గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 16 జులై 2024 (16:14 IST)

తెలంగాణ: ‘బోనం’ అంటే ఏంటీ, ఈ సంప్రదాయం ఎప్పుడు, ఎలా మొదలైంది?

Bonalu
తెలంగాణ పల్లె, పట్నాల్లో ఆషాఢ బోనాల సందడి నెలకొంది. పండుగ రోజున ఎల్లమ్మ, పోచమ్మ 'గ్రామదేవతలు', పోతరాజు వేషాలు, శివసత్తులు‌లాంటివి ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. బోనాల మాటెత్తగానే వందల ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ బోనాలే గుర్తొస్తాయి. తెలంగాణ సాంస్కృతిక ప్రతీకగా బోనాలను ప్రదర్శించడం కనిపిస్తుంది. ఈ ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. బోనాలు తెలంగాణకే పరిమితమా? ఇంతకూ బోనం అంటే ఏంటీ, అవి ఎలా ప్రారంభమయ్యాయి?
 
భాషా, జానపదచరిత్ర పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ‘భోజనం’ అన్న పదానికి వికృతే ‘బోనమ్’ లేదా ‘బోనం‘ కొత్త మట్టి కుండల్లో బోనం (వరి అన్నం) వండుతారు. బోనాల నిర్వహణలో మహిళలది ప్రధాన పాత్ర. ప్రస్తుత కాలానికి నిర్దిష్టంగా అన్వయించి చూస్తే బోనాల జాతరలు మతపరమైన ప్రాముఖ్యతతో, జానపద సంస్కృతితో ముడిపడి ఉన్నాయి. గ్రామ 'దేవతలు' ముఖ్యంగా 'స్త్రీ దేవత'లను పూజించే సంప్రదాయం ఇందులో కనిపిస్తుంది. అయితే బోనాలు ఆది మానవ కాలంలోని ‘ఆరాధాన, నివేదన’ పద్దతులను పోలి ఉన్నాయనేది కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం.
 
‘’నాగరికత కంటే మొదలు గ్రామీణ దశలో మాతృదేవతల కాలం నుంచి నివేదన సంప్రదాయం ఉంది. తినే ఆహారం, తాగే మద్యాన్నే దేవతలకు సమర్పించడం పారంపర్యంగా వస్తోంది.’’ అని కరీంనగర్‌కు చెందిన చరిత్ర పరిశోధకుడు మలయశ్రీ బీబీసీతో అన్నారు. ‘’ప్రకృతి శక్తులను వశం చేసుకునే క్రమంలో ఆరాధనలకు అంకురార్పణ జరిగింది. భూమికి, స్త్రీకి పునరుత్పత్తి శక్తి ఉన్నాయని గుర్తించి స్త్రీ దేవతలను ఆరాధించేవారు. మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్య వ్యవస్థకు అడుగుపెట్టినా పాత వ్యవస్థ ప్రభావాన్ని పూర్తిగా మార్చలేకపోయారు. ప్రాచీన మానవుడు ఆరాధించిన మాతృదేవతే గ్రామ దేవత.’’ అని ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ వ్యవస్థాపక డైరెక్టర్, ఎస్వీ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ పేట శ్రీనివాసులు రెడ్డి ‘తిరుపతి గంగమ్మ జాతర’ అన్న పుస్తకంలో రాశారు.
 
గ్రామ దేవతలు-జాతరలు
‘’వేట, ఆహార సేకరణ నుంచి స్థిర వ్యవసాయంలో ప్రవేశించిన దశలో సేద్యం పనుల విరామ సమయాల్లో ఉత్సవాలు, సమావేశాలు నిర్వహించారు. ఈ జాతరలన్నీ ఒక విధంగా నిత్య శ్రమతో అలిసిపోయిన జానపదుని మనస్సును సంతోషపెట్టి, అలసట తీర్చే సాధనాలు’’ అని ప్రముఖ జానపద సాహిత్య పరిశోధకుడు ప్రొఫెసర్ బిరుదురాజు రామరాజు తన ‘ఆంధ్రప్రదేశ్ జానపద సాహిత్యము, సంస్కృతి’ అనే గ్రంథంలో రాశారు. వ్యవసాయ మూలంగా గ్రామాలు ఆవిర్భవించి, వ్యవసాయ 'దేవత'లే గ్రామ దేవతలుగా మార్పుచెందారని ‘ది విలేజ్ గాడ్స్ ఆఫ్ సౌత్ ఇండియా’ పుస్తకంలో హెన్రీ వైట్ హెడ్ అభిప్రాయపడ్డారు. వివిధ కాలాల్లో, వివిధ రూపాల్లో వేర్వేరు దేవతల పేర్లతో జాతరల నిర్వహణ కనిపిస్తుంది.
 
'‘ఉత్సవాలు నిర్వహించే ప్రాంతం, సమయం బట్టి ఆచార వ్యవహారాల్లో వైవిధ్యం కనిపిస్తుంది. ఏడాదికో, రెండేళ్లకో కాల నియమాన్ని అనుసరించి నిర్వహించే జాతరలు సామూహిక ఉత్సవాలు. కరవు కాటకాలు, గాయి గత్తరలూ గ్రామంలో చెలరేగినపుడు వాటి నివారణ కోసమూ జాతరలు నిర్వహిస్తారు'' అని బిరుదరాజు రామరాజు రాశారు. ''ప్రతిగ్రామానికి ఒక రక్షక దేవత ఉంటుంది. గంగమ్మ, పోలేరమ్మ, పోశమ్మ, ఎల్లమ్మ, బాలమ్మ, మైసమ్మ, మహంకాళి, దుర్గ, అంకాలమ్మ, నూకాలమ్మ, మావురమ్మ, సారమ్మ, సవదలమ్మ, దంతేశ్వరి, సాకులమ్మ మొదలైన ఎందరో దేవతలకు జాతరలు చేయడం కనిపిస్తుంది'' అని తెలిపారు.
 
''మాంత్రికత, తంత్రము ఈ దేవతల చుట్టూ అల్లబడి ఉంటాయి. గ్రామ ప్రజలకు ఈ దేవతాశక్తుల మీద అపారమైన నమ్మకం ఉంటుంది. ఈ దేవతలకు పూజలలో బలులు ఒక ప్రముఖమైన అంశం.’’ అని బిరుదురాజు రామరాజు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో బోనాల నిర్వహణ కేవలం ఆషాఢ మాసం ( జూలై/ఆగస్టు)కే పరిమితం కాలేదు. ఆయా సందర్భాల్లో వేర్వేరు రకాల బోనాల నిర్వహణ ఇక్కడ కనిపిస్తుంది. ‘’రకరకాల సందర్భాల్లో కుండలో బోనం వండి అమ్మదేవతలకు పెట్టే సంప్రదాయం ఉంది. ఇది ఆషాఢ మాసానికే పరిమితం కాదు. పంటలు, ఆరోగ్యాలు బాగుండాలని ఇది ప్రకృతికి తెలిపే ఒక రకమైన కృతజ్ఞతాభావం. పంట బోనాలు, కులాలు, దేవతల వారిగా బోనాలు సమర్పించడం కనిపిస్తుంది.’’ అని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ బీబీసీతో అన్నారు.
 
తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో చలి బోనం, ఉడుకు బోనం అనే సంప్రదాయం కూడా ఉంది. చలి బోనాల సందర్భంగా రాత్రి వండిన బోనాన్ని ఆ మరుసటి రోజు దేవతకు నివేదిస్తారు. నూతన వధూవరులతో పోచమ్మ కు బోనాలు సమర్పించే సంప్రదాయం ఉంది. ‘కొన్ని ఆచారాలు ప్రాంతీయంగానే పరిమితం అయిపోయాయి. అక్కడే పుట్టి అక్కడే కొనసాగించిన కారణంగా అక్కడికే పరిమితం అవుతాయి.’’ అన్నారు శ్రీరామోజు హరగోపాల్.
 
మహిళలదే ప్రధాన పాత్ర
బోనాల్లో మహిళలదే ప్రధాన పాత్ర. ఇందులోని ఆచార, సంప్రదాయాలు మహిళ కేంద్రంగా ఉంటాయి. వర్షాకాలం ఆరంభంలో వచ్చే వ్యాధులను అరికట్టేలా కొన్ని ఆరోగ్యసూత్రాలు ఈ పండుగలో దాగి ఉన్నాయని జానపద చరిత్రకారుల అభిప్రాయం. ‘’బోనాలను కుండలో వండుతారు. కుండ స్త్రీ గర్భానికి సంకేతం. గర్భస్థ శిశువులు, చిన్న పిల్లల మరణాలు ఎక్కువగా ఉండేవి. ఎంత ఎక్కువ సంతానం ఉంటే అంత కుటుంబ శ్రేయస్సు అని నమ్మేవారు. రుతు మార్పిడి కాలంలో కలిగే అంటువ్యాధులు, జబ్బుల నుండి తమ పిల్లలను, కుటుంబాలను, గ్రామాలను కాపాడాలని బోనాలు నిర్వహించేవారు. ఇందులో వాడే వేప ఆకులు, పసుపు సూక్ష్మనాశినిగా పనిచేస్తాయి.” అని ప్రముఖ జానపద పరిశోధకుడు జయధీర్ తిరుమల రావు బీబీసీతో అన్నారు.
 
'బోనాలు వంటి సామూహిక ఉత్సవాలకు కర్తలు, ప్రారంభకులు అంటూ ప్రత్యేకంగా ఉండరు' అని ఆయన చెప్పారు. ‘బోనం అనేది భక్తి, భయం రెండూ కూడుకుని ఉన్న భావన. ఆషాఢ మాసం అంటు వ్యాధులు ప్రబలే కాలం. అమ్మతల్లిని గౌరవించాలని, బోనం సమర్పించి తృప్తి పరిస్తే గ్రామం, పిల్లలు చల్లగా ఉంటారని భావిస్తారు. మాతృస్వామ్య వ్యవస్థకు గ్రామదేవతలు సంకేతాలు.’’ అని హైదరాబాద్ చరిత్రకారుడు పరవస్తు లోకేశ్వర్ అన్నారు.
 
హైదరాబాద్ బోనాలు
బోనాల పండగకు హైదరాబాద్ ప్రతీకగా మారింది. వేలాది సంఖ్యలో ప్రజలు పాల్గొనే హైదరాబాద్ ఆషాఢ మాస బోనాల వెనుక శతాబ్దాల చరిత్ర ఉంది.
హైదరాబాద్ బోనాల చరిత్ర, ఆచారాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వెబ్ సైట్‌లో పొందుపరిచిన వివరాల ప్రకారం.. 1813 ప్రాంతంలో జంట నగరాల్లో ప్లేగు వ్యాధి సోకి వేలసంఖ్యలో మరణాలు సంభవించిన సమయంలో మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో నియమించిన హైదరాబాద్ సైనిక దళం అక్కడి మహాంకాళిని ప్రార్థించింది. తిరిగి వచ్చాక ఆ దేవత విగ్రహాన్ని ఏర్పాటుచేసి బోనాలు సమర్పించారు. దీంతో వ్యాధి తగ్గిపోయిందని భక్తుల నమ్ముతారు.
 
పాలు, బెల్లంతో మట్టి లేదా ఇత్తడి పాత్రలో బోనం (వరి అన్నం) వండుతారు. వీటిని వేప ఆకులు, పసుపుతో అలంకరిస్తారు. మహిళలు ఈ కుండలను తమ తలపై మోసుకెళ్ళి, దేవాలయాల వద్ద ఉన్న మాతృదేవికి గాజులు, చీరలతో సహా బోనం సమర్పిస్తారు. సికింద్రాబాద్ ప్రాంతం ఒకప్పుడు బ్రిటీష్ సైనిక స్థావరం. దీన్ని లష్కర్ అని పిలిచేవారు. ఇప్పటికీ లష్కర్ బోనాలు అన్న మాట ఈ ప్రాంతంలో వినిపిస్తుంది. బోనాల జాతరలో గ్రామదేవతల తమ్మునిగా భావించే పోతరాజు, ఫలహారం బండ్లు, తొట్టెలు సమర్పణకు ప్రాధాన్యత కనిపిస్తుంది. తొట్టెలు వెదురు బద్దలతో తయారుచేసిన రంగురంగుల కాగితాలతో తయారు చేసిన వస్తువులు. మాతృత్వానికి ప్రతీకగా వీటిని భావిస్తారు.
 
ఆషాఢ మాసం మొదటి ఆదివారం గోల్కొండ కోటలో ప్రారంభమై, లాల్ దర్వాజ సింహవాహిని బోనాలతో బోనాలు ముగుస్తాయి. ‘’కుతుబ్ షాహీల కాలంలో కూడా బోనాల పండుగ జరుపుకొనేవారు. కోటలో అమ్మదేవతకు పూజలు చేసే అవకాశం కల్పించారు. బోనాల సమయంలో ఏడో నిజాం సికింద్రాబాద్ మహంకాళీ ఆలయానికి ఉచిత బస్సు సర్వీసులు నడిపారు. దేవాలయం ముందున్న ఒక దుకాణంలో కూర్చుని ఉత్సవాలను చూసేవారు.’’ అని హైదరాబాద్ చరిత్రకారులు పరవస్తు లోకేశ్వర్ బీబీసీతో చెప్పారు.
 
గోల్కొండ కోటలో కాకతీయుల కాలం నుంచి గ్రామదేవత ఆలయం ఉందన్నది మరికొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. కుతుబ్ షాహీ రాజు తానీషాకు మంత్రులుగా పనిచేసిన అక్కన్న, మాదన్న సోదరుల పేరుతో ఉన్న ఆలయంలో ఇప్పటికీ బోనాల ఉత్సవాలు జరుగుతాయి. ‘’బోనాల నిర్వహణను ప్రోత్సహిస్తూ ఉస్మానియా ఆసుపత్రి వద్ద నిజాం ఒక రాతి శాసనం వేయించారు. కళ్లాపి చల్లి వీధులను , పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన ఆశించారు. అప్పటికే హైదరాబాద్ నగరం రెండు మహమ్మారులను చూసింది. అంటువ్యాధులతో ప్రజలు చనిపోయారు.’’ అని జయధీర్ తిరుమల రావు బీబీసీతో చెప్పారు.
 
తెలంగాణకే పరిమితమా?
బోనాలు సంస్కృతి తెలంగాణలో విస్తృతంగా ఉన్నా ఇతర ప్రాంతాల్లోనూ స్వల్ప తేడాలతో కనిపిస్తుందని చరిత్రకారుల చెబుతున్నారు. ‘’బోనాల భావన అన్ని చోట్లా ఉంటుంది. అది వేర్వేరు రూపాల్లో వ్యక్తం అవుతుంది. ఉత్తర భారతదేశంతో పోలిస్తే దక్షిణాన ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో పండగ జరుపుకునే సమయాల్లో తేడా ఉంది. తెలంగాణ పండగగా చెప్పే బతుకమ్మను పోలిన పూలపండుగలు అయిదారు రాష్ట్రాల్లో కనిపిస్తాయి.’’అని తిరుమల రావు అన్నారు. ‘’రాయలసీమలో ప్రత్యేకంగా ఇంటి వద్దే కుండలో బోనం వండి తెచ్చే పద్దతి లేదు. గ్రామ దేవతల గుళ్ల వద్ద పాత్రల్లో పొంగళ్లు వండుతారు. ఆచారాల్లో స్వల్ప తేడాలుంటాయి. వెయ్యికళ్ల దుత్తగా పిలిచే మట్టికుండలో బియ్యం, నెయ్యి కలిపి దానిపై పిండి దీపం పెడతారు. కల్లు సాక పోయడం తెలంగాణలో కనిపిస్తుంది. అయితే రాయలసీమ ప్రాంతంలో అది తక్కువ.’’ అని రిటైర్డ్ ప్రొఫెసర్ పేట శ్రీనివాసులు రెడ్డి బీబీసీకి తెలిపారు.
 
బోనాల్లో మార్పులు
జానపద, శ్రామికవర్గాల పద్దతిలో సాగిన బోనాల పండగ కాలాంతరంలో మార్పులకు లోనయింది. పూజారులుగా ఆ వర్గాలకు సంబంధించిన వారే కొనసాగేవారు. ‘’జంతు బలుల స్థానంలో గుమ్మడి, కొబ్బరి కాయలు వచ్చాయి. మొదట్లో దున్నపోతులను బలి ఇచ్చేవారు. ఇప్పుడు కోళ్లు, మేకలకు మారింది. గ్రామదేవతల ఆలయాలు ఆడంబరాలకు కేంద్రాలవుతున్నాయి. పూజా పద్దతులు కూడా మారాయి.’’ అని పరవస్తు లోకేశ్వర్ అన్నారు.