచ్చినందుకు ప్రతిఫలంగానే మోదీ ఆ విజయం సాధించారని కొందరు వాదించారు.

 
ఈ సంక్షేమం, జాతీయవాదాలకు కూడా పరిమితులు ఉన్నాయని ఇప్పుడు మనం చెప్పొచ్చు. దేశంలోనే అత్యధికంగా హరియాణాలో 28.7 శాతం నిరుద్యోగ రేటు ఉందని గత నెలలో సెంటర్ ఫర్ మానిటరింగ్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ ఓ నివేదికలో చెప్పింది. గత లోక్‌సభ ఎన్నికల్లో హరియాణాలో బీజేపీకి 58 శాతం ఓట్లు రాగా, అసెంబ్లీ ఎన్నికల్లో అది 36.3 శాతానికి పడిపోయింది. 90 అసెంబ్లీ సీట్లలో 75 గెలవడం తమ లక్ష్యమన్న ఆ పార్టీ 40 సీట్లు మాత్రమే గెలిచింది.

 
స్వతంత్రుల మద్దతుతో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అయితే, ప్రధాన ప్రతిపక్షం గట్టిగా తలపడి ఉంటే బీజేపీ అధికారానికి దూరమై ఉండేదన్న విషయం స్పష్టమైంది. హరియాణాలో గురుగ్రామ్‌లోని ఆటోమొబైల్ రంగంలో చాలా ఉద్యోగాలు పోయాయి. రాష్ట్రంలో రైతులు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు. రెండేళ్లుగా పంటల ధరలు పడిపోతూ వస్తున్నాయి.

 
ఈ ఎన్నికల్లో కమల వికాసం అంతగా లేకపోవడానికి ఆర్థిక మందగమనం కూడా ఓ కారణమని బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్‌కు చెందిన ఓ నాయకుడు అభిప్రాయపడ్డారు. ''ప్రభుత్వం ఉద్దీపన చర్యలు ప్రకటిస్తున్నా, ఆర్థిక మందగమనం గురించి ఆందోళనలు అలాగే ఉన్నాయి'' అని అన్నారు.

 
మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అయితే, ఆ పార్టీకి సీట్లు తగ్గాయి. దుందుడుకు భాగస్వామైన శివసేనపై ఇప్పుడు ఆధారపడాల్సి ఉంటుంది. బీజేపీ, శివసేనలను కలిపి చూస్తే మునుపటి కన్నా వాళ్లు కోల్పోయిన ఓట్ల శాతం తక్కువే. సాధారణ పరిస్థితుల్లో దీన్నొక మంచి విజయంలానే చూస్తారు.

 
ఐదేళ్లు పాలన అందించి, వెంటనే మళ్లీ అధికారంలోకి రావడం అన్ని ప్రభుత్వాలకూ సాధ్యమయ్యే పని కాదు. కానీ ప్రతిపక్షం బలహీనంగా ఉన్న ఈ సమయంలో.. నరేంద్ర మోదీ, దేవేంద్ర ఫడ్నవీస్ లాంటి బలమైన నాయకులు కలిగి ఉన్న బీజేపీ లాంటి పార్టీకి సీట్లు పెరగాలి గానీ, తగ్గకూడదు.

 
ఆర్థిక పరిస్థితుల గురించి చర్చ లేకుండా ఆర్టికల్ 370 చుట్టూనే హరియాణా, మహారాష్ట్రల్లో బీజేపీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి తొలగిస్తూ ఆగస్టు 5న ఈ ఆర్టికల్‌ను మోదీ ప్రభుత్వం సవరించిన సంగతి తెలిసిందే. రెండు రాష్ట్రాల్లో జాతీయవాదం తమని గెలిపిస్తుందని, ఆర్థిక పరిస్థితులను జనాలు పట్టించుకోరని బీజేపీ ఆశించింది. వేరే మాటల్లో చెప్పాలంటే, గత లోక్‌సభ ఎన్నికల ఫలితాలే పునరావృతమవ్వాలని కోరుకుంది.

 
నిజానికి అలాంటిదే జరిగింది. ఆర్టికల్ 370, పాకిస్తాన్‌తో తగవులు, ప్రతిపక్షాలపై జాతివ్యతిరేకులన్న నిందలు, అక్రమ వలసదారులను దేశం నుంచి వెళ్లగొడతామన్న హామీలు లేకపోతే ఎన్నికల ప్రచారంలో చెప్పుకోవడానికి బీజేపీకి ఏమీ ఉండేది కాదు. ఆర్థిక పరిస్థితులు చర్చకు రాకుండా, ఆర్టికల్ 370ని ప్రచారంలో ప్రధానాంశంగా మార్చుకుంది ఆ పార్టీ.

 
కానీ, ఆర్థికపరమైన అంశాలకు ప్రాధాన్యత ఉంటుంది. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మందగమనం తీవ్రమవుతోంది. 2013-14లో అప్పటి ఆర్థిక పరిస్థితులను వాడుకుని మోదీ లోక్‌సభ ఎన్నికల్లో గొప్ప విజయం సాధించారు. అయితే, అప్పటి నుంచి చూస్తే భారత ఆర్థిక ప్రగతి అత్యంత దీన స్థితికి చేరింది మళ్లీ ఇప్పుడే.

 
గత కొన్నేళ్లలో మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. పంట రుణాల మాఫీ ప్రజలకు చేరుకోవడం లేదు. ఇదొక సమస్యేనని, ఎన్నికల్లో ప్రభావం చూపించవచ్చని ఎన్నికలకు ముందు ఫడ్నవీస్ ప్రభుత్వంలోని ఓ మంత్రి వ్యాఖ్యానించారు. ఆర్థికపరమైన విషయాలకు కూడా ప్రాధాన్యత ఉంటుందని ఈ ఎన్నికల్లో హరియాణా, మహారాష్ర్టలోని ఓటర్లు సందేశం ఇచ్చారు. అయితే సమస్య ఉందని మోదీ ప్రభుత్వం అంగీకరించడం లేదు. దీన్ని సమర్థించుకునేందుకు అప్పుడప్పుడు అడ్డగోలు ప్రకటనలు కూడా చేస్తోంది.

 
''ప్రజలు సినిమాలు చూస్తున్నారుగా. గురుత్వాకర్షణ శక్తి కనుక్కునేందుకు ఐన్‌స్టీన్‌కు గణితం ఉపయోగపడలేదు. మిలీనియల్స్ కార్లను కొనుక్కోవడానికి ఇష్టపడటం లేదు''.. ఇవీ మోదీ మంత్రివర్గంలోని కొందరు సహచరులు సమర్థించుకుంటూ చెప్పిన మాటలు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడీపీ వృద్ధి రేటు 7.5 శాతం ఉండొచ్చని ప్రపంచ బ్యాంకు గత ఏప్రిల్‌లో అంచనా వేసింది. అక్టోబర్‌లో దాన్ని సవరించి 6 శాతానికి తగ్గించింది.

 
మోదీ ప్రభుత్వంలో గతంలో ప్రధాన ఆర్థిక సలహాదారుగా పనిచేసిన అరవింద్ సుబ్రమణ్యన్ భారత జీడీపీ వృద్ధి రేటును 2.5 శాతం పాయింట్లు ఎక్కువగా అంచనా వేశారని అభిప్రాయపడ్డారు. మరో రకంగా చెప్పాలంటే, భారత జీడీపీ వృద్ధి రేటు 5 శాతం కన్నా తక్కువగా ఉండొచ్చు. గత కొన్నేళ్లలో భారత వృద్ధి రేటు ఈ స్థాయికి దిగజారలేదు.

 
ప్రైవేటు పెట్టబడులు, వినియోగదారుల నుంచి డిమాండ్ తగ్గిపోవడంతో ఈ మందగమనం ఏర్పడింది. దేశంలోని యువతకు మంచి ఉద్యోగాలు రావడం లేదు. నిజానికి, ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. వేతనాల్లో వృద్ధి లేదు. తగ్గిపోతున్నాయి కూడా. ద్రవ్యోల్బణం తక్కువగా ఉన్నప్పటికీ, తమ జేబుకు చిల్లు పడుతున్నట్లు జనాలు భావిస్తున్నారు. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే.. బిస్కెట్లు, అండర్‌వేర్ల లాంటి ఉత్పత్తుల విక్రయాలు కూడా పడిపోయాయి.

 
ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేకతను హరియాణా, మహారాష్ట్రల్లో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ భారీ స్థాయిలో వాడుకుంటుందని అందరూ అభిప్రాయపడతారు. నిజానికి, దేశవ్యాప్తంగా ఆ పార్టీ ఈ పని చేయొచ్చు. ఆర్థికపరమైన అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అక్టోబర్‌లో జాతీయవ్యాప్త కార్యక్రమాన్ని చేపడతామని సెప్టెంబర్‌లో ప్రకటించింది. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని నవంబర్‌లో చేపడతామని అంటోంది.

 
హరియాణాలో నిరుద్యోగ భృతి ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ, క్షేత్ర స్థాయిలో ఆ పార్టీ ప్రచారం పెద్దగా జరగలేదు. పార్టీలో నాయకత్వ సంక్షోభం ఉంది. భూపిందర్ సింగ్ హుడాను ఆఖర్లో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిని చేశారు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ప్రచారం చేయలేదు. రాహుల్ గాంధీ కొన్ని సభల్లో పాల్గొన్నారు. నిరుద్యోగ అంశాన్ని ఆయన పెద్దగా ప్రస్తావించింది లేదు. డిపాజిటర్లకు నష్టం కలిగిస్తూ ఓ సహకార బ్యాంకు పతనమైన విషయాన్ని ముంబయిలోని సభలో రాహుల్ ప్రస్తావించనేలేదు. అసలు ఈ రెండు రాష్ట్రాల్లో గెలిచేందుకు కాంగ్రెస్ ప్రయత్నించలేదు.

 
ఆర్థిక మందగమనం ఉన్నా మహారాష్ట్ర, హరియాణాల్లో బీజేపీ గెలిచిందంటే, ఆ పరిస్థితులను ఎలా సద్వినియోగం చేసుకోవాలో కాంగ్రెస్‌కు తెలియకపోవడం వల్లే. బీజేపీతో ఓటర్లు విభేదిస్తున్నారని తాజా ఫలితాలు సూచిస్తున్నాయి. ఈ పరిణామాలు ప్రతిపక్షానికి కాస్త ప్రోత్సాహాన్నిచ్చేవే.

 
ఆర్థిక మందగమన సమస్యను పరిష్కరించాల్సిందేనని బీజేపీకి హరియాణా, మహారాష్ట్ర ఓటర్లు స్పష్టమైన సందేశం ఇచ్చారు.
 
(అభిప్రాయాలు వ్యాసకర్త వ్యక్తిగతం)