సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : సోమవారం, 21 సెప్టెంబరు 2020 (16:31 IST)

పాకిస్తాన్‌‌లో షియా ముస్లింలపై దాడులు ఎందుకు పెరుగుతున్నాయి?

పాకిస్తాన్‌లో సైన్యాన్ని విమర్శించిన ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్‌కు చెందిన జర్నలిస్టు బిలాల్ ఫరూఖిని మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ గత వారం అరెస్టు చేశారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే, కొన్ని గంటల తర్వాత బిలాల్‌ను జామీనుపై విడుదల చేశారు.

 
పాకిస్తాన్ ప్రభుత్వ వైఫల్యాలతోపాటు మత ఛాందస వాదంపై సోషల్ మీడియాలో బిలాల్ తరచూ వ్యాఖ్యలు చేసేవారు. పాకిస్తాన్‌లో షియా ముస్లింలపై ద్వేషాన్ని పెంచేలా జరుగుతున్న ర్యాలీలపై సెప్టెబరు 18న ఆయన రెండు ట్వీట్లు చేశారు. ఒక ట్వీట్‌లో ఇస్లామాబాద్‌లో జరిగిన షియా వ్యతిరేక ర్యాలీ క్లిప్‌ను ఆయన ట్యాగ్ చేశారు. దాని కింద ఇలా రాశారు.

 
''షియా ముస్లింలపై విద్వేషం కక్కే ఈ ముల్లాలు ర్యాలీ నిర్వహిస్తుంటే నేనూ ప్రశాంతంగా కూర్చోలేను. దీనికి ముందు ఇంకొక ర్యాలీ జరిగింది. ఆ ర్యాలీలో షియాలను కాఫిర్ (ఇస్లాంపై నమ్మకంలేనివారు)గా పేర్కొన్నారు''. ''ఇది చాలా ప్రమాదకరం. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వారు ప్రయత్నిస్తున్నారు. హోం మంత్రిత్వ శాఖ నిషేధించిన సంస్థలు ఈ ర్యాలీలను నిర్వహిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా.. వారిని ఎందుకు పట్టుకోవట్లేదు''అని ఆయన వ్యాఖ్యానించారు.

 
షియా ముస్లింలను నిషేధించాలంటూ అభ్యర్థనలు
బిలాల్ ట్వీట్ చేసిన వీడియో క్లిప్‌లో.. పెద్ద ర్యాలీ కనిపిస్తోంది. షియా ముస్లింలను నిషేధించాలంటూ ఓ వ్యక్తి వేదికపై నుంచి చెబుతున్న దృశ్యాలు దీనిలో ఉన్నాయి. అంతేకాదు షియా ముస్లింలతో సంబంధాలు పెట్టుకునేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరికలు కూడా చేశారు. ఈ ట్వీట్‌పై పాకిస్తాన్ మహిళా హక్కుల ఉద్యమకారిణి ఇస్మత్ రజా షాజహాన్ స్పందించారు.

 
''చైనా-ఇరాన్‌ల మధ్య కుదిరిన 400 బిలియన్ డాలర్ల ఒప్పందం, ఇరాన్‌ (షియా దేశం)లోని బందర్‌అబ్బాస్‌ పోర్టుకు పెరుగుతున్న ప్రాధాన్యంపై అమెరికా, సౌదీతోపాటు చాలా గల్ఫ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ చీఫ్, సైన్యాధిపతి జనరల్ బాజ్వాల.. సౌదీ పర్యటన, సౌదీపై విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ ప్రకటన తర్వాత షియాలపై విద్వేషాలు వెదజల్లడం మొదలైంది''అని ఆమె వ్యాఖ్యానించారు.

 
అయితే, షియాలపై విద్వేషం వెదజల్లడానికి చాలా కారణాలున్నాయని ప్రముఖ రాజకీయ విశ్లేషకురాలు అయేషా సిద్దిఖీ అన్నారు. చైనా-ఇరాన్‌ల మధ్య కుదరిన ఆ 400 బిలియన్ డాలర్ల ఒప్పందం ఒక చిన్న కారణం అయ్యుండొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.

 
దైవదూషణ ఆరోపణలు
మొహరం ప్రదర్శనల తర్వాత షియాలకు వ్యతిరేకంగా ర్యాలీలు జరగడం మొదలైంది. షియాలు దైవ దూషణకు పాల్పడుతున్నారని అతివాద సున్నీ ముస్లిం సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఏఎఫ్‌పీ వార్తా సంస్థ సమాచారం ప్రకారం.. కరాచీలో సెప్టెంబరు 11న షియా వ్యతిరేక ర్యాలీ జరిగింది. దైవ దూషణను ఇకపై సహించేదిలేదని దీనిలో ఇస్లామిక్ జమియత్ ఉలేమా-ఇ-ఇస్లాంకు చెందిన ఖారీ ఉస్మాన్ వ్యాఖ్యానించారు.

 
ఈ ర్యాలీలో కొందరు సిపాహ్-ఇ-సాహెబా సంస్థ సభ్యులు షియా వ్యతిరేక బ్యానర్లు ప్రదర్శించారు. గత కొన్నేళ్లుగా షియాలపై దాడులు చేస్తూ, వారిని మట్టుపెడుతున్నట్లు ఈ సంస్థపై ఆరోపణలున్నాయి. షియాలపై విద్వేషం అంశం పాకిస్తాన్ సెనేట్‌లోనూ శుక్రవారం చర్చకు వచ్చింది. షియాలపై విద్వేషాన్ని కొందరు బహిరంగంగానే వెదజల్లుతున్నారని, దీన్ని వెంటనే ఆపేలా చూడాలని ప్రభుత్వాన్ని ద పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) కోరింది.

 
ఈ అంశంపై పీపీపీ పార్లమెంటరీ నాయకుడు, సెనేటర్ షెరీ రెహ్మాన్ మాట్లాడారు. ''పాకిస్తాన్‌లోని ముస్లింలలో షియాలు 20 శాతం వరకూ ఉంటారు. ఇటీవల కాలంలో వారిపై దాడులు పెరిగాయి. ఇవి దేశ సుస్థిరతకు ముప్పు తెచ్చే అవకాశముంది. షియాలపై 20కిపైగా దాడులు జరిగినట్లు కేసులు చెబుతున్నాయి. అయితే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదో అర్థం కావట్లేదు''

 
జిన్నా పాకిస్తాన్
''షియా ముస్లింలకు వ్యతిరేకంగా ర్యాలీలు జరుగుతున్నాయి. వాటిలో విద్వేష పూరిత నినాదాలు చేస్తున్నారు. ఇది చాలా సున్నితమైన అంశం. దీనిపై తక్షణమే స్పందించాలి''అని రెహ్మాన్ వ్యాఖ్యానించారు. ''ఉగ్రవాదానికి కళ్లెం వేసేందుకు మనం చాలా ప్రయత్నిస్తున్నాం. చాలా త్యాగాలనూ చేస్తున్నాం. ఇది జిన్నా పాకిస్తాన్. మసీదుకు వెళ్లినట్టే.. మనం ఆలయాలకూ వెళ్లొచ్చని జిన్నా చెప్పారు. మీరు ఏ మతానికి చెందిన వారైనా ప్రభుత్వం వివక్ష చూపదని అన్నారు''.

 
''దేశ ప్రజల ప్రాథమిక హక్కులను ప్రభుత్వం కాపాడాలి. షియాలు కూడా ఈ దేశ పౌరులే''అని రెహ్మాన్ వ్యాఖ్యానించారు. దక్షిణాసియా టెర్రరిజం పోర్టల్ సమాచారం ప్రకారం.. పాకిస్తాన్‌లో 2001 నుంచి 2018 మధ్య 4,847 మంది షియాల హత్యలు జరిగాయి. అయితే వాస్తవానికి ఈ సంఖ్య దీని కంటే పది రెట్లు ఎక్కువే ఉంటుందని వార్తలు కూడా వచ్చాయి.

 
సున్నీలదే ఆధిపత్యం
ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ సమాచారం ప్రకారం.. మొహరం తర్వాత షియాలపై దాడులు పెరిగాయి. కరాచీలో గత కొన్ని వారాల్లో ఇవి మరింత ఎక్కువయ్యాయి. కరాచీలో సెప్టెంబరు 13న జరిగిన షియా వ్యతిరేక ర్యాలీలో వేల మంది పాల్గొన్నారు. మహమ్మద్ అలీ జిన్నా రోడ్‌లో పెద్దయెత్తున్న షియా వ్యతిరేక నినాదాలు చేసినట్లు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ వెల్లడించింది.

 
ఇక్కడ నిరసనలకు నేతృత్వం వహించిన వారిలో మునీబుర్ రెహ్మాన్ కూడా ఉన్నారు. రుయితే హిలాల్ కమిటీకి ఈయన ఛైర్మన్. ఈద్ పర్వదినాలను ప్రభుత్వం తరఫున వీరే ప్రకటిస్తారు. ఈ ఏడాది జులైలో పంజాబ్ ప్రావిన్స్‌ అసెంబ్లీ.. తెహ్‌ఫుజ్-ఇ-బునియాద్-ఇ-ఇస్లాం బిల్లును ఆమోదించింది. దీని ప్రకారం.. సున్నీలు చెప్పే ఇస్లాం వ్యాఖ్యానాలను మాత్రమే ఇక్కడ అనుమతిస్తారు. దీనిపై షియాలు నిరసన వ్యక్తంచేశారు.

 
చాలా మంది సభ్యులు బిల్లులోని నిబంధనలను చదవకుండానే దీనికి మద్దతుగా ఓటేశారు. ఇక్కడ ఆగస్టులో 42 దైవ దూషణ కేసులు నమోదయ్యాయి. వీటిలో ఎక్కువ శాతం షియాలకు వ్యతిరేకంగానే ఉన్నాయి. ఇటీవల మూడేళ్ల షియా బాలుడిపైనా కేసు నమోదు చేశారు. నియంతృత్వ సైన్యాధిపతి జియా ఉల్ హక్ హయాంలో 1980ల్లో పాకిస్తాన్‌లో షియాలపై హింస మొదలైంది. పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా.. కూడా ఇస్మైలీ షియానే. అయితే జియా ఉల్ హక్ హయాంలోనే షియాలపై దాడులు ఎక్కువయ్యాయి.

 
అయితే, జిన్నా షియానా లేక సున్నీనా? అనే వివాదం ఎప్పటి నుంచో నడుస్తూ వస్తోంది. ''జిన్నాకు అంత్యక్రియలు నిర్వహించేటప్పుడు ముస్లిం లీగ్‌కు చెందిన షబ్బీర్ అహ్మద్ ఉస్మానీ అనే ఇస్లాం బోధకుడు అక్కడే ఉన్నారు. సున్నీ విధివిధానాలకు అనుగుణంగా అంత్యక్రియలు నిర్వహించాలని ఆయన పట్టుబట్టారు. వివాదం తేలకపోవడంతో.. రెండు విధానాల్లోనూ అంత్యక్రియలు జరపాల్సి వచ్చింది''అని పాకిస్తాన్ చరిత్రకారుడు ముబారక్ అలీ.. బీబీసీతో చెప్పారు.

 
''జిన్నా.. ఇస్మైలీ కావడంతో షియా అయ్యారు. ఇస్మైలీలు.. ఆరుగురు ఇమామ్‌లను నమ్ముతారు. షియాలు 12 మంది ఇమామ్‌లను నమ్ముతారు. నాకు తెలిసినంత వరకూ ఆయన మతాన్ని అంతగా పట్టించుకోరు. కానీ ఆయనకు చాలా ఆత్మగౌరవం ఉండేది. ఇస్మైలీలు.. ఆగా ఖాన్‌ను కొలుస్తారు. కానీ ఆయన్ను ఇమామ్‌గా అంగీకరించడం జిన్నాకు ఇష్టముండేది కాదు. అందుకే ఆయన్ను షియాగా పిలవొచ్చు''