బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 24 ఆగస్టు 2023 (11:12 IST)

రష్యాలో కుప్పకూలిన విమానం... పుతిన్‌పై తిరుగుబాటు చేసిన వాగ్నర్ ఆర్మీ చీఫ్ ప్రిగోజిన్ మృతి

image
రష్యా రాజధాని మాస్కోకు ఉత్తరంగా కుప్పకూలిన ఒక ప్రైవేటు విమానంలో ప్రైవేటు సైన్యం వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్‌గోనీ ప్రిగోజిన్ చనిపోయినట్లుగా భావిస్తున్నారు. ఆ విమానంలోని ప్రయాణికుల జాబితాలో ప్రిగోజిన్ పేరు కూడా ఉందని రష్యన్ ఏవియేషన్ అథారిటీ తెలిపింది. వాగ్నర్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఆయన ఈ విమాన ప్రమాదంలో చనిపోయారని చెబుతోంది. అయితే, ప్రిగోజిన్ మరణవార్తను ప్రస్తుతానికి ధ్రువీకరించే పరిస్థితి లేదు. ఈ విషయంలో అప్రమత్తగా ఉండాలని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.
 
“అతనే అసలైన ప్రిగోజిన్ అని కచ్చితంగా తెలియనంతవరకు ఏమీ చెప్పలేం, కొన్ని రోజుల తరువాత ఆయన ఆఫ్రికాలో ఉన్నట్లు ఓ కొత్త వీడియో వెలుగు చూసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు” లండన్‌కు చెందిన కియర్ గైల్స్ అన్నారు. ఒకప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు విశ్వాసపాత్రుల్లో ఒకరైన ప్రిగోజిన్ 2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్‌పై రష్యా దాడిలో ప్రధాన పాత్ర పోషించారు. అయితే, గత జూన్‌లో ఆయన తన ప్రైవేటు సైన్యంతో పుతిన్‌పై తిరుగుబాటు చేశారు.తన సైన్యాన్ని మాస్కో వైపు తరలించారు. ఆ ఘటనతో పుతిన్, ప్రిగోజిన్‌ల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. తాజా ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు అందిన సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం.
 
విమానానికి ఏం జరిగింది?
మాస్కో నుంచి సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు వెళ్తుండగా ట్వెర్ ప్రాంతంలో బుధవారం సాయంత్రం ఎంబ్రేయర్ లెగసీ విమానం కుప్పకూలినట్లు రష్యా విమానయాన అధికారులు ధ్రువీకరించారు. అయితే, వాగ్నర్ టెలిగ్రామ్ చానెల్‌ గ్రేజోన్‌లో ఆ విమానాన్ని రష్యా సైన్యం కూల్చేసినట్లు చెప్పారు. ఈ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలను బయటపెట్టలేదు. ఈ ప్రైవేటు జెట్‌లో ఏడుగురు ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది ప్రయాణిస్తున్నారు.
 
ప్రాథమిక దర్యాప్తులో మొత్తం విమానంలో పది మందీ చనిపోయినట్లు తేలింది. మరోవైపు వీరి మృతదేహాలు కూడా లభ్యమైనట్లు ఇంటర్‌ఫ్యాక్స్ వార్తా సంస్థ తెలిపింది. ప్రిగోజిన్ ప్రైవేటు కంపెనీ పేరుతో రిజిస్టర్ అయిన ఈ ఎంబ్రేయర్ లెగసీ విమానంలో బయల్దేరిన అర గంటలోనే మంటలు చెలరేగాయని, దీంతో ఇది కుప్పకూలిందని టాస్ వార్తా సంస్థ వెల్లడించింది. రష్యాలోని కుజెంకినో ప్రాంతంలో విమానం కుప్పకూలుతున్న దృశ్యాలు మీడియాలో వైరల్ అయ్యాయి. మరోవైపు ప్రిగోజిన్‌కు చెందిన మరో ప్రైవేటు బిజినెస్ జెట్ మాస్కోలో సురక్షితంగా దిగిందని గ్రే జోన్ తెలిపింది.
 
ప్రిగోజిన్ గురించి ఏం తెలుసు?
కుప్పకూలిన ఆ విమానంలో ప్రయాణించిన వారిలో ప్రిగోజిన్ కూడా ఉన్నట్లు రష్యా అధికారులు ధ్రువీకరించారు. మాస్కో నుంచి సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు వెళ్తున్న ఈ విమానం మాస్కోకు ఉత్తరంగా 60 మైళ్ల దూరంలో కుప్పకూలింది. రష్యాలోని ప్రధాన మిలిటరీ కమాండర్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు లేవనెత్తిన తర్వాత, ప్రిగోజిన్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆ తిరుగుబాటు తర్వాత రష్యా అధినాయకత్వంతో ఆయనకు ఒప్పందం కుదిరింది. ఆయన బెలారూస్‌కు మకాం మారుస్తానని దీనిలో అంగీకరించారు. దీనికి ప్రతిగా ఆయనపై మోపిన అభియోగాలను వెనక్కి తీసుకుంటామని రష్యా అధినాయకత్వం కూడా స్పష్టంచేసింది.
 
బెలారూస్‌లో ఫైటర్లకు ప్రిగోజిన్ ఆహ్వానం పలుకుతున్న దృశ్యాలు టెలిగ్రామ్ చానెళ్లలో జులై రెండో వారంలో వైరల్ అయ్యాయి. దీనికి నెల రోజుల తర్వాత సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని ఆఫ్రికా-రష్యా సదస్సుకు ప్రిగోజిన్ హాజరయ్యారు. తిరుగుబాటు తర్వాత మళ్లీ గతవారమే ప్రిగోజిన్ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తను ఆఫ్రికాకు వెళ్లినట్లు దీనిలో పేర్కొన్నారు. అయితే, ఆ వీడియో ఎక్కడ చిత్రీకరించారో బీబీసీ ధ్రువీకరించలేదు.  ప్రిగోజిన్ మరణించారని గ్రేజోన్ ధ్రువీకరించిన తర్వాత.. ఆ ప్రమాదంలో మరణించిన వారి జాబితాను రష్యా ఏవియేషన్ ఏజెన్సీ విడుదల చేసింది. దీనిలో ప్రిగోజిన్ పేరు కూడా ఉంది.
 
ఇప్పుడు ఏం జరుగుతుంది?
రష్యా క్రిమినల్ కోడ్‌లోని ఆర్టికల్ 263 ప్రకారం, విమానం ఎలా కుప్పకూలిందో తెలుసుకునేందుకు ఒక కమిటీని ఏర్పాటుచేస్తారు. ఘటన జరిగిన ప్రాంతంలో అత్యవసర సేవల విభాగం పరిశీలన ఇప్పటికే పూర్తైంది. ప్రస్తుతం ట్వెర్ ప్రాంత గవర్నర్ ఐగోర్ రుడేన్యా పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగుతోంది.