సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శనివారం, 30 నవంబరు 2024 (11:56 IST)

రాంగోపాల్ వర్మ ఎక్కడున్నారు? పోలీసులు ఎందుకు ఆయన కోసం వెతుకుతున్నారు

ramgopal varma
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఫొటోలను గతంలో మార్ఫింగ్‌ చేసి ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసిన వ్యవహారంపై సినీ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ(ఆర్జీవీ)పై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్‌ స్టేషన్‌లో నవంబర్ 10న కేసు నమోదైంది. రాంగోపాల్‌ వర్మ 2023లో వ్యూహం అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ సినిమా విడుదల సందర్భంగా చంద్రబాబు, పవన్, లోకేశ్‌ల ఫొటోలను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి.. వారి పరువుకు భంగం కలిగించారంటూ టీడీపీ మద్దిరాలపాడు మండల కార్యదర్శి రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మద్దిపాడు పీఎస్‌లో ఈ నెల 10న ఏడు సెక్షన్లు (336(4), 353(2), 356(2), 61(2), 196, 352, ఐటీ సెక్షన్‌ 67) కింద రాంగోపాల్‌ వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు.
 
కాగా తనపై నమోదైన కేసు కొట్టేయాలని వర్మ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. క్వాష్‌ పిటిషన్‌లో అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పిస్తూ ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వలేమని తేల్చిచెప్పింది. ఈ నెల 19న ఉదయం 11 గంటలకు ఒంగోలు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని వర్మకు ఒంగోలు రూరల్‌ సీఐ శ్రీకాంత్‌ నోటీసులిచ్చారు. అయితే తాను సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నానని, వారం రోజులు గడువు కావాలని కోరారు. ఆయన విజ్ఞప్తి మేరకు పోలీసులు వారం రోజులు గడువు ఇచ్చారు. గడువు ముగిసిన తర్వాత వర్మ కనిపించకుండాపోయారని పోలీసులు చెబుతున్నారు. దాంతో పోలీసులు ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గుంటూరు జిల్లా తుళ్లూరు, అనకాపల్లి జిల్లా రావికమతం పోలీస్‌ స్టేషన్‌లోనూ రాంగోపాల్‌ వర్మపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.
 
టీవీ ఛానల్స్‌లో ఆర్జీవీ ఇంటర్వ్యూలు
పోలీసులకు చిక్కకుండా రాంగోపాల్‌ వర్మ గత మూడు రోజులుగా వివిధ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడం, సామాజిక మాధ్యమాల్లో ఆయన వీడియోలు రిలీజ్‌ చేయడం మరింత కలకలం రేపుతోంది.
 
ఇదేమైనా ఎమర్జెన్సీ కేసా? అసలు ఏమైనా అర్థం ఉందా?- రాంగోపాల్‌ వర్మ వ్యాఖ్యలు
ఓ వీడియోలో వర్మ మాట్లాడుతూ.. "నేను వణికిపోతున్నా.. మంచం కింద కూర్చొని ఏడుస్తున్నానంటూ పుకార్లు సృష్టిస్తున్న కొందరు మీడియా వాళ్లకు ఈ వీడియో నిరాశ కలిగించవచ్చు. క్షమించండి. నేను ఏడాది కింద ఏదో ట్వీట్‌ పెట్టానని నాపై ఆరోపణలున్నాయి. ఆ ట్వీట్స్‌తో ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయట. విచిత్రమేంటంటే .. ఏడాది కింద పెట్టిన ట్వీట్స్‌ నాలుగు భిన్నమైన ప్రాంతాల్లో నలుగురు వ్యక్తులకు మూడునాలుగు రోజుల వ్యవధిలో ఒకేసారి వారి మనోభావాలు దెబ్బతిన్నాయి. దీంతో ఫిర్యాదు చేసి కేసులు పెట్టడం జరిగింది’’ అని అన్నారు.
 
ఎవరి మీద పెట్టానో వాళ్లకు సంబంధం లేకుండా కేసు ఏమిటి?
"ఎవరిమీద పెట్టానో వాళ్లకు సంబంధం లేకుండా ఎవరో థర్డ్‌ పార్టీ కేసు పెడితే.. ఈ కేసు సెక్షన్స్‌ ఎలా వర్తిస్తాయనేది నా అనుమానం. విచారణ చేయడానికి పద్దతి ప్రకారం ఉన్న చట్టాలను వాడుతున్నారా..? పొలిటికల్‌ పార్టీలు వ్యవస్థలోని పోలీసులను ఆయుధాలుగా వాడుతున్నారా..? అని ప్రశ్నించిన వర్మ.. తాను ఏ ఒక్క రాజకీయ నేతను కానీ, పోలీస్‌ అధికారిని కానీ అనడం లేదన్నారు.
 
షూటింగ్‌ వర్క్‌ కొనసాగుతుండటంతో నిర్మాతకు నష్టం రావొద్దని నేను మళ్లీ టైం అడిగా. ఈ కేసు ఏమైనా ఎమర్జెన్సీ కేసా ఏమైనా.. ఏడాది తర్వాత ట్వీట్‌ చూసిన వారికి వారంలో అన్నీ అయిపోవాలనడంలో ఏమైనా అర్థం ఉంటుందా అసలు.. హత్య కేసుల్లాంటి వాటికి సంవత్సరాలు తీసుకొని ఇప్పుడు ఎమర్జెన్సీ కేసుల కంటే ముందే వీటిని విచారించడమేంటని రాంగోపాల్‌ వర్మ వ్యాఖ్యానించారు. ఇక పోలీసుల గురించి మాట్లాడుతూ తన వద్దకు ఏ పోలీసూ రాలేదని తాను ‘డెన్‌’లోనే ఉన్నానని వర్మ అన్నారు.
 
హైకోర్టులో మరో పిటిషన్‌
ఒకే అంశంపై తన రాష్ట్రంలోని పలు పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదు చేయడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో రాంగోపాల్‌ వర్మ మరో పిటిషన్‌ దాఖలు చేశారు. ఒకటే ఆరోపణకి సంంబంధించి వివిధ పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదు చేయొద్దని ఏపీ డీజీపీకి ఆదేశాలివ్వాలని ఆర్‌జీవీ తరఫు న్యాయవాది రాజగోపాలన్‌ ఆ పిటిషన్‌లో కోర్టును అభ్యర్దించారు. మరోవైపు అడ్వకేట్‌ జనరల్‌ ఈ కేసును వాదిస్తారని రాష్ట్ర ప్రభుత్వం సమయం కోరింది. ప్రభుత్వ అభ్యర్ధనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు తదుపరి విచారణను డిసెంబర్‌ 2కి వాయిదా వేసింది.
 
‘రాంగోపాల్‌ వర్మ పారిపోయి కబుర్లు చెబుతున్నారు. ఆయన మాటలన్నీ తప్పించుకునే ధోరణిలోనే ఉన్నాయి.. ధైర్యముంటే ఎక్కడ ఉన్నారో చెబితే అక్కడికి మా పోలీసులు వస్తారు కదా.. అయన చెబుతున్నట్టుగా ‘డెన్‌’లో లేరు. మా పోలీసు బృందాలు సీరియస్‌గానే సెర్చ్‌ చేస్తున్నాయి" అని ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసరావు బీబీసీకి తెలిపారు. కాగా రాంగోపాల్ వర్మతోనూ దీనిపై మాట్లాడేందుకు ‘బీబీసీ’ ప్రయత్నించింది. పలుమార్లు ఆయనకు ఫోన్ చేసినప్పటికీ అందుబాటులోకి రాలేదు.