మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 4 ఆగస్టు 2020 (22:08 IST)

'చైనా కంపెనీ 'వీవో'ను ఐపీఎల్ స్పాన్సర్‌గా కొనసాగిస్తారా? దేశం కన్నా క్రికెట్ ఎక్కువా?'

జమ్ము-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డును టార్గెట్ చేశారు. చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ వీవోను ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయించడమే దీనికి కారణం. ఒక వైపు దేశంలో చైనా వస్తువులను బహిష్కరిస్తున్నారు, ఆ దేశం కంపెనీని మాత్రం ఐపీఎల్ స్పాన్సర్‌షిప్‌గా కొనసాగిస్తున్నారు అని నేషనల్ కాన్ఫరెన్స్ నేత విమర్శించారు.

 
దీనిపై వరుస ట్వీట్లు చేసిన చేసిన అబ్దుల్లా, “బీసీసీఐ/ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైనా పెద్ద కంపెనీలు సహా స్పాన్సర్లు అందరినీ కొనసాగించాలని నిర్ణయించింది. నాకిప్పుడు తమ చైనా టీవీలను బాల్కనీలోంచి పడేసిన తెలివితక్కువ వారిని తలచుకుంటే బాధగా అనిపిస్తోంది. ఇది చూడడమే మిగిలింది” అన్నారు.

 
“చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా కొనసాగుతోంది. జనాలకు మాత్రం చైనా కంపెనీ ఉత్పత్తులను బహిష్కరించండి అని చెబుతున్నారు. చైనా నుంచి వచ్చే డబ్బు, పెట్టుబడులు, ప్రకటనలు, స్పాన్సర్ షిప్ ఎలా మేనేజ్ చేయాలో తెలీక మనం గందరగోళంలో ఉన్నప్పుడు, చైనాకు మనల్ని వేలెత్తి చూపించే అవకాశం దొరికింది” అని మరో ట్వీట్‌ చేశారు.

 
ఆదివారం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో వీవో స్పాన్సర్‌షిప్‌ను కొనసాగించారు. ఐపీఎల్ 13వ సీజన్ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని దుబాయ్, షార్జా, అబుధాబిలో నిర్వహించనున్నారు. దీనికోసం బోర్డుకు మోదీ ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు కూడా లభించాయి.

 
మరోవైపు కాంగ్రెస్ కూడా మోదీ ప్రభుత్వం ‘స్వయం సమృద్ధ భారత్’ నినాదాన్ని లక్ష్యంగా చేసుకుంది. “ఐపీఎల్‌లో చైనా కంపెనీని స్పాన్సర్‌గా కొనసాగించడం ద్వంద్వ ప్రమాణాలను చూపిస్తోందని” కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా అన్నారు.

 
క్రికెట్ కంటే, దేశం ముఖ్యం
అమిత్ షా తనయుడు బీసీసీఐ సెక్రటరీగా ఉన్నప్పుడు అలా జరగాల్సిందే కదా అని బీజేపీ మాజీ ఎంపీ, దళిత నేత ఉదిత్ రాజ్ అన్నారు. ఒక ట్వీట్ చేసిన ఆయన “లద్దాఖ్‌లో మన 20 మంది సైనికులు అమరులైనప్పుడు, చైనా మొబైల్ వీవో స్పాన్సర్‌షిప్ వదిలేస్తామని చెప్పారు. అలా జరగలేదు. ఆ సంస్థతో దానితో 2200 కోట్ల ఒప్పందం ఉంది. అమిత్ షా తనయుడు బీసీసీఐ సెక్రటరీ. ప్రజలే దద్దమ్మలు” అన్నారు.

 
స్వదేశీ జాగరణ్ మంచ్ జాతీయ నేత అశ్వనీ మహాజన్ కూడా ఐపీఎల్ నిర్ణయాన్ని విమర్శించారు. ప్రపంచమంతా చైనాను బహిష్కరిస్తుంటే, ఐపీఎల్ దానికి ఆశ్రయం ఇస్తోందన్నారు. ఆయన తన ట్వీట్‌లో “ఐపీఎల్ ఒక వ్యాపారం. దానిని నిర్వహించేవారికి, దేశం, దాని భద్రత పట్ల సున్నితత్వం లేదు. ప్రపంచమంతా చైనాను బహిష్కరించింది. ఐపీఎల్ దానికి ఆశ్రయం ఇస్తోంది. క్రికెట్ అయినా సరే, దేశం కంటే ఏదీ ఎక్కువ కాదని వారు తెలుసుకోవాలి. జనం ఐపీఎల్‌ను బహిష్కరిస్తారేమో..” అన్నారు.

 
అయితే కొంతమంది ఐపీఎల్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్లు కూడా కనిపిస్తున్నారు. రిషబ్ రాజ్ అనే యూజర్ ట్విటర్‌లో “బీసీసీఐ ఒక ప్రైవేటు సంస్థ. స్పాన్సర్‌షిప్ విషయంలో ప్రభుత్వం దానిపై ఒత్తిడి తీసుకురాగలదా?” అని ప్రశ్నించారు.