ఏపీ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడు స్టీఫెన్ రవీంద్రకు కరోనా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా పేరుగాంచిన హైదరాబాద్ వెస్ట్‌జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర కరోనా వైరస్ సోకింది. స్టీఫెన్ రవీంద్ర సోమవారం కరోనా టెస్టు చేయించుకోగా, పాజిటివ్ అంటూ మంగళవారం నివేదిక వచ్చింది. డాక్టర్ల సూచన మేరకు ఆయన హోం ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు.
స్టీఫెన్ రవీంద్రకు కరోనా పాజిటివ్ అని తెలియడంతో ఆయనను గతం వారం రోజుల్లో కలిసినవారు కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని అధికారులు చెబుతున్నారు. స్టీఫెన్ రవీంద్ర గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా వ్యవహరించారు.
అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటెలిజెన్స్ విభాగాధిపతిగా స్టీఫెన్ రవీంద్రను తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అంతర్రాష్ట్ర బదిలీకి తెలంగాణ ప్రభుత్వం సమ్మతి తెలిపింది. కానీ, కేంద్రం అనుమతి ఇవ్వలేదు. ఇదే అంశంపై కేంద్ర హోంశాఖకు ఏపీ సర్కారు పలు దఫాలుగా లేఖలు రాసినప్పటికీ.. ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదు.