బుధవారం, 15 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 12 సెప్టెంబరు 2024 (16:51 IST)

ప్రకాశం బరాజ్‌‌ను బోట్లు ఢీకొనడం ప్రమాదమా, కుట్రా? ఇవీ 3 ప్రధానమైన అనుమానాలు

విజయవాడను బుడమేరు ముంచెత్తి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలోనే కృష్ణానదిపై ఉన్న ప్రకాశం బరాజ్ పిల్లర్ల వద్దకు కొట్టుకొచ్చిన బోట్లతో ఏపీలో రాజకీయం వేడెక్కింది. బరాజ్‌ను ఢీకొట్టి అక్కడి కౌంటర్ వెయిట్‌లు దెబ్బతినడానికి కారణమైన బోట్లు మీ పార్టీ వాళ్లవే అంటే మీ పార్టీ వాళ్లవేనంటూ టీడీపీ, వైసీపీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రకాశం బరాజ్‌ను బోట్లు ఢీకొట్టిన ఘటనలో విజయవాడ వన్ టౌన్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. కుక్కలగడ్డకు చెందిన ఉషాద్రి, సూరాయపాలేనికి చెందిన కోమటి రామ్మోహన్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరిని విజయవాడ కోర్టులో హాజరుపరచగా ఇద్దరు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నిందితులను పోలీసులు జిల్లా జైలుకు తరలించారు.
 
ఇంతకీ నిందితులది ఏ పార్టీ?
ప్రకాశం బరాజ్‌కు బోట్లు కొట్టుకొచ్చిన ఘటనలో కుట్ర కోణం ఉందనే అనుమానాలున్నాయంటూ జలవనరుల శాఖ ఉద్యోగులు ఫిర్యాదు చేయడంతో ఉషాద్రి, కోమటి రామ్మోహన్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ మీ పార్టీ వాళ్లేనంటూ టీడీపీ, వైసీపీలు ఒకరిపై ఒకరు ‘ఎక్స్’ వేదికగా పార్టీల అధికారిక హ్యాండిల్స్ నుంచి విమర్శలు, ప్రతి విమర్శలు చేయడం మొదలైంది. వారి విమర్శలకు సాక్ష్యాలుగా ఆయా పార్టీల నాయకులతో ఉషాద్రి, రామ్మోహన్ ఉన్న ఫొటోలను కూడా పోస్ట్ చేశారు. దీంతో ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది.
 
“నీ అనుచరులు ఇద్దరూ అరెస్టయ్యారు. వాళ్ల ఫోన్ కాల్ డేటా, గూగుల్ టేక్ అవుట్ అన్నీ తీస్తున్నారు. నీ బాగోతం బయటకు వస్తుంది. ఎందుకీ తప్పుడు బతుకు వైఎస్ జగన్” అంటూ సెప్టెంబర్ 9న టీడీపీ ట్వీట్ చేసింది. దీనికి సమాధానం ఇస్తూ “మీరు చెబుతున్న నిందితుల్లో ఒకరైన కోమటి రామ్మెహన్ మీ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం ప్రతినిధి కోమటి జయరాం బంధువు, ఇక రెండో నిందితుడు ఉషాద్రి కూడా టీడీపీకి చెందిన వ్యక్తే. మీ లోకేష్ తో అతను సన్నిహితంగా ఉన్న ఫొటోలున్నాయి” అంటూ వైసీపీ ట్వీట్ చేసింది.
 
ప్రకాశం బరాజ్‌కు బోట్లు ఎలా వచ్చాయంటే...
ఆగస్ట్ 30, 31 తేదీల్లో కురిసిన భారీ వర్షాలకు సెప్టెంబర్ 1 రాత్రి నాటికి ప్రకాశం బరాజ్‌కు దాదాపు 11.50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. దీంతో బరాజ్ 70 గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడిచిపెట్టారు. ఆ సమయంలోనే ఆ వరద ప్రవాహంలో ప్రకాశం బరాజ్‌కు గొల్లపూడి వైపు నుంచి అయిదు బోట్లు కొట్టుకుని వచ్చాయి. అందులో ఒక బోటు అప్పటికే దిగువకు వదులుతున్న నీటితో పాటు కొట్టుకుపోగా... మరో నాలుగు బోట్లు బరాజ్ పిల్లర్లను ఢీకొట్టి అక్కడే పిల్లర్లు, బరాజ్ గేట్ల మధ్య ఇరుక్కుపోయాయి. ఆ బోట్లు ఢీకొట్టడంతో పిల్లర్ నెంబర్ 69కి సంబంధించిన కౌంటర్ వెయిట్ (కాంక్రీట్ బీమ్) విరిగింది.
 
ఈ విషయంపై రిపోర్టింగ్ చేసేందుకు సెప్టెంబర్ 2న మీడియా అంతా ఉదయం 11 గంటల సమయంలో ప్రకాశం బరాజ్ కు చేరుకుంది. ‘బీబీసీ తెలుగు’ కూడా బరాజ్ కౌంటర్ వెయిట్ ఎలా దెబ్బతిందనే విషయాన్ని షూట్ చేస్తుండగానే... అక్కడున్న బోట్లు ప్రవాహధాటికి మరోసారి కదిలి మళ్లీ బలంగా పిల్లర్ నెంబర్ 67ని ఢీకొట్టాయి. దీంతో అక్కడున్న మరో కౌంటర్ వెయిట్ కూడా దెబ్బతింది. దీంతో అక్కడ ఏం జరుగుతుందనే ఆందోళన మొదలైంది. పోలీసులు వెంటనే బరాజ్‌పై రాకపోకలను నిలిపివేశారు.
 
బోట్లు ఢీ కొట్టిన ఘటనలో 67, 69 గేట్ల వద్ద ఉండే కౌంటర్‌ వెయిట్లు మధ్యకు విరిగిపోయి ధ్వంసమయ్యాయి. 70వ నంబర్ కౌంటర్‌ వెయిట్‌కు కూడా పగుళ్లు ఏర్పడ్డాయి. జలవనరుల ఇంజనీరింగ్ నిపుణుడు కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో ఈ మూడింటి స్థానంలో కొత్త స్టీల్‌ కౌంటర్‌ వెయిట్లను ఏర్పాటు చేశారు. ఒక్కో కౌంటర్ వెయిట్ బరువు 17 టన్నులు. ప్రమాదం తర్వాత ఈ బోట్లు తమవేనంటూ ఎవరూ ముందుకు రాలేదు.
 
బోట్లు కొట్టుకుపోయాయని ఫిర్యాదు చేయలేదు. అయితే, జలవనరుల శాఖ ఉద్యోగులు ఈ బోట్లు కొట్టుకుని రావడం వెనుక ఏదైనా కుట్ర కోణం ఉండొచ్చని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బోటు యజమానులను పోలీసులు అరెస్ట్ చేశారు.
 
పోలీసులు ఏమన్నారంటే...
ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన విజయవాడ వన్ టౌన్ పోలీసులు... ఇవి నదిలోని ఇసుకను తరలించే బోట్లుగా గుర్తించారు.
ఈ బోట్లపై ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్ల (AP-IV-M-SB-0022, AP-IV-M-SB-0023, AP-IV-M-SB-0017) ఆధారంగా వాటి యజమానులను గుర్తించి… అవి ఉషాద్రి, రామ్మోహన్ లకు చెందిన బోట్లుగా గుర్తించామని, ఉషాద్రికి చెందిన మూడు బోట్లు ఒకే ప్లాస్టిక్ తాడుతో కలిపి కట్టి ఉన్నాయని వన్ టౌన్ పోలీసులు బీబీసీతో చెప్పారు.
 
ఇనుప చైన్లతో కాకుండా... ప్లాస్టిక్ తాళ్లతో బోట్లను కట్టేసినట్టు గుర్తించామని, దీనిపై మ‌రింత లోతుగా విచార‌ణ జ‌రుపుతున్నామ‌ని పోలీస్ అధికారులు తెలిపారు. మొత్తం 5 పడవలు ఢీకొట్టినట్లు తేలిందని, అందులో 3 భారీ పడవలున్నాయని తెలిపారు. ఇసుక తరలించడానికి ఉపయోగించే ఒక్కో పడవ 40 నుంచి 50 టన్నుల బరువు ఉంటుందని పోలీసులు చెప్పారు.
 
బోట్లకు వైసీపీ రంగులున్నాయి: హోంమంత్రి
బోట్లు బరాజ్ ను ఢీకొట్టిన ఘటనపై ఏపీ హోంమంత్రి అనిత మాట్లాడారు. బోట్లు బరాజ్‌కు వచ్చిన తీరు, వాటిని పట్టించుకోకపోవడం వంటి అంశాలు అనుమానాలకు తావిస్తున్నాయని ఆమె అన్నారు. “అంత భారీ పడవలను యజమానులు కేవలం ప్లాస్టిక్ తాళ్లతో కట్టి వదిలేశారు. వరద సమయంలో పడవలను గట్టిగా కట్టి ఉంచే ప్రయత్నం ఓనర్లు చేయలేదని విచారణలో తేలింది. వాస్తవానికి ఒక్కో పడవను విడివిడిగా కట్టాల్సి ఉన్నా... మూడు పడవలనూ కలిపి యజమానులు కట్టారు. ఈ బోట్లు కొట్టుకురావడంపై చాలా అనుమానాలున్నాయి. పడవలు కొట్టుకుపోయినా ఫిర్యాదు ఎందుకు ఇవ్వలేదు? పోలీసుల విచారణలో ఉషాద్రి, రామ్మోహన్ అనే వారు ఈ బోట్లకు యజమానులని తేలింది. వీరు మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరులే. బోట్లకు వైసీపీ రంగులు వేసుకొని ఇసుక వ్యాపారం చేస్తున్నారు” అని అనిత చెప్పారు.
 
ఇక వాటర్ లెవల్ పెరుగుతూ ఉంటే బోట్లను గట్టిగా కట్టాలని స్థానికులు పలుమార్లు హెచ్చరించినా.. ఓనర్లు లెక్క చేయలేదని దర్యాఫ్తులో తేలిందని, నిందితులకు సంబంధించిన కాల్ డేటా, గూగుల్ టేకౌట్ వివరాలు కూడా పోలీసులు సేకరిస్తున్నట్లు హోంమంత్రి తెలిపారు. హోం మంత్రి ప్రధానంగా మూడు అనుమానాలు వ్యక్తం చేశారు.
 
ఎప్పుడూ లేని విధంగా గొల్లపూడి వైపు బోట్లు ఎందుకు నిలిపారు?
సాధారణంగా ఒక్కో బోటును ఒక్కో తాడుతో కడతారు. కానీ ఇక్కడ మూడు బోట్లను కలిపి ఎందుకు కట్టాల్సి వచ్చింది?
పడవలను సాధారణ సమయాల్లోనే ఇనుప గొలుసులతో కడతారు. కానీ, వరద వస్తున్నా ప్లాస్టిక్ తాళ్లతో ఎందుకు కట్టారు?
వీటితో పాటు రాజకీయ కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ జరుపుతారని హోం మంత్రి చెప్పారు.
 
వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకే అరెస్టులు: అంబటి రాంబాబు
బోట్లు ఢీకొన్న ఘటనకు బాధ్యులంటూ ఇద్దరిని అరెస్టు చేయడంపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు పత్రికా ప్రకటన విడుదల చేశారు. “విజయవాడను బుడమేరు వరద ముంచెత్తిన ఘటనపై ముందస్తు సమాచారం ఉన్నా, ప్రజలను అప్రమత్తం చేయలేదు. దాదాపు మూడున్నర లక్షల మంది వరద బారిన పడి... ప్రాణాలు, ఆస్తులు కోల్పోయినా కూడా సహాయక చర్యల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. దాన్నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి సీఎం చంద్రబాబు, ప్రకాశం బరాజ్‌కు బోట్లు కొట్టుకొచ్చిన ఘటనకు వైఎస్సార్‌సీపీయే కారణమంటూ రాజకీయాలు చేస్తున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని పోలీసులు రోజంతా వేధించి, ఇది వైఎస్సార్‌సీపీ కుట్ర అని చెప్పాలంటూ హింసించారు” అని అంబటి రాంబాబు అన్నారు.
 
తన వైఫల్యాలన్నింటి నుంచి తప్పించుకోవడానికి తొలి నుంచి వైఎస్సార్‌సీపీదే బాధ్యతగా చూపుతున్న సీఎం చంద్రబాబు, పూర్తిగా చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, ఒక నియంతలా పాలిస్తున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. “బోట్లు కొట్టుకురావడం వెనుక కుట్రకోణం ఉందంటూ కోమటి రామ్మోహన్‌, ఉషాద్రి అనే ఇద్దరిని చంద్రబాబు ఆదేశాలపై పోలీసులు అరెస్టు చేశారు. నారా లోకేష్‌తో ఉషాద్రికి సంబంధాలు ఉన్నాయంటూ కొన్ని ఫొటోలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి” అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
 
వరదలతో రాజకీయాలా?
ఇంత పెద్ద విపత్తు సంభవిస్తే... అందులో కూడా రాజకీయాలే ప్రధానంగా ముందుగా రావడం దురదృష్టకరమని పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ ఊహా మహంతి బీబీసీతో అన్నారు. బోట్లు కొట్టుకొచ్చిన ఘటనపై పరస్పర ఆరోపణల కన్నా బాధితులకు సహాయం చేయడంపై రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాలని కోరారు. “ఓవైపు ఇంకా కొందరు వరద బాధితులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. మరో వైపు బాధిత ప్రాంతాలను సాధారణ స్థితికి తీసుకుని రావాల్సిన అవసరం ఉంది. అధికార పార్టీ అయినా, ప్రతిపక్ష పార్టీ అయినా... ముందుగా బాధితులు అందరికీ సహాయం అందేలా చూడండి. తర్వాత మీరు రాజకీయాలు చేసుకోవచ్చు” అని ఊహా మహంతి అన్నారు.