శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 14 జూన్ 2021 (13:59 IST)

లైంగిక దోపిడీ: 'అయినవారే, ఘోరాలకు పాల్పడుతుంటే అన్నీ మౌనంగా భరించే చిన్నారులు ఎందరో' -అభిప్రాయం

సువర్ణ ఆఫీసు నుండి ఇంటికెళ్లే సరికి హాల్లో ఎవరో కొత్తవాళ్లున్నారు. భర్త, ఒక పెద్దాయనతో కూర్చుని మాట్లాడుతున్నాడు. సువర్ణకు ఆయన్ని ఎక్కడో చూసినట్టు అనిపించింది. ఎవరా అని ఆలోచిస్తోంది. "నేనమ్మా, వెంకట్ బాబాయిని, మర్చిపోయావా?" అని ఆయన తనని పరిచయం చేసుకున్నారు.

 
"మీ పక్కింట్లో వుండేవారట" అయోమయంగా చూస్తున్న భార్యకు క్లూ అందించాడు రమేష్. సువర్ణ గుర్తొచ్చినట్టు తలూపింది. బంధువుల పెళ్లికి వచ్చారట. సువర్ణ ఇక్కడే వుంటోందని తెలిసి చూసిపోదామని వచ్చానని చెప్తున్నాడు. "అందరం ఒకే కుటుంబంలా వుండేవాళ్లం. చిన్నప్పుడు సువర్ణ నా చేతుల్లోనే పెరిగింది. అప్పుడెలా వుండేదో.. చక్కగా రబ్బరు బొమ్మలా వుండేది" ఆయన చెప్తుంటే, సువర్ణ బెడ్రూంలోకి వెళ్లిపోయింది.

 
లోపలికెళ్లి బెడ్ మీద కూర్చున్న సువర్ణ మనసులో పాత జ్ఞాపకాలు ముల్లులా గుచ్చుకున్నాయి. అప్పుడు తనకు ఆరేడేళ్లుంటాయేమో.. ఆటల పేరుతో ఆయన ఎక్కడెక్కడ తాకేవాడో ఆమెకు గుర్తొచ్చింది. ఆ తాకిడి రోజురోజుకూ ఎక్కువైంది. రోజూ కొత్త కొత్త వెరైటీ ఆటలు ఆడించేవాడు. ఆ ఆటల విషయం ఎవరితో అయినా చెబితే, పోలీసులొచ్చి పట్టుకెళ్తారని భయపెడుతుండేవాడు.

 
చిన్నపిల్లగా ఉన్నప్పుడు జరిగినవి ఆమెకు గుర్తుండవని, ఒకవేళ గుర్తున్నా పరువు కోసం బయట పెట్టదనీ ఆయన ధైర్యం. సువర్ణ లోపల్నుంచి కాఫీ తీసుకొస్తుందని రమేష్ ఎదురుచూస్తున్నాడు. కానీ, రాలేదు. కాఫీయే కాదు, సువర్ణ కూడా బయటికి రాలేదు. పిల్లలపై లైంగిక దోపిడీ దేశవ్యాప్తంగా జరుగుతోంది. 12-15 సంవత్సరాల వయస్సు పిల్లలు ఎక్కువగా లైంగిక దోపిడీకి గురవుతారు. అయితే, 8 ఏళ్ల లోపు పిల్లలు, 16 కంటే ఎక్కువ వయసున్న వారు కూడా బాధితులు కావచ్చు.

 
లైంగిక దోపిడీ గణాంకాలకు అందని సమస్య. దీనికి గురైన బాధితులు ఆ భయంకరమైన నిజాలను తమలో తామే దాచుకుంటారు. లైంగిక దోపిడీ బాధితుల్లో 72 శాతం మంది, తాము ఆ విషయాలు ఎవరికీ చెప్పలేదన్నారు. కేవలం 3 శాతం మంది మాత్రమే తమకు జరిగిన వాటిని పోలీసులకు చెప్పారు. ఎక్కువ సందర్భాల్లో నిందితులు పిల్లలకి తెలిసిన వారే ఉంటున్నారు. చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడే వారిలో 31 శాతం మంది బాధితుల మామ లేదా పొరుగువారు ఉన్నారు. వీరంతా తెలిసిన వారు, బంధువులు కావడం, వారి నుంచి తప్పించుకోవడానికి వీలు లేకపోవడంతో కరోనా లాక్‌డౌన్ సమయంలో పిల్లలకు ఈ సమస్య మరింత తీవ్రమైంది.

 
పేర్లు, చోటు వేరే ఘటన అదే
గత 20 ఏళ్లకు పైగా గైనకాలజిస్ట్‌గా పని చేస్తున్న నేను, అర్థరాత్రి ఎమెర్జెన్సీలో ఎప్పటి నుంచో ఒకే రకమైన కేసులను చూస్తూ వస్తున్నాను. ఆ కేసుల్లో స్థలం, పేర్లు మాత్రమే మారుతున్నాయి. అక్కడ జరుగుతున్నవి మాత్రం దాదాపు ఒకే లాంటి ఘటనలు. ఒక మహిళ తన బిడ్డను అర్థరాత్రి పూట ఎమెర్జెన్సీకి తీసుకు వస్తుంది, జననాంగాల నుండి రక్తం వస్తోందని చెబుతుంది.

 
కారణం అడిగితే ఆడుకుంటూ వెళ్లి పడిందని, బెడ్ మీద నుండి కింద పడిందని వారు పొంతన లేని సమాధానాలు చెబుతుంటారు. ఆ బ్లీడింగ్‌కు లైంగిక హింసే కారణమేమో అనే అనుమానిస్తే, అలాంటిదేమీ లేదని ఆ బాధితుల కుటుంబ సభ్యులు కోపగించుకుంటారు. అలాంటి నేరాలు చేసిన కుటుంబ సభ్యులని ఆ మహిళలే కాపాడుతుంటారు. వాటిపై పోలీసులకు రిపోర్ట్ చేసినా ఎలాంటి ఫలితం ఉండదు. తమ సమస్యను చెప్పుకుంటే వైద్య సిబ్బంది సున్నితంగా స్పందిస్తారనే నమ్మకం లేదు.

 
పన్నెండేళ్ల కృష్ణ(పేరు మార్చాం)ను రాజకీయంగా చాలా పలుకుబడి ఉన్న ఒక కుటుంబంలోని వ్యక్తి రేప్ చేశాడు. బాలిక ఇచ్చిన స్టేట్‌మెంటుని వెనక్కి తీసుకోవాలని పోలీసులు పది రోజుల పాటు ఆమెను నిర్బంధించారు. లేడీ డాక్టర్ చేసిన వేలి పరీక్ష ఆమెకు మరింత బాధ కలిగించింది. ఆ పరీక్షలు అయ్యాక "రేప్ చిన్నదే. ఇదంత పెద్ద విషయమేమీ కాదు" అని ఆ డాక్టర్ తేల్చింది.

 
అమ్మాయిలకే కాదు...
లైంగిక దోపిడీ సమస్య ఎక్కువగా ఆడపిల్లల్లో గమనిస్తున్నా, ఈ ప్రమాదం అబ్బాయిలకు కూడా ఉంది. భారత దేశంలోని వసతి గృహాల్లో, అనాథాశ్రమాల్లో సరైన పర్యవేక్షణ లేకపోవడం దీనికి ప్రధాన కారణం. "హాస్టల్లో వార్డెన్లు, పెద్ద పిల్లలు, చిన్న పిల్లలను లైంగికంగా హింసిస్తూ వుంటారు. నేను అక్కడ పదిహేనేళ్లున్నాను. తనిఖీలకు ఎవరూ రాలేదు" అని హాస్టల్లో ఉండివచ్చిన ఒక యువకుడు చెప్పాడు. లైంగిక హింసకు గురైన ఏ పిల్లవాడూ ఫిర్యాదు చేసే ధైర్యం చేయడు. చెప్పుకుంటే తోటివాళ్లు మరింత హేళన చేస్తారని భయం.

 
లైంగిక దోపిడీకి ఎక్కువగా ఎవరు గురవుతున్నారు?
లైంగిక దోపిడీకి గురయ్యే పిల్లల్లో, ఎక్కువ శాతం మంది వివిధ సమస్యలు ఉన్న కుటుంబాల నుంచి వచ్చినవారు అయ్యుంటారు. ఈ సమస్యల్లో స్థిరమైన ఇంటి వాతావరణం లేకపోవడం, పిల్లలు వసతి గృహాలలో నివసించడం, తల్లిదండ్రులు వ్యసనాల బారిన పడడం లేదా మానసిక సమస్యలు ఉండడం, కటుంబ నేపథ్యంలో నేర చరిత్ర ఉండడం లాంటివి ఉంటాయి. పేదరికం, అంగవైకల్యం, కుటుంబ సభ్యుల మరణం, ఒంటరి తనం కూడా ఇలాంటి ఘటనలకు కారణం అవుతున్నాయి. ఇలాంటి కుటుంబాల్లో పిల్లలు ప్రేమ, అప్యాయత కోసం తపిస్తూ వుంటారు. లైంగిక దాడికి పాల్పడేవారు వారిపై అభిమానం నటించి, బహుమతులిచ్చి లొంగదీసుకుంటారు.

 
పిల్లలు లైంగిక దోపిడీకి గురవుతున్నారని తెలుసుకోవడం ఎలా?
చిన్నారులను లైంగికంగా లోబరుచుకున్న అన్ని ఘటనల్లో హింస ఉండకపోవచ్చు. లైంగిక వేధింపులకు గురైన పిల్లలలో నిర్దిష్టమైన లక్షణాలు కనిపించవు. వారి ప్రవర్తనలో అస్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. బాధిత పిల్లల దగ్గర ఎక్కువ డబ్బు, ఖరీదైన బహుమతులు, కొత్త బట్టలు కనిపిస్తే తల్లిదండ్రుల్లో సందేహం కలగాలి. అవి ఎలా వచ్చాయని అడిగినపుడు, పిల్లల నుంచి అసంబద్ధమైన సమాధానాలు రావడం కూడా గమనించవచ్చు.

 
ఎప్పుడు అప్రమత్తం కావాలి
చిన్నారుల్లో ఈ లక్షణాలు కనిపిస్తే, తల్లిదండ్రులు అప్రమత్తం కావాలి.
హఠాత్తుగా బరువు తగ్గడం లేదా పెరగడం.
వారి వారి వేషభాషల్లో మార్పులు.
అపరిశుభ్రత
శరీరం పైన వివరణకు అందని గాయాలు.
చదువులో వెనకబడడం.
ఇంటి నుంచి లేదా హాస్టల్ నుంచి తరచూ పారిపోతుండడం
తిరిగి వచ్చాక పిల్లల్లో డ్రగ్స్/ఆల్కహాల్ ప్రభావం ఉండడం.
అనుచిత లైంగిక ప్రవర్తన;
ఫోన్లు, మెసేజిలు ఎక్కువగా రావడం
కుటుంబ సభ్యులతో కలవకుండా, ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడడం.

 
సమస్య పలు రకాలు
పిల్లలను లైంగికంగా లోబరుచుకోవడం అనే సమస్య వివిధ రకాలుగా ఉండవచ్చు. ఎలాంటి దోపిడీలో అయినా అసమానత్వం అనేది ప్రధాన అంశంగా ఉంటుంది. ఇందులో ఒకరు బలవంతులు, మరొకరు బలహీనులుగా ఉంటారు. లైంగిక దోపిడీకి ఇతర రకాల నేరాలకు సంబంధాలు ఉన్నాయి.

 
పిల్లల అక్రమ రవాణా;
గృహ హింస;
డ్రగ్స్-సంబంధిత నేరాలు;
పిల్లల్లో లైంగిక దోపిడీ 13 రకాలుగా జరుగుతోందని ఒక అంచనా.

 
కొన్ని సందర్భాలలో ఏదైనా ఇచ్చినందుకు ప్రతిఫలంగా దోపిడీ జరుగుతుంది. ఉదాహరణకు ఆహారం, వసతి, మందులు, మద్యం, సిగరెట్లు, ఆప్యాయత, బహుమతులు, డబ్బు ఎరవేయడం. ఇలాంటి వారిపై ఒక్కరే దోపిడీ చేయడం ఉండదు. ఎక్కువ మంది కూడా దాడికి పాల్పడవచ్చు. సామూహిక లైంగిక దోపిడీ డ్రగ్స్ లాంటి నేరాలతో ముడిపడి ఉంది. ముఠా గొడవలు, ప్రత్యర్థులను నియంత్రించడానికి, శిక్ష విధించే రూపంలో లైంగిక దోపిడీ జరుగుతుంది.

 
ఎలాంటి ప్రభావం ఉంటుంది
లైంగిక దోపిడీ అనుభవాలు బాధితులపై ఎలాంటి ప్రభావం చూపుతాయి. అందరికీ దూరంగా ఒంటిరతనానని ఇష్టపడడం. పరీక్షలలో ఫెయిలవడం. చిన్న వయసులోనే తల్లిదండ్రులు కావడం, నిరుద్యోగం, మానసిక ఆరోగ్య సమస్యలు, మద్యం-డ్రగ్స్ వ్యసనం, ఆత్మహత్యాయత్నం. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆన్‌లైన్ వేధింపులు కూడా అధికం పెరిగాయి.
"నా నగ్న చిత్రాలను పంపించమని అతను బలవంతం చేస్తాడు. స్కైప్ వీడియోల్లో తను చెప్పినట్టు చేయమంటాడు. లేదంటే బ్లాక్ మెయిల్ చేస్తాడు" అని ఒక బాలిక చెప్పింది.

 
లైంగిక దోపిడీకి గురి కాకుండా పిల్లలని కాపాడుకోవడం ఎలా?
ఎలాంటి లైంగిక దోపిడీ అయినా, నేరమేనని వారికి ఒక స్పష్టమైన సందేశం అందేలా చేయాలి. సమస్య గురించి, దాని నుంచి ఎలా బయటపడవచ్చు, సాయం ఎలా పొందాలో అవగాహన కల్పించాలి. బాధితులు నేరస్థులయ్యే అవకాశం వుందనే కోణాన్ని కూడా తప్పక గుర్తించాలి.

 
పిల్లలు, తమకు జరిగినవి సూటిగా చెప్పలేకపోవచ్చు. తమకు జరుగుతోంది ప్రమాదకరమని వారికి స్పష్టంగా అర్థం కాకపోవచ్చు. కానీ, ఏదో తప్పు జరుగుతోందనే సంకేతాలు వ్యక్తం చేస్తారు. వారి ప్రవర్తన, బాడీ లాంగ్వేజ్ జాగ్రత్తగా గమనిస్తే ఆ సంకేతాలను అర్థం చేసుకోవచ్చు. వారు ఏ పరిస్థితిలో అందులో చిక్కుకున్నారో సమగ్రంగా పరిశోధించాలి. వారిని మాట్లాడనీయకుండా ఎవరైనా నిర్బంధిస్తున్నారేమో గుర్తించాలి.

 
"నన్ను జడ్జ్ చేయకండి. ఇంత తప్పు ఎలా చేశావని అరవకండి. నేనెందుకిలా చేయవలసి వచ్చిందో నేను చెప్తే ప్రశాంతంగా వింటారా? అర్థం చేసుకుంటారా?" ఏడుస్తూ అంది ఓ పదమూడేళ్ల బాలిక. పదిహేనేళ్ల మణిదీప్ కేసు పోలీసుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపింది. 35 ఏళ్ల పక్కింటి వ్యక్తి మొదటి సారి ఆమెతో అసాధారణ రీతిలో సెక్స్ జరిపినపుడు విజయవంతంగా పోరాడింది.

 
ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. కానీ సిగ్గుతో దానిని సరిగా వివరించలేక ఇబ్బంది పడితే, ఆమె అబద్ధం చెబుతోందని పోలీసులు అన్నారు. ఇలాంటివి ప్రైవేటుగా సెటిల్ చేసుకోవాలని గ్రామపెద్ద సూచించాడు. అదే వ్యక్తి మరోసారి తనపై బలవంతం చేసినపుడు ఆమె ఆ అవమానం తట్టుకోలేక కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. బాధితులు తమ ఆందోళన వినిపించడానికి, ఫిర్యాదు నమోదు చేయడానికి, సాయం కోరడానికి అనువైన మార్గాలను అందుబాటులో వుంచాలి. పిల్లల లైంగిక దోపిడీ విషయంలో తప్పు బాధితులది కాదు. పెద్దవాళ్లు, పోలీసులు, వైద్యులతో తమ సమస్య చెప్పుకుంటే సానుకూలంగా స్పందిస్తారనే భరోసా పిల్లలకు కలగాలి.

 
లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం
2009లో చిన్నారులపై దాడుల గురించి ఒక సర్వే ప్రచురించడంతో భారత మహిళా, శిశు సంక్షేమ శాఖ, పిల్లల సంరక్షణను మెరుగుపరచడానికి చొరవ చూపింది. పిల్లల పట్ల లైంగిక వేధింపులను నిషేధిస్తూ 2012 మేలో భారత పార్లమెంటు ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకు వచ్చింది.

 
ఈ చట్టం ప్రత్యేకతలు
లైంగిక వేధింపుల కేసులను పరిష్కరించడానికి ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయడం. సంవత్సరంలోపు కేసులు పరిష్కరించేలా చూడడం. పిల్లల లైంగిక వేధింపుల ఘటనల గురించి ప్రజలకు తెలిస్తే, లేదా ఆ ప్రమాదం ఉందని భావిస్తే, వారు కచ్చితంగా పోలీసులకు తెలియజేయాలని ఈ చట్టం చెబుతోంది. లేదంటే ఆరు నెలల జైలు శిక్ష, జరిమానా విధిస్తారు.

 
పిల్లల హక్కులను కాపాడేందుకు భారత ప్రభుత్వం, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ (ఐసిపిఎస్) క్రింద శిశు సంక్షేమ కమిటీలు ఏర్పాటుచేసింది. ఈ శిశు సంక్షేమ కమిటీలకు రిటైర్డ్ సివిల్ సర్వెంట్లు, సీనియర్ జిల్లా అధికారి, డిప్యూటీ కమిషనర్ అధ్యక్షత వహిస్తారు. ఏదేమైనా చట్టాలను, కమిటీలను మించి చిన్నారులను రక్షించగలిగేది మనుషుల్లో బాధ్యత, పిల్లల పట్ల దయ. కనీసం, మన చుట్టూ ఉన్న పిల్లలు సురక్షితంగా వున్నారా లేదా అని పరిశీలించాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. బలవంతులైన పెద్దవారిని ఎదుర్కోలేక మౌనంగా, హింసను భరించే పిల్లలను సకాలంలో గుర్తించి వారికి విముక్తి కల్పించాలి.
 
(అభిప్రాయం రచయిత వ్యక్తిగతం)