గురువారం, 20 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 23 ఆగస్టు 2023 (17:13 IST)

చిరుతపులి ఎదురుపడితే ఏం చేయాలి?

Leopard
చిరుతపులులు జనావాసాల్లోకి రావడం, దాడులు చేయడం లాంటి వార్తలు దేశవ్యాప్తంగా తరచూ ఎక్కడో ఒకచోట రిపోర్ట్ అవుతున్నాయి. తిరుమల నడకదారిలో చిరుతపులుల (లెపర్డ్‌ల) దాడులు ఈ మధ్య కాలంలో రెండు జరిగాయి. ఒక చిన్నారి ప్రాణాలు కూడా కోల్పోయింది. చిరుతపులి ఎదురైతే ఏం చేయాలి, ఏం చేయకూడదు? చిరుత దాడి నుండి తప్పించుకునే మార్గాలు ఏమైనా ఉన్నాయా? ఇవి సాధారణంగా ఎదురయ్యే ప్రశ్నలు.
 
ఈ ప్రశ్నలకు ‘తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ సర్వీస్’ సీనియర్ అధికారి ‘సిరిపురపు మాధవ రావు’ పలు సూచనలు చేస్తున్నారు. ఆయన తెలంగాణలోని కవ్వాల్ పులుల అభయారణ్యంలో డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (డీసిఎఫ్) హోదాలో జన్నారం డివిజన్ అటవీ అధికారిగా పనిచేస్తున్నారు. చిరుతపులి గురించి అటవీశాఖ అధికారి మాధవరావు బీబీసీతో చెప్పిన విశేషాలు, దాడి సమయంలో పాటించాల్సిన సూచనలు ఇవి..
 
‘‘పిల్లి జాతికి చెందిన చిరుతపులి సాధారణంగా సిగ్గరి. మనుషుల కంట పడేందుకు ఇష్టపడదు. మనుషుల అలికిడి వినిపిస్తే దూరంగా వెళ్లిపోతుంది. సాధారణంగా ఫారెస్ట్ సఫారీకి వెళ్లినప్పుడు పులి కనిపిస్తుంది. మిగతా సందర్భాల్లో చిరుత కంటపడడం తక్కువ. అది ఒంటరిగా నివసించేందుకు ఇష్టపడుతుంది. కలయిక సమయంలో సహచరితో, చిన్న పిల్లలతో ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువగా గుంపుగా కనిపిస్తుంది. సుమారు ఏడాది కాలం పాటు పిల్లల సంరక్షణ బాధ్యతలు మోస్తుంది ’’ అని ఆయన చెప్పారు. అడవిలో ముఖ్యంగా రాళ్లతో కూడిన గుహల్లాంటి ఆవాసాల్లో ఇవి నివసిస్తాయి. జింకలు, సాంబార్, అడవి పందులను ఎక్కువగా వేటాడతాయి. పైకి చూస్తే శరీరంపై కనిపించే మచ్చలు చూడటానికి ఒకేలా కనిపించినా.. ఏ రెండు చిరుతలకు ఒకే పద్ధతిలో ఇవి ఉండవు. వేటికవే ప్రత్యేకం.
 
చిరుతపులి ఎదురుపడితే ఏం చేయాలి, ఏం చేయకూడదు?
ప్రపంచంలోనే అతిఎక్కువ పులుల సంతతి కలిగిన దేశం భారత్. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో 2022 నాటికి దేశంలో వీటి సంఖ్య 3682. అయితే, పులుల సంఖ్యతో పోలిస్తే చిరుతల సంఖ్య భారత దేశంలో ఎక్కువ. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో చిరుతపులి జాతి విస్తరించి ఉంది. ‘‘పులులతో పోలిస్తే 1:8 రేషియోలో వీటి సంఖ్య ఉంటుంది. అంటే దేశవ్యాప్తంగా చిరుతపులుల సంఖ్య సుమారు 25 వేల వరకు ఉండే అవకాశం ఉంది’’ అని డీసీఎఫ్ మాధవ రావ్ తెలిపారు.
 
‘‘ఆవాసాలు దెబ్బతినడం, వేట, నీరు దొరకని సందర్భంలో చిరుతలు జనావాసాల్లోకి రావడం మనుషులు, జంతువుల మధ్య సంఘర్షణకు దారి తీస్తోంది. ఉద్దేశ పూర్వకంగా ఏ జంతువు అడవి నుండి బయటకు రాదు. అడవిలో మనుషుల ప్రమేయం పెరగడం, బయటి ప్రాంత ఒత్తిడి వల్లే ఇలా జరుగుతుంది. చిరుత వేగంగా కదిలే జంతువు కావడంతో జనావాసాల్లోకి వస్తే ఎక్కువ అలజడి సృష్టిస్తుంది. జనాల మధ్యకు వచ్చిన చిరుతను బంధించడం అంత సులువు కాదు’’ అని ఆయన వివరించారు. ‘‘తిరుమల నడక దారి నిజానికి అడవి జంతువుల ఆవాసం. మెట్ల మార్గం మొత్తం అడవి గుండా ఉంది. ఈ మార్గానికి రెండు వైపులా అడవి జంతువుల సంచారం ఉంది. దాని మధ్యలో నుంచి మనం వెళ్తున్నాం. అడవి జంతువులను అక్కడి నుండి తొలగించలేం. మనమే జాగ్రత్తలు పాటించాలి. అక్కడ ఫెన్సింగ్ లాంటిది ఏర్పాటు చేయాలి. లేదా ఇరువైపులా జంతువులు సంచరించేందుకు వీలుగా కారిడార్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. లేదంటే వాటి ఆవాసాలు దెబ్బతింటాయి’’ అని డీసీఎఫ్ మాధవ రావ్ తెలిపారు.
 
చిరుతపులి ఎంత దూరంలో ఎదురు పడిందన్న అంశంపై ప్రమాద తీవ్రత ఆధారపడి ఉంటుంది. దూరంగా ఎదురుపడితే సాధారణంగా అదే పక్కకు వెళ్లిపోతుంది. అలాంటి సమయంలో దాడి చేయాల్సిన అవసరం దానికి ఉండదు. అనుకోని పరిస్థితుల్లో అతి సమీపంలో ముఖాముఖిగా ఎదురుపడితే దాడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి సమయంలో ఎలా ప్రవర్తించాలో డీసిఎఫ్ మాధవ రావ్ వివరించారు. ‘‘అలాంటి సందర్భంలో రెండు చేతులు పైకి లేపి గట్టిగా అరవాలి. అప్పుడు తనకంటే ఎక్కువ ఎత్తు ఉన్న జంతువు ఉందన్న భ్రమలో పక్కకు పోయే అవకాశాలు ఉన్నాయి. అడవి జంతువుల సైకాలజీ పరిశీలిస్తే ఆకారంలో తమకంటే పెద్దగా ఉన్న జంతువులపై సాధారణంగా దాడికి దిగవు. చిరుతపులి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తిరిగి పరుగెత్తడం, లేదా పొదల చాటున దాక్కునే ప్రయత్నం చేయొద్దు. అలాంటి సమయంలో దాడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి’’ అని ఆయన చెప్పారు.
 
‘‘పారిపోతే అటాక్ చేస్తుందని కూడా కచ్చితంగా చెప్పలేము. అయితే , అది దాడి చేయాలని నిర్ణయించుకున్న సందర్భంలో ఎంత పరుగెత్తినా దాని వేగం ముందు నిలవలేము’’ అని ఆయన వివరించారు. ‘‘వెనక్కు తిరిగి పారిపోయే జంతువులను వేటలో భాగంగా తరుముతూ పట్టుకోవడం అడవిలో సాధారణంగా కనిపించే ధోరణి. పొదల మాటున నక్కి కూర్చుంటే తక్కువ ఎత్తువల్ల నాలుగు కాళ్ల జంతువు అని పొరపడి దాడి చేసే ప్రమాదం ఉంది. కాబట్టి చిరుత ఎదురుపడితే పరుగెత్తొద్దు. చిరుత కాస్త దూరంగా ఉంటే అలాగే నిలబడి పోయి చేతులు పైకి ఎత్తి దానివైపు ఓ కన్నేసి నెమ్మదిగా వెనక్కి నడవాలి. చాలా దగ్గరగా ఎదురుపడితే మాత్రం చేతులు పైకి పెట్టి అరుస్తూ నెమ్మదిగా వెనక్కి వస్తే చిరుత వెనక్కి వెళ్లే అవకాశం ఉంది’’ అని ఆయన తెలిపారు.
 
చెట్టు ఎక్కితే చిరుత దాడి నుంచి బయటపడవచ్చా?
చిరుతపులికి ఉన్న ప్రత్యేక లక్షణాల్లో చెట్లు ఎక్కడం ఒకటి. అది దాడి చేయాలని భావిస్తే చెట్లపైకి సులువుగా ఎక్కి దాడి చేయగలదు.
చిరుత దాడి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?
అటవీ ప్రాంతానికి సమీపంలో నివసించే వారు, అటవీ సరిహద్దుల్లో వ్యవసాయం ఉన్నవారు ఎక్కువగా చిరుత బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అయితే కొన్ని ముందుజాగ్రత్తలు పాటిస్తే దాడి నుండి తప్పించుకోవచ్చని మాధవ రావ్ తెలిపారు.
 
‘‘వీపు భాగంలో ఫేస్ మాస్క్ (మనిషి తల(ముఖం)ను పోలిన ముసుగు) ను ధరిస్తే చిరుత, ఇతర అటవీ జంతువుల బారినుండి బయటపడొచ్చు. సాధారణంగా అటవీ జంతువులు వెనుక వీపు భాగంపై దాడి చేస్తాయి. తలకు వెనుక వైపు ఫేస్ మాస్క్ పెట్టుకోవడం ముందు జాగ్రత్తగా ఉపయోగపడుతుంది. వ్యవసాయ కూలీలు ఫేస్ మాస్క్ ధరించాలని, గుంపులుగా చప్పుడు చేస్తూ వెళ్లాలని అటవీశాఖ తరపున సూచిస్తున్నాం. అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండే వారు రాత్రి సమయాల్లో మంటలను వేస్తే చిరుతతో పాటూ ఇతర అటవీ జంతువులు ఆ దరిదాపుల్లోకి రావు. సాధారణంగా గిరిజనులు ఈ పద్ధతి పాటిస్తారు’’ అని ఆయన తెలిపారు.
 
చిరుతల్లో మ్యాన్ ఈటర్స్ ఉంటాయా?
చిరుతల్లో మ్యాన్ ఈటర్స్ ఉండే అవకాశం తక్కువ. ప్రమాదం అని భావిస్తేనే దాడికి దిగుతాయే తప్ప నిజానికి వేటలో మనుషులు వాటి ప్రాధాన్యంలో లేరు. అటవీ ప్రాంతాల్లో సంచరించేప్పుడు చిరుతపులే మిమ్మల్ని మొదట చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు దాన్ని చూసేలోపు ఎన్నోసార్లు అది మిమ్మల్ని అప్పటికే చూసి ఉంటుంది. అడవి జంతువులకు మనుషుల అలికిడి, వాసన త్వరగా పసిగట్టే శక్తి ఉంటుంది. మనుషులతో పోలిస్తే వాటికి గ్రహణశక్తి ఎక్కువ. అందుకే , సాధారణంగా అలికిడి వినిపిస్తే కంటపడకుండా దూరంగా తప్పుకుంటాయి’’ డీసీఎఫ్ మాధవ రావ్ వివరించారు.
 
చిరుత దాడి తప్పని పరిస్థితి ఎదురైతే..
పులితో పోలిస్తే చిరుత బరువు, పంజా బలం తక్కువ. సాధారణంగా చిరుతపులి 100 నుండి 150 కిలోల బరువు ఉంటుంది. చిరుత దాడి నుండి తప్పించుకున్న సందర్భాలు ఉన్నాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. ‘చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేసిన తర్వాత, చిరుతపులికి కూడా దాడి తప్ప వేరే మార్గం లేని సందర్భంలో గట్టిగా ఎదురు నిలబడి, నిలువరించి గాయాలతో బయటపడ్డ ఘటనలు గిరిజన ప్రాంతాల్లో ఉన్నాయి. అయితే దీనికి చాలా మానసిక ధైర్యం, శారీరక బలం కావాలి. సాధారణంగా వేటాడే ప్రాణిని లోబర్చుకునేందుకు దాడి సమయంలో మెడ భాగంపై పంజాతో చిరుతలు దాడి చేస్తాయి. నోటితో మెడను పట్టుకునే ప్రయత్నం చేస్తాయి. మెడ భాగంపై దాడి చేయకుండా తప్పించుకోగలిగితే అరుదైన సందర్భాల్లో గాయాలతో బయటపడే అవకాశాలు ఉన్నాయి’’ అని మాధవ రావు అన్నారు.