గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 31 మార్చి 2021 (11:43 IST)

వైఎస్ జగన్: జిల్లా కేంద్రాల్లో ప్లాట్లు వేసి, అమ్ముతామంటున్న ఏపీ సీఎం, ఈ లేఅవుట్లు ఎలా ఉండబోతున్నాయంటే - ప్రెస్ రివ్యూ

ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లా కేంద్రాల్లో ఉంటున్న మధ్యతరగతి ప్రజలకు సరసమైన ధరలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారని ‘సాక్షి’ దినపత్రిక ఒక వార్త రాసింది. మధ్యతరగతి ప్రజలకు ఇళ్ల స్థలాల కోసం జిల్లా కేంద్రాల్లో కనీసం 100 నుంచి 150 ఎకరాలు సేకరించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు.

 
న్యాయపరంగా చిక్కుల్లేని విధంగా క్లీయర్ టైటిల్‌తో ఇళ్ల స్థలాలు ఇస్తామని, లాభాపేక్ష లేకుండా ప్రభుత్వం సరసమైన ధరలకు ప్లాట్లను అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. వివిధ పథకాలు, కార్యక్రమాల అమలుపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో సమీక్షించారు.

 
ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కేంద్రాల్లో మధ్య తరగతి ప్రజలకు ఇచ్చే ఇళ్ల స్థలాల్లోని లే అవుట్లలో సీసీ రోడ్లు, ఫుట్‌పాత్‌లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, పార్కులు, ఓపెన్‌ ఎయిర్‌ జిమ్, వాకింగ్‌ ట్రాక్స్, ఎలక్ట్రిసిటీ లైన్స్, పచ్చదనం, స్మార్ట్‌ బస్‌స్టాప్‌లు.. తదితర సౌకర్యాలన్నీ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

 
ప్లాట్లకు ఉన్న డిమాండ్‌పై సర్వే చేయాలని, ఆ డిమాండ్‌ను అనుసరించి భూమిని సేకరించాలని సూచించారు. ఎంఐజీ –1లో 150 చదరపు గజాలు, ఎంఐజీ–2లో 200 గజాలు, ఎంఐజీ– 3లో 240 గజాల కింద ప్లాట్లు ఇవ్వనున్నామని, ఒక కుటుంబానికి ఒక ప్లాటు ఇస్తామని చెప్పారు.