మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 జులై 2020 (11:26 IST)

యాప్‌లపై కేంద్రం నిషేధం.. చైనా కంపెనీలకు నష్టమెంత?

దేశ సమగ్రతకు, భద్రతకు, సార్వభౌమ్యతకు ముప్పు వాటిల్లుతోందన్న కారణంతో 59 చైనా యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించింది. ఈ చర్య చైనాపై భారత్ జరిపిన డిజిటల్ స్టైక్‌గా అభివర్ణిస్తున్నారు. ఈ నిర్ణయంతో చైనా కంపెనీలకు తీవ్రమైన నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
చైనా వార్తా సంస్థ గ్లోబల్‌ టైమ్స్‌ నివేదిక ప్రకారం టిక్‌టాక్, విగో వీడియో, హలో వంటి చైనా యాప్‌లను నిషేధిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల వాటి మాతృ సంస్థ 'బైట్‌డాన్స్'కు ఘోరమైన దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఆ సంస్థ దాదాపు 6 బిలియన్‌ డాలర్ల వరకు నష్టపోయినట్లు గ్లోబల్‌ టైమ్స్ నివేదిక తెలిపింది. 
 
గత కొన్ని సంవత్సరాల్లో, బైట్‌ డాన్స్‌ కంపెనీ దాదాపు 1 బిలియన్ డాలర్లకు పైగా భారత మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిందని గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది. ఇపుడు నిషేధంతో ఈ పెట్టుబడులన్నీ తిరిగి రాబట్టుకోవడం కష్టమని పేర్కొంటున్నారు. 
 
అంతేకాకుండా, మొబైల్ యాప్స్‌ విశ్లేషణ సంస్థ సెన్సార్ టవర్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, టిక్‌టాక్‌ను భారతదేశంలో మే నెలలో 112 మిలియన్ సార్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని గ్లోబల్ టైమ్స్ తన నివేదికలో తెలిపింది. ఇది భారత మార్కెట్లో 20 శాతం అని పేర్కొంది. ఈ సంఖ్య అమెరికాలో డౌన్‌లోడ్‌ చేసుకున్న దాని కంటే  రెట్టింపు అని గ్లోబల్ టైమ్స్ తన నివేదికలో పేర్కొంది.