శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (16:21 IST)

ఉచిత విద్యుత్: వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టిన పథకాన్ని జగన్ తీసేస్తారా? కనెక్షన్లకు మీటర్లు ఎందుకు పెడుతున్నారు?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత విద్యుత్ పథకంలో లబ్ధిదారులకు నగదు బదిలీ ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి అనుగుణంగా జీవో ఎంఎస్ నెం. 22ని ఏపీ ఇంధన శాఖ విడుదల చేసింది. వ్యవసాయం విద్యుత్ నగదు బదిలీ పథకం మార్గదర్శకాలు ప్రకటించింది. ఉచిత విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు ఏర్పాటు చేయాలని ఏపీ క్యాబినెట్ తీర్మానించింది.

 
ఈ విధానాన్ని తొలుత పైలట్ ప్రాజెక్ట్‌గా శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించాలని నిర్ణయించారు. కానీ, ఉచిత విద్యుత్ పథకంలో ఇలాంటి ప్రయత్నాలను ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. లబ్ధిదారులు కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కోసం ఈ సంస్కరణలు తప్పనిసరి అని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. రైతులకు నష్టం జరగకుండా చూస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.

 
వైఎస్ఆర్ హయాంలో మొదలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండు దశాబ్దాల క్రితమే రాజకీయంగా ఉచిత విద్యుత్ పథకం ఓ ప్రధాన అంశంగా మారింది. 1999 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఈ హామీనిచ్చింది. కానీ, ఆపార్టీ అధికారంలోకి రాలేదు.

 
ఆ తర్వాత మళ్లీ వైఎస్సార్ పాదయాత్రలో ఈ హామీ గురించి విస్తృతంగా ప్రచారం చేశారు. దానికి ముందే విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా 2000సం.లో పెద్ద ఉద్యమం నడిచింది. ఆ తర్వాత కూడా కరువు పరిస్థితులతో నీటి ఎద్దడి తీవ్రంగా ఏర్పడడం రైతులు ఇక్కట్ల పాలయ్యారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ హామీ రైతులను ఆకట్టుకుంది. 2004 ఎన్నికల్లో ఆ పార్టీ విజయానికి దోహదం చేసింది.

 
అధికారంలోకి వచ్చిన వెంటనే, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్‌ఆర్ తొలి సంతకం ఉచిత విద్యుత్ పథకం ఫైలు మీదే చేశారు. అప్పటి నుంచి ఏపీలో రైతులకు ఉచిత విద్యుత్ అందుతోంది.

 
ఎవరెవరికి ఇస్తున్నారు..
ప్రస్తుతం ఏపీలో 17.55 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు ఉచితంగా విద్యుత్ సరఫరా జరుగుతోంది. అందులో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 2.89 లక్షల కనెక్షన్లుంటే అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో కేవలం 31,526 కనెక్షన్లు మాత్రమే ఉన్నాయి. రాష్ట్రం మొత్తంగా 12,232 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. దాని కోసం ఏటా రూ. 8,353 కోట్లు వ్యయం చేస్తున్నట్టు ఇంధన శాఖ లెక్కలు చెబుతున్నాయి.

 
ఉచిత వ్యవసాయ విద్యుత్‌తో పాటుగా ఆ తర్వాత ఉచిత గృహ విద్యుత్ పథకం కూడా అమల్లోకి వచ్చింది. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్ల వరకూ ఉచితంగా విద్యుత్ అందిస్తున్నారు. ఇందుకోసం రూ. 220 కోట్లు ప్రభుత్వం తరుఫున వెచ్చిస్తున్నారు.

 
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆక్వారంగానికి విద్యుత్ సబ్సీడీ కోసం రూ. 450 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇక సాధారణ గృహ విద్యుత్ వినియోగదారులకు సబ్సీడీ కింద మరో రూ.1707 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం ప్రభుత్వం భరిస్తోంది. వాటితో పాటుగా చేనేత, స్వర్ణ, రజకులు, క్షురకుల కోసం కూడా సబ్సీడీపై విద్యుత్‌ని అందిస్తున్నారు. మొత్తంగా 2020-21 ఆర్థిక సంవత్సరానికిగానూ విద్యుత్ సబ్సీడీల కోసం రూ.11వేల కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

 
మీటర్లు ఎందుకు పెడుతున్నారు? నగదు బదిలీ ఇప్పుడు ఎందుకు?
ఏపీలో అమలవుతున్న ఉచిత విద్యుత్ పథకంలో నగదు బదిలీ విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం నిర్ణయం కారణంగానే ఈ విధానం తప్పనిసరైందంటూ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఏడాది మే 17న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం నాలుగు రకాల సంస్కరణలు తప్పనిసరిగా మారాయని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.

 
దాని ప్రకారం 2021-22 రాష్ట్రమంతటా ఉచిత విద్యుత్ పథకంలో నగదు బదిలీ అమలు చేయాల్సి ఉంటుందని తెలిపింది. ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్ సహా అందరికీ ఇకపై మీటర్లు ఏర్పాటు చేస్తుంది. వినియోగించిన విద్యుత్ యూనిట్ల ప్రకారం రైతుల ఖాతాలోకి నగదు బదిలీ చేస్తారు. దానిని రైతులు నేరుగా విద్యుత్ సరఫరా కంపెనీలకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఆఖరిలోగా కనీసం ఒక్క జిల్లాలోనైనా దీన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేయాల్సి ఉందని ఏపీ ఇంధనశాఖ చెబుతోంది.

 
అమలు ఎలా చేస్తారంటే..
విద్యుత్ నగదు బదిలీ పథకంపై ఏపీ క్యాబినెట్‌లో చర్చ సందర్భంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుకు అందే విద్యుత్ ఎప్పటికీ ఉచితమేనని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న కనెక్షన్లు తొలగించబోమని చెప్పారు. 

 
‘‘కనెక్షన్‌ ఉన్న రైతు పేరుమీద ప్రత్యేక ఖాతా తెరుస్తాం. ఆ ఖాతాలో ప్రభుత్వం డబ్బులు వేస్తుంది. వాటిని డిస్కమ్‌లకు రైతులు చెల్లించాల్సి ఉంటుంది. ఏర్పాటు చేయబోతున్న మీటర్ల కోసం అయ్యే ఖర్చు కూడా డిస్కంలు, ప్రభుత్వమే భరిస్తాయి. రైతుపై ఒక్కపైసా భారం లేదు. ఉన్నపథకాన్ని మరింత మెరుగుపరుస్తున్నాం. 10వేల మెగావాట్ల సౌర విద్యుత్‌తో పథకాన్ని మరింతగా మెరుగుపరుస్తున్నాం. వచ్చే 30–35ఏళ్లపాటు ఉచిత విద్యుత్‌ పథకానికి ఢోకా లేకుండా చేస్తున్నాం. పగటిపూట 9 గంటల కరెంటు ఇప్పటికే 89శాతం ఫీడర్లలో అమలవుతోంది. రబీ సీజన్‌నుంచి పూర్తిగా అమలులోకి వస్తుంది. ఉచిత విద్యుత్‌పై పేటెంట్‌ వైఎస్‌ఆర్‌దే. అందుకే ఆయన పేరుతో ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నాం. రూ.1700 కోట్లతో ఫీడర్లను అప్‌గ్రేడ్ చేసి నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం’’ అని చెప్పారు.

 
ఉచిత విద్యుత్ లబ్ధిదారులకు నగదు బదిలీ అమలు విషయంపై క్షేత్ర స్థాయి నుంచి గ్రామ, మండల, డివిజన్, జిల్లా, కంపెనీ, ప్రభుత్వ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తారు. ఆర్థిక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఇంధన శాఖ కమిషనర్ కన్వీనర్‌గా రాష్ట్రస్థాయి కమిటీ ఉంటుంది.

 
ప్రస్తుతం కనెక్షన్లు పూర్వపు యజమాన్ల పేర్లుతో ఉంటే వాటిని ప్రస్తుత యజమానుల పేర్లుతో గ్రామ రెవెన్యూ అధికారి వాంగ్మూలం మేరకు మార్పు చేస్తారు. పేరు మార్పు ప్రక్రియను గ్రామ స్థాయిలో వీడియో రికార్డ్ చేస్తారు. వాటని ఏఈ స్థాయిలో ధృవీకరిస్తారు.

 
అనధికార కనెక్షన్లకు కూడా నిర్దేశిత మొత్తం చెల్లిస్తే రెగ్యులర్ చేస్తారు. వీలైన ప్రతి చోటా స్మార్ట్ మీటర్ ఏర్పాటు చేస్తారు. అవి లేని చోట ఇన్ఫ్రారెడ్ సమాచారం ప్రామాణికత గల మీటర్ వినియోగిస్తారు. ప్రతి నెలా మీటర్ రీడింగ్ తీసి బిల్లు ఇస్తారు. ఇంధన శాఖ ఆమోదించిన బిల్లు ప్రకారం ఆర్థిక శాఖ నిధులు కేటాయిస్తుంది.

 
ఇప్పటికే ఉన్న బ్యాంకు అకౌంట్లతో పాటుగా కొత్త ఖాతాలు తెరుస్తారు. పాత అకౌంట్లలో నగదు బదిలీ చేస్తే వివిధ అప్పుల పేరుతో జమ చేసుకునే అవకాశం ఉన్నందున కొత్తగా కేవలం విద్యుత్ నగదు బదిలీ కోసమే అకౌంట్లు తెరవాలని నిర్ణయించారు. వాటిలోనే ఆర్థిక శాఖ నేరుగా రైతుల ఖాతాలకు నగదు బదిలీ చేస్తుంది.

 
కొనసాగిస్తారన్న నమ్మకం లేదు’
ఉచిత విద్యుత్ పథకంలో గత దశాబ్దంన్నరగా లబ్ధిపొందుతున్న తమకు భవిష్యత్‌లో ఈ పథకం కొనసాగుతుందనే ధీమా లేదని కొందరు రైతులు అభిప్రాయపడుతున్నారు. పశ్చిమ గోదావరి చింతలపూడి మండలానికి చెందిన కూచిపూడి రమేష్ అనే రైతు ఈ అంశంపై బీబీసీతో మాట్లాడారు.

 
‘‘మాకు ఉచిత విద్యుత్ వచ్చిన నాటికే మోటార్ ఉంది. ఇన్నాళ్లుగా అది మా వ్యవసాయానికి బాగా ఉపయోగపడింది. కానీ ఇప్పుడు మీటర్లు బిగిస్తే తెల్ల కార్డు లేని రైతులకు కొనసాగిస్తారనే నమ్మకం లేదు. ఇప్పటికే రకరకాల కారణాల పేరుతో బియ్యం కార్డులు తొలగించారు. 5 ఎకరాల పొలం ఉంటే కేవలం ఆరోగ్యశ్రీ కార్డు మాత్రమే ఇస్తున్నారు. ఇకపై మాలో చాలా మంది రైతులకు ఉచిత విద్యుత్ పథకంలో నగదు బదిలీ జరుగుతుందని నమ్మడం లేదు. క్రమంగా సబ్సీడీ పెరిగే కొద్దీ వడబోత తప్పదు. అనేక మంది రైతులకు ఇది భారంగా మారుతుంది. ఇలాంటి ప్రయత్నాలతో ప్రభుత్వం ఇప్పుడు చెబుతున్న మాటలు, ఆచరణలోకి వచ్చే సరికి కనిపించవు. గతంలో అనేక సార్లు ఇలాగే జరిగింది’’ అని ఆయన అన్నారు.

 
నీరుగార్చే ప్రయత్నమే’
తొలుత విద్యుత్ మీటర్లు పెట్టి, ఆ తర్వాత క్రమంగా ఉచిత విద్యుత్‌ని నీరుగార్చే ఆలోచన చేస్తున్నట్టుగా ఉందని ఏపీ రైతు సంఘం రాష్ట్ర నాయకుడు పి.పెద్దిరెడ్డి అంటున్నారు.

 
‘‘వంట గ్యాస్ సబ్సీడీ అని ప్రవేశపెట్టి నగదు బదిలీ పేరుతో ముప్పతిప్పలు పెడుతున్న కేంద్ర ప్రభుత్వం తీరు అందరికీ అనుభవమే. రకరకాల నిబంధనల కారణంగా అనేక మందికి సబ్సీడీ జమ కావడం లేదు. దాంతో బ్యాంకులు, గ్యాస్ కంపెనీల చుట్టూ జనం తిరగాల్సి వస్తోంది. రేపు రైతుల ఉచిత విద్యుత్ తీరు ఇలాగే ఉండదన్న ధీమా లేదు. పంపుసెట్లకే కాకుండా గృహ వినియోగదారులపై కూడా ఒకే స్లాబు పేరుతో యూనిట్ ఏడు రూపాయలు నిర్ణయించి పేద గృహ వినియోగదారులపై భారం మోపడానికి చట్ట సవరణలు చేస్తున్నారు. రైతులకే కాకుండా దళితులకు, గిరిజనులకు 200 యూనిట్ల వరకు ఉన్న రాయితీలు ఎగనామం పెట్టే ఆలోచనలో ఉన్నారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గటం ప్రమాదకరం’’ అని ఆయన బీబీసీతో అన్నారు.

 
ప్రతిపాదన విరమించుకోవాలి’
రైతులకు విద్యుత్ సరఫరా కోసం మీటర్లు బిగించే ఆలోచన విరమించుకోవాలని ఏపీ ప్రతిపక్ష పార్టీ కోరుతోంది. ఈ విషమమై మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి బీబీసీతో మాట్లాడారు.

 
‘‘ఇప్పుడు మీటర్లు బిగించాల్సిన అవసరం ఏంటో జగన్ చెప్పాలి. రైతులకు వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. ఇక రైతులకు మీటర్లు పెట్టి, బిల్లులు చెల్లిస్తామంటే ఎలా నమ్మాలి? అంతగా ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి ఉంటే నేరుగా కంపెనీలకు విద్యుత్ ప్రభుత్వమే చెల్లించాలి. రైతులను మోసం చేయొద్దు. విద్యుత్ సంస్థలను ప్రైవేటు చేతుల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనను రైతులు ఒప్పుకోరు’’ అని ఆయన అన్నారు.

 
ఉచిత విద్యుత్ నగదు బదిలీని ప్రభుత్వం ప్రయోగాత్మకంగా శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభించాలని తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు, రైతు సంఘాలు అభ్యంతరాలు పెడుతున్నాయి. రైతుల్లోనూ అనుమానాలు బలపడుతున్న తరుణంలో ఈ పథకం అమలు రాజకీయంగానూ ప్రభావం చూపించవచ్చు.