బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Updated : శుక్రవారం, 17 మే 2019 (18:33 IST)

ముచ్చటగా మూడో వరల్డ్ కప్ టీమిండియాకు దక్కేనా?

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా ఈ మెగా టోర్నీ జరుగనుంది. ఇందులో జూన్ 5వ తేదీన భారత క్రికెట్ జట్టు తన తొలి మ్యాచ్‌ను ఆడనుంది. ప్రత్యర్థి దక్షిణాఫ్రికా. వేదిక సౌతాంఫ్టన్.
 
ఈ మెగా ఈవెంట్‌లో టీమిండియా అభిమానులకు ట్రోఫీ తప్ప వేరే ఏదీ సంతోషం ఇవ్వదు. భారత జట్టుపై అభిమానులు అంత నమ్మకం పెట్టుకోడానికి ఒక కారణం కూడా ఉంది. ప్రపంచమంతా దాన్ని విరాట్ కోహ్లీ అని పిలుస్తుంది.
 
2017లో జరిగిన వన్డేలో ఇంగ్లండ్‌ 351 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు విజయవంతంగా చేజ్ చేసినపుడు ఇంగ్లండ్ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ "టెస్టుల్లో, వన్డేల్లో టీ-20ల్లో ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీనే" అని ప్రశంసించాడు.
 
ఇటీవల ఒక కార్యక్రమంలో ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్, 2019 ఐసీసీ వరల్డ్ కప్ బ్రాండ్ అంబాసిడర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కూడా "విరాట్ కోహ్లీ.. సచిన్ టెండూల్కర్‌ని మించిన ఆటగాడు, బహుశా ఆల్ టైమ్ బెస్ట్ ప్లేయర్" అని అన్నాడు.
 
ఇప్పుడు కోట్లాది అభిమానుల ఆశలన్నీ ఆ అద్భుత ఆటగాడు, కెప్టెన్‌పైనే పెట్టుకున్నారు. కోహ్లీ కెప్టెన్సీలో వరల్డ్ కప్ ముచ్చటగా మూడోసారి భారత్‌ సొంతం అవుతుందని ఎదురుచూస్తున్నారు.
 
క్రికెట్‌వైపు ఆకర్షణ... 
విరాట్ కోహ్లీ ఢిల్లీలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. తండ్రి ప్రేమ్ కోహ్లీ విరాట్‌ను ఒక పెద్ద క్రికెటర్ చేయాలని, అతడు భారత్ తరపున ఆడుతుంటే చూడాలని కలలు కన్నాడు. అందుకే ఆయన కోహ్లీని ఢిల్లీలో కోచ్ రాజ్‌కుమార్ శర్మ అకాడమీలో చేర్పించారు.
 
విరాట్ ఏకాగ్రత, కోచ్ శ్రమ అతడిని ఒక్కో మెట్టు ఎక్కించింది. సమయం రాగానే విరాట్ ఢిల్లీ రంజీ టీంలో కూడా చోటు దక్కింది. తర్వాత జరిగిన ఒక ఘటన రాత్రికిరాత్రే ఒక యువ ఆటగాడిని, పరిపక్వత ఉన్న ఒక క్రికెటర్‌గా మార్చేసింది.
 
ఢిల్లీ కర్ణాటక మధ్య రంజీ మ్యాచ్ జరుగుతోంది. ఢిల్లీ టీమ్ పరిస్థితి దారుణంగా ఉంది. మ్యాచ్ కాపాడుకోవడమే కష్టంగా ఉంది. ప్రత్యర్థి టీమ్ 446 పరుగులకు సమాధానంగా ఢిల్లీ 5 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేయగానే రోజు ముగిసింది. అప్పుడు కోహ్లీ 40 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. కానీ ఇంట్లో పరిస్థితి సరిగా లేదు. నిజానికి విరాట్ తండ్రి ప్రేమ్ కోహ్లీ కొన్నిరోజులుగా అనారోగ్యంతో ఉన్నారు. ఆ రాత్రి ఆయన కన్నుమూశారు.
 
కోచ్ రాజ్‌కుమార్ శర్మ 'విరాట్ కోహ్లీ-ద మేకింగ్ ఆఫ్ ఎ చాంపియన్' రాస్తున్నప్పుడు మాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆ తర్వాత రోజు ఏం జరిగిందో చెప్పారు. "ఆ సమయంలో నేను ఆస్ట్రేలియాలో ఉన్నా, విరాట్ ఫోన్ చేశాడు" అన్నారు.
 
"విరాట్ ఫోన్లో ఏడుస్తున్నాడు. తండ్రి చనిపోయాడని, ఇప్పుడు నన్నేం చేయమంటారని అడిగాడు. నువ్వేం చేయాలనుకుంటున్నావ్ అని నేను అడిగాను. కోహ్లీ మ్యాచ్ ఆడాలని అనుకుంటున్నా అన్నాడు. నేను అలాగే చెయ్ అన్నాను. కొన్ని గంటల తర్వాత విరాట్ మళ్లీ ఫోన్ చేశాడు. మళ్లీ ఏడుస్తున్నాడు. అంపైర్ తనను తప్పుడు అవుట్ ఇచ్చాడని చెప్పాడు" అని శర్మ చెప్పారు.
 
"ఢిల్లీ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ పునీత్ బిష్ట్‌తో విరాట్ పెద్ద భాగస్వామ్యం నమోదు చేశాడు. ఢిల్లీని కష్టాల నుంచి బయటపడేశాడు. అది కూడా తన తండ్రి, మెంటర్, గైడ్ చనిపోయిన తర్వాత రోజు".. క్రికెట్ అంటే ఉన్న ఆ ఇష్టమే విరాట్ కోహ్లీకి ప్రపంచ చాంపియన్‌గా మార్చింది.
 
రన్ చేజింగ్‌లో రికార్డులు 
విరాట్ కోహ్లీకి తర్వాత భారత అండర్-19 టీమ్‌ కెప్టెన్సీ లభించింది. ఆ జట్టుతోనే కోహ్లీ అండర్-19 ప్రపంచ కప్ కూడా గెలిచాడు. తర్వాత భారత జట్టులో ఎంట్రీ కోసం అతడు ఎక్కువ రోజులు ఆగలేదు. 2008లో శ్రీలంకతో కోహ్లీ తన తొలి మ్యాచ్ ఆడాడు. మొదటి సిరీస్‌లోనే హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ, అద్భుతమైన తన అంతర్జాతీయ కెరీర్‌కు ఘనంగా నాంది పలికాడు.
 
తర్వాత వన్డేల్లో విరాట్ ఒక్కొక్క రికార్డు సృష్టించడం ప్రారంభించాడు. ప్రత్యేకంగా టార్గెట్‌ను చేజ్ చేయడంలో ఎవరికీ అందని ఘనత సాధించాడు. ప్రత్యర్థి టీమ్ స్కోరును చేజ్ చేస్తూ కోహ్లీ 84 మ్యాచుల్లో 21 సెంచరీలు చేశాడు. 5 వేల పరుగులకు పైనే చేశాడు. విరాట్ సెంచరీల్లో 18 మ్యాచ్ విన్నింగ్ సెంచరీలు. వన్డే క్రికెట్‌లో టార్గెట్‌ను చేజ్ చేస్తూ రికార్డులు సృష్టించిన కోహ్లీ వంటి బ్యాట్స్‌మెన్ బహుశా ఎవరూ లేరనే చెప్పవచ్చు.
 
వన్డేల్లో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 227 మ్యాచ్‌లో 219 ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 1084 పరుగులు చేయగా 59.57 సగటు ఉంది. స్ట్రైక్ రేట్ 92.96 శాతంగా ఉంది. ఇందులో అర్థశతకాలు 49 ఉండగా, 41 సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ ప్రస్తుతం పరుగులు చేస్తున్న వేగాన్ని బట్టి చూస్తే, తను రిటైర్ అయ్యే సమయానికి బ్యాటింగ్‌లో అత్యుత్తమ రికార్డులన్నీ అతడి పేరనే ఉంటాయని క్రీడా పండితులు భావిస్తున్నారు.
 
ముఖ్యంగా విరాట్ కోహ్లీ సెంచరీ చేసే స్టైల్ తిరుగులేనిది. అతడు 49 హాఫ్ సెంచరీలు, 41 సెంచరీలు చేశాడు. వికెట్‌పై నిలబడడం అతడికి ఎంత ఇష్టమో ఈ సంఖ్యే చెబుతుంది. కోహ్లీ దాదాపు ప్రతి రెండో హాఫ్ సెంచరీని సెంచరీగా మలచగలుగుతున్నాడు.
 
ముచ్చటగా మూడో అవకాశం 
అలాంటి విరాట్ కోహ్లీకి ఈ వరల్డ్ కప్ ముచ్చటగా మూడోది. తొలిసారి 2011 ప్రపంచ కప్‌లో ఆడిన కోహ్లీ, 21 ఏళ్లకే వరల్డ్ చాంపియన్ అనిపించుకున్నాడు. ఈ టోర్నీలో కోహ్లీ బంగ్లాదేశ్‌పై సెంచరీ చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి 200 పరుగుల భాగస్వామ్యం అందించాడు. అటు శ్రీలంకతో జరిగిన ఫైనల్లో ధోనీ ఆ హెలికాప్టర్ షాట్, గౌతం గంభీర్ అద్భుత ఇన్నింగ్స్ అందరికీ గుర్తుండే ఉంటుంది. కానీ ఇదే ఇన్నింగ్స్‌లో గంభీర్‌తో, కోహ్లీ అమూల్యమైన 85 పరుగుల భాగస్వామ్యం భారత్ విజయానికి చాలా కీలకమైంది. 
 
అలాగే, 2015 వరల్డ్ కప్‌ ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌లో జరిగింది. ఈ టోర్నీలో పాకిస్తాన్‌తో కోహ్లీ 126 బంతుల్లో 107 రన్స్ చేశాడు. భారత్ ఈ మ్యాచ్‌ను 76 పరుగులతో గెలిచింది. కోహ్లీ ఈ టోర్నీలో ఎన్నో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వాటి సాయంతో భారత్ తన గ్రూప్‌లో టాప్‌లో నిలిచింది. అయితే ఆస్ట్రేలియాపై సెమీఫైనల్లో కోహ్లీ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. భారత్ ఆ మ్యాచ్ చేజార్చుకుంది.
 
కోహ్లీ వెంట బలమైన జట్టు 
కోహ్లీ గత కొన్నేళ్లుగా అద్భుతమైన ఫాంలో ఉన్నాడు. అతడి బ్యాట్‌ నుంచి వరుసగా సెంచరీలు జాలువారుతున్నాయి. కోహ్లీ ఇప్పుడు తన కెరీర్ పీక్స్‌లో ఉన్నాడని క్రీడా నిపుణులు చెబుతున్నారు. భారత జట్టు కూడా పక్కాగా, సమతూకంతో ఉంది. టీమిండియాలో అనుభవజ్ఞులు, యువకుల అద్భుత మిశ్రమం కనిపిస్తోంది. దీనికితోడు జట్టులో మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఉన్నాడు, అతడు బహుశా తన చివరి వరల్డ్ కప్ ఆడబోతున్నాడని భావించవచ్చు. మరి కోహ్లీ టీమ్ ఐసీసీ వరల్డ్ కప్ 2019 గెలవగలదా? అభిమానులు మాత్రం ఈ వరల్డ్ కప్ కోహ్లీది, ఇండియాదే అని గట్టిగా నమ్ముతున్నారు. మున్ముందు ఏం జరుగుతుందో వేచిచూడాల్సిందే.