శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 6 జనవరి 2021 (15:31 IST)

ప్రతిరోజూ స్నానం చేయడం, చర్మ సౌందర్య ఉత్పత్తులు వాడటం ఎంతవరకు అవసరం?

"నాకు ఏ విధమైన ఇబ్బందీ లేదు"
అయిదు సంవత్సరాల నుంచి స్నానం చేయడం మానేసిన డాక్టర్ జేమ్స్ హ్యాంబ్లిన్ స్పందన ఇది. "మీకు అలవాటైపోతుంది. అంతా సాధారణంగా మారిపోతుంది" అని ఆయన బీబీసీకి చెప్పారు. 37 సంవత్సరాల హ్యాంబ్లిన్ యేల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. ఆయన ప్రివెంటివ్ మెడిసిన్ వైద్యుడు కూడా. "మన జీవితంలో రెండేళ్ల కాలాన్ని స్నానం చేయడంలోనే గడిపేస్తాం. అందులో ఎంత సమయం, నీరు వృధా అవుతోంది?" అని ఆయన ప్రశ్నించారు.

 
ఆయన రచించిన “క్లీన్: ది న్యూ సైన్స్ ఆఫ్ స్కిన్ అండ్ ది బ్యూటీ ఆఫ్ డూయింగ్ లెస్” అనే పుస్తకంలో దీని గురించి మరింత వివరించారు. చేతులు శుభ్రపర్చుకోవడం, పళ్ళు తోముకోవడం మాత్రం మానకూడదని చెబుతూనే, శరీరంలో మిగిలిన భాగాల గురించి అంతగా పట్టించుకోవలసిన అవసరం లేదని ఆయన అంటారు. ఈ స్నానం మానేయాలనే ఆలోచన ఒక ప్రయోగంలా మొదలయింది. "ఇలా చేయడం వలన ఏమవుతుందో చూడాలని అనుకున్నాను" అని ఆయన వివరించారు.

 
"చాలా కొన్ని సార్లు మాత్రమే స్నానం చేసే వారు నాకు తెలుసు. అది వీలవుతుందని నాకు తెలుసు. కానీ, అది నేనే సొంతంగా చేసి దాని ప్రభావం ఎలా ఉంటుందో చూడాలనుకున్నాను" అని చెప్పారు. ఆయన 2015లో స్నానం చేయడం ఆపేసిన తర్వాత ఎలాంటి ప్రభావం కలిగింది? "రోజులు గడుస్తున్న కొలదీ శరీరం స్నానం చేయకుండా ఉండటానికి అలవాటు పడిపోతుంది. దాంతో, సబ్బు, డియో వాడకపోయినా దుర్గంధం ఏమీ వెలువడదు. అలాగే శరీరం అంత జిడ్డుగా అవ్వదు" అని ఆయన అంటారు.

 
"చాలా మంది జుట్టుకు పట్టిన జిడ్డును వదిలించుకోవడానికి షాంపూ , కండిషనర్లు వాడతారు. కానీ, అది చేయడం మానేస్తే, కొన్ని రోజులకు ఆ ఉత్పత్తులు వాడక ముందు మీ జుట్టు ఎలా ఉండేదో అలానే తయారైపోతుంది" అని ఆయన అంటారు. కానీ, ఇదొక నిరంతర ప్రక్రియ అని ఆయన అన్నారు. ఆయన ఒక్కసారిగా స్నానం చేయడం ఆపేయలేదు. షాంపూ, డియో, సబ్బు వాడకాన్ని నెమ్మదిగా తగ్గిస్తూ మూడు రోజులకొకసారి స్నానం చేయడం మొదలు పెట్టారు. "చాలా సార్లు నాకు స్నానం చేయాలని అనిపించేది. జిడ్డు పట్టి దుర్గంధం వచ్చేది. కానీ, అది క్రమేపీ తగ్గిపోయింది" అని ఆయన చెప్పారు. సబ్బు, నీటిని తక్కువగా వాడటం మొదలు పెట్టేసరికి వాటి అవసరం కూడా తగ్గిపోతూ వచ్చింది.

 
శరీర దుర్గంధం, బ్యాక్టీరియా
మన శరీరం నుంచి వచ్చే చెమట, జిడ్డును అంటి పెట్టుకుని బ్రతికే బ్యాక్టీరియా వల్లే దుర్గంధం వస్తుందని అమెరికా అకడమిక్ నిర్వచిస్తోంది. ప్రతి రోజూ జుట్టుకు, చర్మానికి ఈ ఉత్పత్తులను వాడటం వలన శరీరం పై ఉండే తైలాలు, బ్యాక్టీరియాల మధ్య ఉండే సమతుల్యత దెబ్బ తింటుందని హ్యాంబ్లిన్ వాదిస్తారు. "విపరీతంగా స్నానం చేయడం ద్వారా చుట్టూ ఉన్న సహజ స్థితిని దెబ్బ తీయడమే" అని ఆయన 2016లో అట్లాంటిక్ పీస్ కి రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. అవి వెంటనే దుర్గంధం పుట్టించే మైక్రోబ్ లకు సహకరిస్తాయి అని ఆయన అన్నారు.

 
తరచుగా స్నానం చేయడం మానేయడం వలన సహజ స్థితి ఒక స్థిరత్వానికి వచ్చి దుర్గంధం వెలువడటం ఆగిపోతుందని ఆయన అంటారు. "మీరేమి రోజ్ వాటర్ లానో, బాడీ స్ప్రేలానో సువాసనలు వెదజల్లరు కానీ, అలా అని దుర్గంధం కూడా రాదు. మనిషిలా వాసన వస్తారు" అని ఆయన అన్నారు. ఆయన ఆగస్టు 2020లో బీబీసీ సైన్సు ఫోకస్ మ్యాగజైన్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన దగ్గర నుంచి దుర్గంధం వస్తున్న విషయాన్ని చెప్పడానికి ఇతరులు ఇబ్బంది పడ్డారా అని బీబీసీ ప్రశ్నించింది.

 
అలా జరిగితే తనకు చెప్పడానికి సంకోచించవద్దని చుట్టు పక్కల పని చేసే వారందరికీ చెప్పానని ఆయన చెప్పారు. అలా ఆయన దగ్గర నుంచి దుర్గంధం వెలువడకుండా ఉండే స్థాయికి చేరారు. నిజానికి ఆయన దగ్గర నుంచి వచ్చే కొత్త వాసనను ఆయన భార్య కూడా ఇష్టపడినట్లు చెప్పారు.

 
హ్యాంబ్లిన్ పూర్తిగా స్నానం చేయడం ఆపేశారా?
ఆయన వ్యాయామం చేసిన తర్వాత మట్టి పట్టినట్లుగా అనిపిస్తే స్నానం చేస్తారు. కానీ, స్నానం చేయకుండా కూడా మురికిని తొలగించుకోవచ్చని ఆయన వాదిస్తారు.

 
చర్మం జీవన శైలిని ప్రతిబింబిస్తుంది
స్నానం చేయడం ఆపేయాలని హ్యాంబ్లిన్ తీసుకున్న నిర్ణయం ప్రయోగం మాత్రమే కాదు. ఆయన పుస్తకం రాసేందుకు చేసిన పరిశోధనలో భాగంగా ఆయన చాలా మంది చర్మ వైద్య నిపుణులు, ఇమ్యునాలజిస్టులు, అలెర్జీ నిపుణులు, వేదాంత శాస్త్ర నిపుణులతో కూడా మాట్లాడారు. ఈ పుస్తకం చర్మ సౌందర్య ఉత్పత్తుల పరిశ్రమలను బాగా విమర్శించింది.

 
చర్మ సౌందర్య ఉత్పత్తులను ఉత్పత్తి చేసే కొన్ని పరిష్కారాల మీద దృష్టి పెట్టి పని చేస్తుందని ఆయన భావిస్తారు. వాటిలో కొన్ని ఉపయోగపడవచ్చు అని ఆయన అంటారు. కానీ చర్మ అంతర్గత ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాల్సి ఉండటం ముఖ్యమని ఆయన అంటారు. మన శరీరం లోపల జరుగుతున్న ప్రక్రియకు , జీవన శైలికి చర్మం అద్దం పడుతుందని ఆయన అంటారు.

 
స్నానానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారా?
శుభ్రంగా ఉండటం అంటే అందరూ ఒకేలా ఆలోచించరు. స్నానం చేసే అలవాటుకు అనవసరంగా అధిక ప్రాధాన్యత ఇచ్చారని ఆయన అంటారు. "అది ఒక ప్రాధాన్యతే కానీ, వైద్య పరమైన అవసరం కాదు" అని ఆయన అంటారు. స్నానం చేయడం మానేయమని నేను ఎవరికీ చెప్పడం లేదు అని హ్యాంబ్లిన్ అన్నారు.

 
ఈ విధానాన్ని పాటించడం ఎలా?
ఏది తప్పు, ఏది సరైనది అని చెప్పడానికి ఆయనకు ఆసక్తి లేదని హ్యాంబ్లిన్ చెప్పారు. ఇదే పద్దతి సరైనది అని కూడా ఆయన చెప్పదలుచుకోవడం లేదు. ఇది ఆయనకు పని చేసింది. కానీ, చర్మ సంబంధ సమస్యలు ఉన్నవారు ఇలాంటి ప్రయోగాన్ని చేయొద్దని ఆయన అంటారు. ఉదాహరణకు తక్కువ మోతాదులో షాంపూ లేదా తేలికపాటి డియో వాడకంతో మొదలు పెట్టి అప్పుడప్పుడూ తక్కువ సేపు స్నానం చేసి చూడవచ్చని చెప్పారు. ఇదేమి నాటకీయంగా జరగాల్సిన అవసరం లేదని అన్నారు.