మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 13 అక్టోబరు 2020 (12:58 IST)

పాకిస్థాన్‌ ప్రభుత్వం కరెన్సీ నోట్లను గుట్టలు గుట్టలుగా ఎందుకు ముద్రిస్తోంది?

గత కొన్నేళ్లుగా పాకిస్థాన్‌లో కరెన్సీ నోట్ల సంఖ్య పెరుగుతోంది. 2020 జూన్‌ 30తో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో గత ఎనిమిదేళ్లలో ఎన్నడూ లేనంతగా కొత్త నోట్లను తీసుకొచ్చారు. ఈ ఆర్ధిక సంవత్సరంలోనే 1.1 ట్రిలియన్ల కొత్త నోట్లు పెరిగాయి. పాకిస్థాన్‌ ఆర్ధిక గమనాన్ని పరిశీలించిన నిపుణులు ఈ నోట్ల వృద్ధి అసాధారణమని, ఆర్ధిక వ్యవస్థ మీద ప్రతికూల ప్రభావం చూపుతుందని అంటున్నారు.

 
ఇక్కడ కొత్త నోట్లు పెరుగుతున్నాయంటే పాత నోట్ల స్థానంలో కొత్త నోట్లు ముద్రించారని అర్ధం కాదు. పాతవి ఉండగానే కొత్తగా కరెన్సీని ప్రింట్‌ చేస్తున్నారు. డిమాండ్‌ను సమతుల్యం చేయడానికి సాధారణంగా కొత్త నోట్లను ముద్రిస్తారని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. ఇది కొంత వరకు నోట్ల సంఖ్యను పెంచవచ్చని, అయితే అది అసాధారణ రీతిలో పెరుగుతోందని ఆర్ధిక నిపుణులు అంటున్నారు.

 
పాకిస్థాన్‌ కరెన్సీ ప్రింట్ కోసం వాడే పేపర్‌ను ‘సెక్యూరిటీ పేపర్స్‌ లిమిటెడ్‌’ అనే సంస్థ తయారు చేస్తుంది. ఈ సంస్థ ఈ ఏడాది మంచి ఆర్ధిక ఫలితాలను ప్రకటించింది. పాకిస్థాన్‌ స్టాక్‌ ఎక్చేంజ్‌లో నమోదైన ఈ కంపెనీ తాజా ఆర్ధిక ఫలితాలలో 60% పైగా వృద్ధిని నమోదు చేసింది. నోట్ల సంఖ్య పెరుగుతున్న కాలాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇ-కామర్స్‌, డిజిటల్‌ కరెన్సీ, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, వీటికి తోడు కరోనా వైరస్‌ విజృంభిస్తున్న సమయంలో నోట్ల సంఖ్య అనూహ్యంగా పెరగడం మొదలైంది.

 
గత ఎనిమిది ఆర్ధిక సంవత్సరాలలో చెలామణిలో ఉన్న కరెన్సీకి సంబంధించిన వివరాలు పాకిస్థాన్‌ సెంట్రల్‌ బ్యాంకు వెబ్‌ సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. దాని ప్రకారం 2012 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 1.73 ట్రిలియన్ల కరెన్సీ చెలామణిలో ఉండగా, మరుసటి సంవత్సరం అది 1.93 ట్రిలియన్లకు పెరిగింది. 2014లో 2.17 ట్రిలియన్లు ఉండగా,ఈ ఆర్ధిక సంవత్సరానికి 6.14 ట్రిలియన్లకు చేరుకున్నట్లు తేలింది. గత ఆర్ధిక సంవత్సరంలో అసాధారణ రీతిలో నోట్లను ప్రింట్ చేశారని ఎ.కె.డి సెక్యూరిటీస్‌ రీసెర్చ్ సెంటర్‌ అధినేత ఫరీద్‌ ఆలం అన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం రెండు రెట్లు అధికంగా నోట్లను ముద్రించిందని ఆయన చెప్పారు.

 
నోట్ల చెలామణి పెరగడం వల్లనేనా?
ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌ (ఐఎంఎఫ్‌)తో ఒప్పందం ప్రకారం పాకిస్థాన్‌ సెంట్రల్ బ్యాంక్‌ నుంచి ప్రభుత్వం అప్పు తీసుకోవడం మానేసిన తర్వాత ఈ నోట్ల ముద్రణలో పెరుగుదల కనిపిస్తోంది. బడ్జెట్‌ లోటును తీర్చడానికి బహిరంగ మార్కెట్ నుంచి వాణిజ్య బ్యాంకుల ద్వారా ప్రభుత్వం డబ్బును సేకరిస్తోంది. ప్రభుత్వాలకు రుణాలు ఇచ్చే ముందు స్టేట్‌ బ్యాంక్ కొత్త కరెన్సీని ముద్రించడం సర్వసాధారణం. కానీ ఇప్పుడు ఐఎంఎఫ్ నిబంధనల కారణంగా స్టేట్ బ్యాంక్ నుండి పాకిస్థాన్‌ ప్రభుత్వం డబ్బు తీసుకునే మార్గం మూసుకుపోయింది. అంటే బ్యాంకుకు నోట్లు ముద్రించే అవసరం లేదు.

 
“చెలామణిలో వృద్ధి ఎక్కువగా ఉండటం వల్లే కొత్తగా నోట్లను ముద్రిస్తున్నారు’’ అన్నారు ప్రముఖ ఆర్ధికవేత్త డాక్టర్‌ కైజర్‌ బెంగాలీ. స్టేట్ బ్యాంక్‌ దగ్గర అప్పు తీసుకోకుండానే దగ్గర కరెన్సీ పెరుగుతోందంటే దీనర్ధం ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ఇదే విషయం అడిగితే సరైన సమాధానం రాలేదని కైజర్‌ బెంగాలీ అన్నారు. పాకిస్థాన్‌లో ఏదీ పారదర్శకంగా జరగడం లేదని ఆయన ఆరోపించారు.

 
గత ఐదారు సంవత్సరాలుగా కరెన్సీ నోట్లలో వృద్ధి కొనసాగుతోందని ఆరిఫ్‌ హబీబ్‌ సెక్యూరిటీస్ సంస్థకు చెందిన ఆర్థిక నిపుణురాలు సనా తౌఫిక్ అన్నారు. ఐదేళ్ల క్రితం ప్రభుత్వం బ్యాంకుల ద్వారా లావాదేవీలపై పన్ను పెంచిన తరుణంలో ఈ అసాధారణ వృద్ధి ధోరణి మొదలైందని ఆమె అన్నారు. ప్రజలు కూడా బ్యాంకుల్లో డబ్బు కాకుండా బంగారాన్ని దాచుకోడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారామె.

 
ఎంఎఫ్‌తో చేసుకున్న ఒప్పందం కారణంగా చేతిలో డబ్బులేని ప్రభుత్వం, ఆదాయం పెంచుకునేందుకు అనేక చర్యలు చేపట్టింది. పన్నులు పెంచడం అందులో ఒకటి. దీంతో ప్రజలు బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున డబ్బును డ్రా చేసుకోవడం ప్రారంభించారు. ఆ కారణంగా నోట్లకు డిమాండ్‌ పెరిగింది. దానితోపాటే ముద్రణ కూడా పెరిగింది. వాణిజ్య బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం కూడా కరెన్సీ ముద్రణకు కొంతవరకు కారణమని ఫరీద్ ఆలం అన్నారు.

 
బడ్జెట్‌ లోటు నుంచి బైటపడటానికి స్టేట్ బ్యాంక్ నుంచి అప్పులు చేయవద్దని ఐఎంఎఫ్‌ షరతు పెట్టింది. కరోనా వైరస్‌ మహమ్మారి సమయంలో ప్రభుత్వం ప్రకటించిన రిలీఫ్‌ ప్యాకేజీ కోసం, ఇతర ఖర్చుల కోసం ఇలా పెద్ద సంఖ్యలో ప్రభుత్వం కరెన్సీని ముద్రించిందని భావిస్తున్నారు.

 
నోట్ల ముద్రణ ద్రవ్యోల్బణాన్ని పెంచుతుందా?
పెద్ద సంఖ్యలో నోట్లను ముద్రిస్తే ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఆర్ధిక నిపుణులు అంటున్నారు. “ఎక్కువ నోట్లను ముద్రించడం అంటే ప్రజల దగ్గరకు డబ్బును ఎక్కువగా చేర్చడం. దానివల్ల వారిలో కొనుగోలు శక్తి పెరుగుతుంది. వాళ్లు డబ్బు ఎంత ఎక్కువ ఖర్చు చేస్తే, అంతగా వస్తువుల ధరలతోపాటు, ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది’’ అన్నారు ఆర్ధిక నిపుణురాలు సనా తౌఫిక్. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి వడ్లీ రేట్లు పెంచుతున్నారని ఆమె అన్నారు. సరఫరా సమస్యల కారణంగా గత రెండేళ్లుగా ద్రవ్యోల్బణం పెరిగిందని డాక్టర్ ఖైసర్ బెంగాలీ అన్నారు. ఏదేమైనా కరెన్సీ భారీ పెరుగుదలతో డిమాండ్‌ పెరిగి ద్రవ్యోల్బణం కూడా పెరిగే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.

 
నోట్ల సంఖ్యనుపెంచితే వచ్చే నష్టాలేంటి?
నోట్ల సంఖ్య పెరిగితే బ్లాక్‌ మార్కెట్‌ పెరుగుతుందని సనా తౌఫిక్ అన్నారు. "పెద్ద సంఖ్యలో నోట్లను ముద్రిస్తున్నారంటే ప్రజలు తమ డబ్బును బ్యాంకులో జమ చేయకుండా నగదు రూపంలో ఆదా చేస్తున్నారని అర్థం. దీనిని నాన్-అఫీషియల్‌ లేదా బ్లాక్ ఎకానమీ అంటారు" అని ఆమె వివరించారు.

 
కరెన్సీ నోట్లు ఎక్కువ కావడం వల్ల స్మగ్లింగ్, మనీలాండరింగ్‌ కూడా పెరుగుతాయని ఆమె చెప్పారు. "ప్రజలు బ్యాంకుల్లో కాకుండా డబ్బును తమ వద్ద ఉంచుకుంటారు. అదే డబ్బు అక్రమంగా మారుతుంది’’ అన్నారామె. అధిక కరెన్సీ నోట్ల ముద్రణ నగదు నిల్వకు కారణమవుతుందని, డబ్బంతా కొందరి దగ్గరే పేరుకు పోతుందని ఆమె హెచ్చరించారు.