శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 30 జనవరి 2020 (16:55 IST)

కేంద్ర బడ్జెట్ 2020: గత ఏడాది హామీల సంగతేమిటి? ఈసారి బడ్జెట్ నుంచి ప్రజలు ఏం ఆశిస్తున్నారు?

ఫిబ్రవరి 1 (శనివారం) ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆమె ప్రవేశపెట్టే రెండో బడ్జెట్ ఇది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆర్థిక ప్రాధాన్యాలను నిర్ధేశించడంతో పాటు, నేలచూపులు చూస్తున్న దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు మోదీ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోనుంది? అన్నది తెలుసుకునేందుకు అందరూ ఆతృతగా ఉన్నారు.

 
మరికొన్నేళ్లలోనే దేశ ఆర్థిక వృవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడం సాధ్యమేనని గత ఏడాది బడ్జెట్ ప్రసంగంలో మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. సమస్య ఏంటంటే, 2020లో ఆర్థిక వృద్ధి రేటు 5 శాతం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. అది గడచిన ఆరేళ్లలో అత్యల్పం. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ కూడా 2020లో భారత వృద్ధి రేటు 4.8 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది.

 
మరి, ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా ఈ బడ్జెట్ ఉంటుందా? ఈ బడ్జెట్ నుంచి ప్రజలు ఏం ఆశిస్తున్నారు? ముందుగా, గత బడ్జెట్‌లో ప్రభుత్వం చేసిన కొన్ని ప్రకటనలు, వాటి అమలు తీరును పరిశీలిద్దాం. గత బడ్జెట్ అంత ఘనంగా ఏమీ లేదు. కానీ, సామాన్యుల కోసం కొన్ని పథకాలను ప్రకటించారు.

 
వంట గ్యాస్
2022లోగా దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ విద్యుత్, వంట గ్యాస్ అందిస్తామని 2019 జూలైలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ చెప్పారు. అయితే, క్షేత్ర స్థాయిలో చూస్తే పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రభుత్వ తాజా నివేదికల ప్రకారం, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) కింద వంట గ్యాస్ వినియోగం వార్షిక సగటు తగ్గుతూ వస్తోంది. 2018లో వార్షిక వినియోగం 3.66 సిలిండర్లు ఉండగా, 2018 డిసెంబర్ నాటికి అది 3.21కి తగ్గింది. 2019 సెప్టెంబర్‌లో 3.08కి పడిపోయింది.

 
ఉజ్వల్ యోజన కింద గ్యాస్ వినియోగం తగ్గుతుండటం పట్ల కాగ్ తన తాజా నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. సిలిండర్లను దారి మళ్లించడం, సరఫరాలో ఆలస్యం లాంటి సమస్యలు ఉన్నాయని పేర్కొంది. "మొదట్లో చాలామంది ప్రజలు ఈ పథకాన్ని ఎంచుకున్నారు. కానీ, తాజా వివరాలను పరిశీలిస్తే ఈ పథకం కింద సిలిండర్లు నింపించేందుకు ప్రజలు ఆసక్తి చూపట్లేదని, దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రజలు కట్టెల పొయ్యి మీదే వండుకుంటున్నారని అర్థమవుతోంది" అని కేర్ రేటింగ్స్‌ సంస్థ సీనియర్ ఆర్థిక వేత్త కవితా చాకో అన్నారు.

 
"మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం కల్పించడం ప్రభుత్వానికి సాధ్యమే. కానీ, డిస్కంలు ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితుల వల్ల ఆ ప్రక్రియ కష్టంగా మారుతోంది. దేశంలోని డిస్కంలపై రూ.80,000 కోట్ల రుణభారం ఉంది. దాంతో, విద్యుత్ సరఫరా డిమాండ్‌కు సరిపడా ఉండట్లేదు" అని కవిత వివరించారు.

 
గృహ నిర్మాణం
గృహ నిర్మాణం విషయానికి వస్తే, ప్రతిష్టాత్మక ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 2022 నాటికి దేశంలో 'అందరికీ సొంతిల్లు' ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2021-22 ఆర్థిక సంవత్సరం ఆఖరులోగా దేశంలో అర్హులైన వారందరికీ ఇల్లు నిర్మించి ఇస్తామని, అందుకోసం 1,95,00,000 నివాసాలు నిర్మిస్తామని గత ఏడాది బడ్జెట్ ప్రవేశపెడుతూ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.

 
"ప్రస్తుత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ). అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ఈ పథకం బాగానే ముందుకు కదులుతోంది. 2019 ఆఖరి నాటికి ఈ పథకం కింద ఉత్తర్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో దాదాపు 11.22 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. గతేడాది ఆరంభానికి ఈ రాష్ట్రాల్లో 3.62 లక్షల నివాసాలు మాత్రమే పూర్తయ్యాయి" అని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ సంస్థ ఛైర్మన్ అనుజ్ పూరీ వివరించారు.

 
"గడువులోగా అన్ని ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడం సవాలుతో కూడిన విషయమే. కానీ, నిర్ధేశించుకున్న గడువులోగా లక్ష్యాన్ని చేరుకునేందుకు నూతన అధునాతన సాంకేతికతలు కొంతమేర ఉపయోగపడగలవు" అని పూరీ అంటున్నారు. మరోవైపు, నోట్ల రద్దు... వస్తు సేవల పన్ను (జీఎస్టీ)తో తీవ్రంగా దెబ్బతిన్న స్థిరాస్తి రంగం, ఆర్థిక మందగమనం వల్ల మరింత కుదేలైంది.

 
సరైన నిధులు లేక మధ్యలో ఆగిపోయిన గృహ నిర్మాణ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు రూ.25,000 కోట్లతో ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు 2019 నవంబర్‌లో కేంద్ర ప్ర‌భుత్వం ప్రకటించింది. కానీ, ఈ రంగాన్ని గట్టెక్కించాలంటే ప్రభుత్వం చేయాల్సింది ఇంకా ఉందని వ్యాపార నిపుణులు అంటున్నారు.

 
"స్థిరాస్తి రంగంలో డిమాండ్ పుంజుకోవాలంటే, నిర్మాణ దశలో ఉన్న ఇళ్లపై జీఎస్టీని తగ్గించడంతో పాటు తొలిసారి ఇల్లు కొనేవారికి ప్రభుత్వం మరిన్ని పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలి. అన్ని రంగాల్లోనూ ఉద్యోగ కల్పన క్రమంగా పెరగాల్సిన అవసరం ఉంది. మధ్యలో ఆగిపోయిన నివాస ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలి. దాంతో ఇప్పటికే ఆ ఇళ్లపై డబ్బులు పెట్టి, వాయిదాలు చెల్లిస్తూ ఇబ్బంది పడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది" అని పూర్తి అభిప్రాయపడ్డారు.

 
ఉపాధి కల్పన
గత ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు పీయూష్ గోయల్ ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్, ఎన్నికల అనంతరం జూలైలో పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ను మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఆ రెండు బడ్జెట్లలోనూ దేశంలో ఉపాధి కల్పన కోసం అనుసరించాల్సిన కొత్త వ్యూహాల ఊసే లేదు. పైగా, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయింపులను రూ.60,000 కోట్లకు తగ్గించారు. అది ప్రస్తుత సంవత్సరం సవరించిన అంచనా రూ.61,084 కోట్ల కంటే తక్కువ. ముద్ర, స్టాండ్ అప్ ఇండియా లాంటి స్వయం ఉపాధి పథకాలకు కేవలం రూ.515 కోట్లే కేటాయించారు.

 
భారత ప్రభుత్వం ముందున్న సవాళ్లలో ఉపాధి లేకపోవడం అతిపెద్ద సవాల్ అని నిపుణులు అంటున్నారు. "దేశంలో అనేక మంది గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగాల కోసం వెతుకుతున్న 25 నుంచి 30 ఏళ్లలోపు గ్రాడ్యుయేట్లలో దాదాపు ప్రతి నలుగురిలో ఒకరికి ఉద్యోగం దొరకడం లేదు" అని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సీఈవో మహేశ్ వ్యాస్ బీబీసీతో చెప్పారు.

 
పెన్షన్ ప్రయోజనాలు:
ప్రధాన మంత్రి కరమ్ యోగి మాన్ ధాన్ పథకం కింద, వార్షిక టర్నోవర్ రూ.1.5 కోట్ల కంటే తక్కువ ఉన్న చిన్న రిటైల్ వ్యాపారులు, దుకాణ యజమానులు పెన్షన్ పొందేందుకు అర్హులు. "ఈ పథకం ఘోరంగా విఫలమైంది. దీని అమలు కోసం సరైన ప్రణాళిక లేదు. దేశంలో దాదాపు ఏడు కోట్ల మంది అర్హులైన చిరు వ్యాపారులుంటే, కేవలం 25,000 లక్షల మంది మాత్రమే ఈ పథకాన్ని ఎంచుకున్నారు. ఎందుకంటే, ఆ పథకం వల్ల ఎవరికీ పెద్దగా ఉపయోగం లేదు. దీనిపై మా అభిప్రాయాలను, సూచనలను ప్రభుత్వానికి తెలిజేశాం" అని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖందెల్వాల్ తెలిపారు.

 
ఈ పథకాన్ని ఎంచుకోకపోవడానికి చాలామంది చెప్పే ప్రధాన కారణం, 18 నుంచి 40 ఏళ్ల లోపు వయసున్న వ్యాపారులు మాత్రమే ఈ పథకంలో చేరేందుకు అర్హులు అన్న నిబంధన పెట్టడం. రెండో కారణం, ఈ పథకాన్ని ఎంచుకున్న వారికి 60 ఏళ్ల వయసు తర్వాత నెలనెలా రూ.3,000 పెన్షన్ వస్తుంది. లబ్ధిదారు చనిపోతే వారి భర్త లేదా భార్యకు అందులో 50 శాతం పెన్షన్ వస్తుంది.