సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 18 అక్టోబరు 2024 (21:56 IST)

ఎయిర్ఇండియా విమానానికి బెదిరింపులు, బ్రిటన్ ఫైటర్ జెట్స్ తోడు రాగా లండన్‌లో ప్రయారిటీ ల్యాండింగ్

air india
భారత్‌కు చెందిన ఓ ప్రయాణికుల విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో బ్రిటన్‌కు చెందిన రాయల్ ఎయిర్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) ఫైటర్ జెట్‌లు రంగంలోకి దిగాయి. ఆర్ఏఎఫ్ టైఫూన్ జెట్‌లు చేరుకునే సమయానికి ఎయిర్ ఇండియా విమానం నార్‌ఫోక్ మీదుగా ఆకాశంలో ఎగురుతోంది. సురక్షితమని తెలిసిన తర్వాత బోయింగ్ 777-300 విమానం ప్రయాణం కొనసాగించడానికి అనుమతించామని ఆర్ఏఎఫ్ ప్రతినిధి తెలిపారు.
 
విమానానికి బాంబు బెదిరింపు వచ్చిందని ఎయిర్ ఇండియా ధ్రువీకరించింది. ‘విమానం హీత్రూ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులు, సిబ్బంది అందరూ విమానం దిగారు’ అని తెలిపింది. అయితే, బాంబు బెదిరింపుపై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు విమాన సిబ్బంది తెలియజేసిన విషయాన్ని ఒక డచ్ ప్లేన్ స్పాటర్ (నెదర్లాండ్స్‌కు చెందిన ఈ వ్యక్తి విమానాలను గమనించి రికార్డ్ చేస్తుంటారు) రికార్డ్ చేశారు.
 
"బోర్డులో అనుమానాస్పద బాంబు ఉంది, ప్రయారిటీ ల్యాండింగ్‌ కోరుతున్నాం" అని గ్రౌండ్ కంట్రోలర్స్‌తో విమానం కెప్టెన్ అంటున్నట్లు ఆ ఆడియోలో ఉంది. ఆ తర్వాత ‘మాకు బాంబు బెదిరింపు వచ్చింది. ఎయిర్ ఇండియా 129 దిగడానికి అభ్యర్థిస్తోంది’ అని చెప్పారు కెప్టెన్. స్పాటర్ సోషల్ మీడియా ‘ఎక్స్’ అకౌంట్ @EHEH_spotter పేరుతో ఉంది. స్కానర్‌ని ఉపయోగించి కెప్టెన్ ఆడియోను రికార్డ్ చేసినట్లు ఈ నెదర్లాండ్స్ వాసి బీబీసీతో చెప్పారు. ఆర్ఏఎఫ్ జెట్‌లు విమానం వద్దకు వెళుతుండగా నార్‌ఫోక్‌ అంతటా పెద్ద శబ్దం వినిపించింది. ఆ శబ్దం విన్నామని నార్‌ఫోక్‌లోని పలువురు బీబీసీ రేడియో శ్రోతలు చెప్పారు. "వీసెన్‌హామ్‌లో భూమి కదిలింది, నాకు భయమేసింది" అని క్రిస్ అనే వ్యక్తి వాట్సాప్ ద్వారా తెలియజేశారు. "నేను కావ్‌స్టన్‌లో విన్నాను. తలుపులు, కిటికీలు కదిలి చప్పుడు చేశాయి. పక్కింటి వర్క్ షాపులోకి ట్రక్కు దూసుకుపోయిందనుకున్నా" అని గ్యారీ అనే వ్యక్తి మెసేజ్ చేశారు.
 
12 బాంబు బెదిరింపులు
ఫ్లైట్‌రాడార్ 24 ప్రకారం.. ఎయిర్ ఇండియా విమానం ఆ సమయంలో ఉత్తర సముద్రం మీదుగా ఎగురుతోంది, తర్వాత దిశను మార్చుకుంది. నార్‌ఫోక్, సఫోల్క్‌ గగనతలంలో చక్కర్లు కొట్టింది. "ముంబయి నుంచి లండన్‌కు వెళుతున్న ఎయిరిండియా ఫ్లైట్ ఏఐ129కి ఈరోజు సోషల్ మీడియాలో బాంబు బెదిరింపు వచ్చింది. హీత్రూ విమానాశ్రయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది, ప్రయాణికులు, సిబ్బంది అందరూ దిగారు. వారి రక్షణ, భద్రతే మాకు ముఖ్యం. ఈ ఊహించని పరిస్థితిలో మాకు సాయంగా నిలిచిన స్థానిక అధికారులకు కృతజ్ఞతలు" అని ఎయిరిండియా ప్రతినిధి ఒకరు తెలిపారు.
 
సోమవారం నుంచి 12కి పైగా భారత విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇది విమానాల ఆలస్యంతో పాటు, అవి వెళ్లే మార్గం మార్పులకు దారితీసింది. బుధవారం బెంగళూరుకు వెళ్లాల్సిన ఎయిర్ ఆకాస విమానాన్ని ఇలాగే బెదిరింపుల కారణంగా దిల్లీకి దారి మళ్లించారు.
 
ఈ ఘటనలు పలు ఎయిర్ ఇండియా విమానాల రాకపోకలపై ప్రభావం చూపించాయి. ఈ బెదిరింపులకు పాల్పడిన వారిని గుర్తించేందుకు, వారిని బాధ్యులను చేసేందుకు అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.
 
ఈ రోజు మధ్యాహ్నం పౌర విమానానికి బెదిరింపు రావడంతో తనిఖీ చేయడానికి ఆర్ఏఎఫ్ కోనింగ్స్‌బై నుంచి టైఫూన్ ఫైటర్ జెట్‌లు వెళ్లాయని ఆర్ఏఎఫ్ ప్రతినిధి ఒకరు స్పష్టంచేశారు. సురక్షితమని తెలిసిన తర్వాత గమ్యస్థానానికి బయలుదేరిందని తెలిపారు.