గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Updated : బుధవారం, 5 జూన్ 2019 (18:44 IST)

అనంతపురంలో అంతరిస్తున్న విషపు సాలీడు...

గుత్తి టారంతులా అనే విషపు సాలీడు అనంతపురం జిల్లాలో మాత్రమే కనిపిస్తుంది. హింగుల్ జింకను కూడా కశ్మీర్‌లోనే చూడొచ్చు. అయితే, భారత ఉపఖండానికే ప్రత్యేకమైన ఇలాంటి జీవ జాతుల మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకమైపోయింది. మరో దశాబ్దంలో ఇవి కనుమరుగు కావొచ్చని తాజా అంచనాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే, ఆసియా చిరుతలు, సుమత్రా ఖడ్గ మృగాల్లాగే ఇవి అంతరించిపోయిన జీవ రాశుల జాబితాలో చేరిపోతాయి.
 
ఒకప్పుడు ఆ జంతువులు కూడా ఉపఖండంలో జీవించాయి. 19, 20వ శతాబ్దాల్లో మనుషులు వాటిని వేటాడటం, నివాస ప్రాంతాల కోసం అడవులను కొట్టివేయడం వల్ల అంతరించిపోయాయి. ఆ తర్వాత, భూమిపై మనుషుల ప్రభావం మరింత పెరిగిపోయింది. 2015 నుంచి 2018 మధ్య ప్రపంచవ్యాప్తంగా 1.5 కోట్ల హెక్టార్ల వర్షారణ్యాలు తుడిచిపెట్టుకుపోయాయి. వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ స్థాయి 415 పీపీఎమ్ (పార్ట్స్ పర్ మిలియన్)కు చేరింది. 1.4 కోట్ల సంవత్సరాల్లో ఇదే అత్యధికం అని అంచనాలు చెబుతున్నాయి.
 
జీవ జాతులు అంతరించిపోతున్న వేగం గురించి శాస్త్రవేత్తలు, పర్యావరణ ప్రేమికులు కొన్నేళ్లుగా ఆందోళనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. జీవరాశులు గంపగుత్తగా అంతర్థానమైపోయే ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తూనే ఉన్నారు. చివరగా జీవరాశులన్నీ తుడిచిపెట్టుకుపోయే భారీ ముప్పు 6.6 కోట్ల ఏళ్ల క్రితం ఎదురైంది. అప్పుడు భూమిపై దాదాపు 75 శాతం జీవరాశులు నశించాయి.
 
ఇంటర్‌గవర్నమెంటల్ సైన్స్ పాలసీ ప్లాట్‌ఫామ్ ఆన్ బయోడైవర్సిటీ అండ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్ (ఐపీబీఈఎస్) తాజా నివేదిక సారాంశం కూడా ప్రమాద ఘంటికలనే మోగించింది. పది లక్షలకుపైగా జీవ రాశులు అంతరించిపోయే ప్రక్రియ ఇప్పటికే మొదలై ఉండొచ్చని, వచ్చే దశాబ్దాల్లో వేల సంఖ్యలో జీవ జాతులు నశించిపోవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది.
 
భారత్ కథేంటీ?
జీవ రాశుల అంతర్థానానికి సంబంధించి అత్యధిక ప్రభావం దక్షిణాసియా, ఆగ్నేయాసియాలపైనే ఉంటుందని ఐపీబీఈఎస్ నివేదిక సారాంశం చెబుతోంది. జనాభా అధికంగా ఉన్న కారణంగా అటవీ వనరులపై ఆధారపడటం భారత్‌లో ఎక్కువని అశోకా ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ది ఎన్వైర్మెంట్ (ఏటీఆర్ఈఈ) శాస్త్రవేత్త ఆర్.గణేశన్ అన్నారు. వన్యప్రాణులు, పక్షులు అంతరించిపోతుండటంతో అడవులు పూర్తిగా 'మోడువారిపోవచ్చ'ని ఆయన చెప్పారు.

 
అత్యంత జీవ వైవిధ్యం ఉన్న 18 దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఐపీబీఈఎస్ పూర్తి నివేదిక వెల్లడి కావాల్సి ఉన్నప్పటికీ, భారత ఉపఖండం భవిష్యత్తు ఎలా ఉండబోతుందో నివేదిక సారాంశం వివరించింది. భారత్‌లోని పశ్చిమ కనుమలు, పశ్చిమ తీర ప్రాంతం, ఉత్తరాది నుంచి మొదలుకొని ఈశాన్య రాష్ట్రాల వరకూ విస్తరించి ఉన్న తూర్పు హిమాలయ పర్వత సానువులు, ఇండో-బర్మా ప్రాంతం జీవవైవిధ్యానికి కేంద్రాలుగా ఉన్నాయి. 2014లో హైదరాబాద్‌లో జరిగిన జీవ వైవిధ్య సదస్సుకు భారత్ సమర్పించిన జాతీయ నివేదిక ప్రకారం ప్రపంచంలోని జీవ రాశుల్లో ఏడు నుంచి ఎనిమిది శాతం భారత్‌లోనే ఉన్నాయి.

 
కొత్త కొత్త జీవ రాశులు బయటపడుతుండటం వల్ల ఈ శాతం పెరుగుతోంది. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రపంచంలోని మొక్కల జాతుల్లో 11.4 శాతం భారత్‌లో ఉన్నట్లు పేర్కొంది. భారత్‌లో తాము విశ్లేషించిన 7445 జీవజాతుల్లో 1078 ఎంతో కొంత అంతరించిపోయే ముప్పు ఎదుర్కొంటున్నాయని ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) పేర్కొంది. వీటిలో 60 శాతం మొక్కలు, చేపలే ఉన్నాయి. అయితే, భారత్‌లో 1.43 లక్షల వృక్ష, జంతు జాతులను నిర్వచించగా, ఐయూసీఎన్ కేవలం వీటిలో ఐదు శాతాన్నే విశ్లేషించింది.
 
సమాచారం, పరిశోధనల కొరత
భారత్‌లోని జీవ జాతుల చరిత్ర గురించి సరైన సమాచారం అందుబాటులో లేదు. పరిశోధనలు కూడా ఎక్కువగా జరగలేదు. దీంతో గత కొన్ని శతాబ్దాల్లో ఉపఖండంలో ఎన్ని జీవ రాశులు అంతరించిపోయాయో ఎవరికీ తెలియదు. భారత్‌లో జీవ జాతులు అంతర్థానమైన వేగం గురించి నమ్మదగిన అంచనాలేవీ లేవని వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో సీనియర్ శాస్త్రవేత్త కె.శివకుమార్ అన్నారు.
 
''పెద్ద జంతువులు, కొన్ని ఔషధ మొక్కల గురించి మాత్రమే కొంత సమాచారం ఉంది. మేం 1.5 లక్షలకుపైగా జీవ రాశులపై అధ్యయనం చేశాం. ఆయా జాతుల జనాభా తగ్గినప్పటికీ చాలా వరకు అవి ఇంకా అంతరించిపోకుండా ఉన్నాయి. కొన్ని వలస పక్షులు మాత్రం కనుమరుగయ్యాయి'' అని చెప్పారు.
 
''పుస్తకాల్లో, మరికొన్ని చోట్ల భారత్ జీవ వైవిధ్య చరిత్ర సమాచారం ఉంది. ఇంటర్నెట్‌లో ఈ వివరాలేవీ లేవు. దీన్నంతా సమగ్రంగా ఒక్క చోట చేర్చే చర్యలు కూడా పెద్దగా లేవు. మొక్కలు, జంతువుల పరిస్థితి గురించి జాబితాలు రూపొందించేందుకు జాతీయ స్థాయిలో ప్రయత్నాలు జరగడం లేదు'' అని ఏటీఆర్ఈఈ శాస్త్రవేత్త ఆర్.గణేశన్ అన్నారు. 2008లో భారత్ రూపొందించుకున్న జాతీయ జీవవైవిధ్య కార్యాచరణ ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు పనిచేయాల్సి ఉంది. దాని పురోగతి ఆశించిన స్థాయిలో లేదు.
 
''ఇప్పటికీ దేశంలోని జీవజాతుల్లో సగం మాత్రమే నిర్వచించగలిగాం. ఆ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. గత నాలుగేళ్లలో నిర్వచించిన జీవ జాతుల సంఖ్య కేవలం 20. ఈ భారీ ప్రక్రియను పూర్తి చేసేందుకు జువాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వద్ద నైపుణ్యమున్న సిబ్బంది లేరు'' అని శివకుమార్ వివరించారు.
 
క్షీరదాలకే ప్రాధాన్యం..
గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా వివిధ జీవ జాతులను గుర్తించేందుకు జరుగుతున్న కృషి పెరిగింది. 1993లో 30 సభ్యదేశాలతో మొదలైన జీవ వైవిధ్య సదస్సు దీనికి ఊతమిచ్చింది. ప్రస్తుతం ఇందులో 168 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. తమ దేశాల పరిధిలోని జీవవైవిధ్యం గురించి అవి నివేదికలు వెల్లడిస్తుంటాయి. ఐయూసీఎన్ 1996లో విశ్లేషించిన జీవజాతుల సంఖ్య 16వేలు కాగా, 2019లో ఆ సంఖ్య దాదాపు లక్షకు చేరుకుంది.
 
జీవజాతుల సమాచార సేకరణ పెరిగినప్పటికీ, ఎక్కువగా సకశేరుకాలు (వెన్నెముక గల జీవులు), ముఖ్యంగా క్షీరదాలను కేంద్రంగా చేసుకునే ఇది జరుగుతోంది. సకశేరుక జీవ జాతుల్లో 69 శాతం వరకూ ఐయూసీఎన్ విశ్లేషించింది. ఇది అకశేరుకాల్లో (వెన్నెముక లేని జీవుల్లో) కేవలం 2 శాతం, శిలీంధ్రాల్లో 0.2 శాతంగానే ఉంది.
 
''ఐయూసీఎన్ విశ్లేషణల్లో జంతువులకు, మొక్కలకు సమ ప్రాధాన్యతను ఇచ్చారు. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా క్షీరదాల పరిరక్షణ చర్యలే ఎక్కువగా ఉంటున్నాయి. ఎందుకంటే అవే ప్రధానంగా బయటకు కనిపిస్తుంటాయి'' అని ఐయూసీఎన్ ప్రొగ్రామ్ మేనేజర్ ఫర్ ఇండియా అనూశ్రీ భట్టాచార్జీ చెప్పారు.