శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 1 ఆగస్టు 2022 (14:03 IST)

చికోటి ప్రవీణ్ ఎవరు? తెలుగు రాష్ట్రాలను కుదుపుతోన్న క్యాసినో కేసు ఏంటి? ప్రముఖులతో ప్రవీణ్, మాధవ్ రెడ్డికి ఉన్న సంబంధాలు ఏంటి?

Praveen
హైదరాబాద్‌కి కొంత దూరంలో ఒక ఫామ్‌హౌస్. అందులో విదేశాల్లో కనిపించే కొన్ని పాములు, ఆస్ట్రిచ్‌లు మరికొన్ని జీవులు బంధించి కనిపిస్తాయి. స్వేచ్చగా తిరగాల్సిన వాటిని ఇక్కడ బంధించారు. చికోటి ప్రవీణ్ ఇంట్లో ఈడీ చేసిన దాడులతో వీటి గురించి అటవీ శాఖకు తెలిసింది. టూర్ ఆపరేటర్లుగా వ్యవహరిస్తూ, జూదం మాటున నిధులు మళ్లింపు జరిగిందన్న అనుమానంతో మొదలైన విచారణలో ఎన్నో విషయాలు బయటపడుతున్నాయి. క్యాసినో వ్యాపారంలో అవకతవకలు జరిగాయని, తెలుగు రాష్ట్రాలకు చెందిన కొంతమంది ప్రముఖులు కూడా ఇందులో ఉన్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

 
చికోటి ప్రవీణ్, మాధవ్ రెడ్డి ఇంట్లో ఈడీ సుమారు 16 గంటలు సోదాలు చేసింది. వీరిద్దరు నడుపుతున్న క్యాసినోలలో అవకతవకలు జరిగాయన్నది ప్రధాన ఆరోపణ. అయితే, ఇందులో కొంత మంది సినిమా వాళ్లు, రాజకీయ నేతలు కూడా ఉన్నారన్న వార్తలు బయటకి వస్తున్నాయి. అయితే ఈ క్యాసినోను ఎలా నిర్వహిస్తారు? ఇప్పుడు వీటిని నిర్వహించే వారిపై ఈడీ ఎందుకు సోదాలు చేస్తోంది?

 
అసలు క్యాసినో కేసు ఏంటి?
చికోటి ప్రవీణ్, మాధవరెడ్డి టూర్ ఆపరేటర్లుగా వ్యవహరిస్తూ క్యాసినో వ్యాపారంలో ఉన్నారు. గోవా, నేపాల్ లాంటి ప్రాంతాల్లో క్యాసినో చట్టబద్ధం కావడంతో అక్కడ ఈ వ్యాపారం చేస్తున్నారు. అక్కడికి తెలుగు రాష్ట్రాల్లోని కొంతమంది ప్రముఖులను తీసుకెళ్లడం, వారితో జరిపిన లావాదేవీలపై ఈడీ కన్నేసింది. ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించడం కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని 8 ప్రాంతాల్లో ఈడీ దాడులు చేసింది. చాలామంది ప్రముఖులు వీరితో టచ్‌లో ఉన్నట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు.

 
ఫెమా ( foreign exchange management act) ఉల్లంఘనలు జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. క్యాసినో ఆడేందుకు దొడ్డిదారిలో విదేశాలకు సొమ్ము తీసుకువెళ్లడం, గెలుచుకున్న డబ్బును కూడా దొడ్డిదారిలోనే స్వదేశానికి వచ్చేలా ఏర్పాట్లు జరిగినట్టు ఈడీ అనుమానిస్తోంది. బుధవారం ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకు బోయిన్‌పల్లిలోని మాధవరెడ్డి ఇంట్లో సోదాలు జరుగగా... సైదాబాద్‌లోని చికోటి ప్రవీణ్‌ ఇంట్లో అర్ధరాత్రి కూడా సోదాలు కొనసాగాయి. జూబ్లీహిల్స్‌ తదితర మరో 8 ప్రాంతాల్లో ఈడీ బృందాలు సోదాలు మొదలుపెట్టాయి. ఈ సోదాల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

 
ముఖ్యంగా జూదం ఆడటానికి ఉపయోగించే టోకెన్లు పెద్ద మొత్తంలో దొరికినట్లు సమాచారం. ఈ టూర్లను నిర్వహించే ఆపరేటర్ల కార్యాలయాలపై ఈడీ దాడులు నిర్వహించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, అధికారులు పేర్లు ఉన్నట్లు వార్తలు రావడంతో తమకు ప్రవీణ్ కుమార్‌తో అసలు సంబంధం లేదని కొంతమంది చెబుతున్నారు.

 
చికోటి ప్రవీణ్, మాధవ్‌రెడ్డి ఎవరు?
చికోటి ప్రవీణ్ ఎన్నో ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నారు. గోవా, శ్రీలంక, నేపాల్, థాయ్‌లాండ్లలో క్యాసినో నిర్వహణతో పాటు స్థానికంగాను జూదం నిర్వహించి అతడు పోలీసులకి పట్టుబడిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో సంక్రాతికి ప్రవీణ్ కుమార్ గుడివాడలో క్యాసినో ఏర్పాటు చేయటం కూడా అప్పట్లో వివాదాస్పదమైంది. అప్పట్లో ఆయనకు సహకరించిన వారు ఇప్పుడు ఈడీ సోదాలతో ఉలిక్కిపడుతున్నారు. ప్రవీణ్ కుమార్‌కి అత్యంత సన్నిహితుడు మాధవ్ రెడ్డి.

 
విదేశాల్లో క్యాసినో
నేపాల్‌లో క్యాసినో నిర్వహణ చట్టవిరుద్ధం కాదు. కానీ పంటర్స్, ఏజెంట్లు చేసిన లావాదేవీలు మాత్రం దొడ్డి దారిన చేసినట్టు ఈడీ అనుమానిస్తోంది. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి నేపాల్‌లోని బాగ్డోడ్రా విమానాశ్రయం వరకు పేకాటరాయుళ్లకి నాలుగు రోజుల ప్యాకేజి అందించేవారు. లక్షల్లో ఉండే ఈ ప్యాకేజీలో వారికి కావాల్సిన సౌకర్యాలు, పేకాట ఆడటానికి అన్ని వసతులు అందించేవారని ఈడీ విచారణలో వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. నేపాల్‌లో క్యాసినో ఈవెంట్‌కి పెద్ద సంఖ్యలో పంటర్లు వచ్చేలా టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్లతో గ్రాండ్‌గా ప్రమోషన్లు నిర్వహించారు ప్రవీణ్‌. అయితే, వీరి ప్రమేయం కేవలం ప్రమోషన్ వరకే పరిమితమైందా? లేక చట్టవిరుద్ధంగా జరిగిన హవాలా డబ్బు లావాదేవీల్లో కూడా వీరి పాత్ర ఉందా అన్న కోణంలో కూడా విచారణ జరుగుతోంది.

 
ప్రవీణ్ కుమార్‌తో పాటు ఏజెంట్లుగా పని చేసిన వారి ఇంట్లో కూడా ఈడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌తో పాటు హైదరాబాద్‌కి ఆనుకొని ఉన్న పరిసర ప్రాంతాల్లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరులో కూడా సోదాలు నిర్వహించారు. నేపాల్‌లోనే కాకుండా శ్రీలంక, ఇండోనేసియాలోని బాలి, థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ ఐలాండ్‌లో కూడా వీరు వ్యాపారం విస్తరించినట్టుగా ఈడీ గుర్తించింది.

 
క్యాసినోతో పాటు అరుదైన జంతువులతో మినీ జూ
చికోటి ప్రవీణ్ కుమార్ సోషల్ మీడియా ప్రొఫైళ్లలో తాను జంతు, ప్రకృతి ప్రేమికుడు అని రాసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఊసరవెల్లులతో దిగిన ఫొటోలు అప్‌లోడ్ చేశారు. అప్పట్లో అటవీ శాఖ అధికారులు ఎవరూ దీన్ని పట్టించుకోలేదు. అయితే, ప్రవీణ్ కుమార్, మాధవ్ రెడ్డి ఇంటిపై ఈడీ దాడులు చేయడంతో, జంతువులకు సంబంధించిన వార్తలు కూడా బయటకు పొక్కడంతో అటవీశాఖ అధికారులు హడావిడిగా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం సాయిరెడ్డి గూడలో చికోటి 12 ఎకరాల ఫామ్ హౌస్‌కి చేరుకున్నారు. అక్కడ అరుదైన పాములు, ఉడుములు, ఊసరవెల్లులు, సుమారు 24 రకాల పక్షులు కనిపించాయి.

 
ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ హేమ ఈ విషయంపై స్పందించారు. "కడ్తాల్ సమీప సాయిరెడ్డి గూడెంలోని చికోటి ఫామ్‌హౌస్‌లో తనిఖీలు చేశాం. పాములు, ఆఫ్రికన్ దేశానికి చెందిన ఆస్ట్రిచ్‌లు నిబంధనలు విరుద్ధంగా ఫామ్‌హౌస్‌లో ఉండటానికి వీల్లేదు. ఫ్రెండ్లీగా వుండే పక్షులు వుండొచ్చు. ఫామ్‌హౌజ్‌లో పైథాన్ ఉందని సమాచారం వచ్చింది. కానీ, అది ఇక్కడ కనిపించట్లేదు. ఫామ్‌ హౌజ్ అంతా తనిఖీ చేశాం. స్వేచ్ఛగా తిరగాల్సిన వాటిని ఇక్కడ బంధించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న జంతువులను గుర్తించి, ఫామ్‌హౌజ్ నిర్వాహకులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తాం" అని చెప్పారు. ఈ చికోటి ఫామ్ హౌజ్ నిర్వాహకుడు, ప్రవీణ్ కుమార్ బంధువు అయిన మాధవ రావు మాత్రం చికోటి ప్రవీణ్ తనకు ఇష్టమైన పక్షులను మాత్రమే ఇక్కడ పెంచుకుంటున్నారని, ఇక్కడ ఎలాంటి పార్టీలు జరుగవని చెప్పుకొచ్చారు. ఇక్కడ ఉన్న జంతువులు, పక్షులకు అన్ని అనుమతులు ఉన్నాయనేది ఆయన వాదన.

 
గోవాలోని బిగ్ డ్యాడీ క్యాసినోతో ప్రవీణ్ కుమార్‌కు భాగస్వామ్యం ఉందా?
గోవాలోని "బిగ్ డ్యాడీ" క్యాసినోలో భాగస్వామ్యం ఉన్నట్లు స్వయంగా చికోటి ప్రవీణ్ సామాజిక మాధ్యమాలలో వెల్లడించారు. అయితే, హరియాణా ఎమ్మెల్యే గోపాల్ కంద గోల్డెన్ గ్లోబ్ హోటల్ ప్రైవేట్ లిమిటెడ్ వారిదన్నది ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక గతంలో వెల్లడించింది. గీతికా శర్మ అనే ఎయిర్ హోస్టెస్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఒక కేసులో గోపాల్ కంద ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గోవాలో ఫేమస్ అయిన 'బిగ్ డ్యాడీ' క్యాసినోలో ప్రవీణ్‌ది ఎంత కీలక పాత్ర అన్న దానిపై కూడా సమాచారం అందాల్సి ఉంది. గతంలో నేపాల్‌లో నిర్వహించిన క్యాసినోకు తెలంగాణ, ఆంధ్రాకు చెందిన ప్రముఖులను ప్రత్యేక విమానంలో తీసుకెళ్లి క్యాసినో ఆడించినట్టు వార్తలు వస్తున్నాయి.

 
నెల రోజుల క్రితం చంపాపేటలోని సామ సరస్వతి గార్డెన్స్‌లో అంగరంగ వైభవంగా చికోటి జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ వేడుకకు సంబంధించిన ఒక వీడియోను గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ యూట్యూబ్‌లో పెట్టారు. ఆ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ హాజరు అయినట్లు వీడియోలో కనబడుతోంది. తెలంగాణ ఎమ్మెల్యేలు, పోలీస్ ఉన్నతాధికారులు, జైళ్ల శాఖకు చెందిన ఉన్నతాధికారులు కూడా హాజరు అయినట్లు సమాచారం. చికోటి ప్రవీణ్ కుమార్‌పై రాహుల్ సిప్లిగంజ్ పాట పాడారు.

 
ఈ కేసులో ఎవరి పేర్లు వినబడుతున్నాయి?
గత నెలలో ప్రవీణ్ నిర్వహించిన వేడుకలో పలువురు తెలంగాణ మంత్రులు, ముఖ్య నేతలు, అధికారులు కూడా హాజరైనట్లు తెలుస్తోంది. ఈ విషయంపై బీబీసీ తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌ను సంప్రదించగా వారు అందుబాటులో రాలేదు. అయితే మాధవరెడ్డి వాడుతున్న కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్నట్లు, ఆ స్టిక్కర్ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిందని గుర్తించారు. అయితే, కారు నెంబర్ TS10ET 0444 కాగా 0 లేకుండా కేవలం 444ను రాసుకుని తిరుగుతున్నారు. ఈ విషయంపై మల్లారెడ్డి స్పందిస్తూ "నాకు సంబంధించిన ఎమ్మెల్యే స్టిక్కర్ వేరే వ్యక్తుల వాహనాలపై కనిపిస్తే వెంటనే ఆ బండ్లని సీజ్ చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోండి " అని పోలీసులను కోరారు. తనకు, తన కుటుంబానికి కలిపి మొత్తం మూడు స్టిక్కర్లు మాత్రమే ఉన్నాయని మల్లారెడ్డి మీడియాకు తెలిపారు. క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్‌తో తనకు ఎటువంటి సంబంధం లేదని ఆంధ్ర మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ''నేను క్యాసినోకి ఎప్పుడైనా వెళ్లి వస్తుంటా. పేకాట ఆడతానని నేనే ఒప్పుకుంటున్నాను. చికోటి ప్రవీణ్‌తో, హవాలాతో నాకు సంబంధం లేదు" అని ఆయన చెప్పారు.

 
చికోటి ప్రవీణ్ కుమార్ ఏమంటున్నారు?
ఈడీ సోదాలు, నోటీసులు అంశంపై చికోటి ప్రవీణ్ కుమార్ స్పందించారు. "సాధారణ సోదాల్లో భాగంగానే ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వారికి ఏదో అనుమానం వచ్చి ఉంటుంది. అందుకే తనిఖీలు చేసుకుంటున్నారు. నేను నిర్వహించే క్యాసినోలు అన్నీ చట్టబద్ధమైనవే " అని ఆయన అన్నారు. సాధారణ వ్యక్తి అయిన మిమ్మల్ని ఈడీ ఎందుకు టార్గెట్ చేసిందని విలేఖరులు ప్రశ్నించగా... ఏం చెప్పుకోవాలన్నా తాను ఈడీ అధికారులకే సమాధానం చెప్పుకుంటానని, మీకు చెప్పాల్సిన అవసరం లేదని మీడియాను ఉద్దేశించి అన్నారు.

 
అసలు చట్టం ఏం చెబుతోంది?
తెలంగాణలో జూదం ఆడటం నేరం. కానీ, జూదం చట్టబద్ధమైన చోట పేకాట ఆడటం లేదా జూదానికి సంబంధించిన వ్యాపారం చేసుకోవడం నేరం కాదని అంటున్నారు హైకోర్ట్ న్యాయవాది కటిక రవీందర్ రెడ్డి. "13 కార్డ్స్ ఆట ఎవరైనా ఆడొచ్చు. కాకపోతే డబ్బులు పెట్టి మూడు ముక్కలాట ఆడటానికి మనవద్ద అనుమతి లేదు. కానీ, వేరే ప్రాంతాల్లో దీనికి అనుమతి ఉంది కాబట్టి అక్కడికి వెళ్లి ఈ ఆట ఆడటం తప్పు కాదు. ఆటలో గెలిచిన డబ్బును ఇక్కడికి తీసుకొచ్చాక టాక్స్ కట్టారా లేదా అన్నది చూడాలి.


ఈ కేసులో డబ్బు హవాలా జరిగిందా? లేదా అన్నది ముఖ్యం'' అని ఆయన అన్నారు. సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి కోట్లాది రూపాయలు తీసుకొని వారు విదేశీ క్యాసినోల్లో ఆడేందుకు డాలర్లను ఏర్పాటు చేయడం చికోటి ప్రవీణ్ వ్యాపారంలో భాగమని ఈడీ సందేహిస్తోంది. ప్రముఖుల నల్లధనాన్ని హవాలా రూపంలో అందుబాటులోకి తెస్తున్నారని ఈడీ అనుమానిస్తోంది. దీని వెనుక ఎవరు ఉన్నారు? ప్రవీణ్‌కు ఎవరు ఎలా సహకరిస్తున్నారనేది విచారణలో బయట పడాల్సి ఉంది. ఈ కేసులో చికోటి ప్రవీణ్‌, మాధవ్ రెడ్డితో పాటు మరో నలుగురికి ఈడీ సోమవారం హాజరు కావాలంటూ సమన్లు జారీ చేసింది.