గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 సెప్టెంబరు 2024 (14:28 IST)

వినియోగదారులకు శుభవార్త చెప్పిన బీఎస్ఎన్ఎల్ - త్వరలో 5జీ సేవలు ప్రారంభం

bsnl logo
తమ మొబైల్ వినియోగదారులకు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ శుభవార్త చెప్పింది. ప్రస్తుతం కేవలం 4జీ సేవలను మాత్రమే అందిస్తూ వస్తున్న బీఎస్ఎన్ఎల్ త్వరలోనే 5జీ నెట్‌వర్క్ సేవలను అందుబాటులోకి తీసుకునిరానున్నట్టు తెలిపింది. 
 
నిజానికి గత కొన్ని రోజులుగా ఆకర్షణీయమైన కొత్త రీఛార్జ్ ప్లాన్స్ ప్రకటనలు, 4జీ నెట్‌వర్క్ విస్తరణ వార్తలతో గత కొన్ని నెలలుగా ప్రభుత్వరంగ టెలికం ఆపరేటర్ అయిన బీఎస్ఎన్ఎల్ హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా కంపెనీ నుంచి మరో కీలక అప్‌డేట్ వచ్చింది. బీఎస్ఎన్ఎల్ 5జీ సేవల కోసం ఎదురుచూస్తున్న యూజర్లకు కంపెనీ ఈ శుభవార్త చెప్పింది. 
 
2025 సంక్రాంతి నాటికి 5జీ సేవలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు బీఎస్ఎన్ఎల్ ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ ఎల్.శ్రీను తాజాగా వెల్లడించారు. వీలైనంత త్వరగా 5జీ సేవలను ప్రారంభించేందుకు అనువుగా టవర్లు, ఇతర అవసరమైన పరికరాలు సహా దాని అన్ని మౌలిక సదుపాయాలను ఆధునికీకరించడంపై దృష్టి సారించినట్టు పేర్కొన్నారు.
 
ప్రస్తుతం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అందించిన 4జీ సాంకేతికతను బీఎస్ఎన్ఎల్ ఉపయోగిస్తోంది. 4జీ నుంచి 5జీకి అప్‌డేట్ చేసుకునేలా ఈ టెక్నాలజీని రూపొందించారు. దీంతో పెద్దగా అదనపు పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేకుండానే బీఎస్ఎన్ఎల్ 5 లోకి అప్‌డేట్ కానుంది. దీంతో ఇప్పటికే 4జీ సేవలు ప్రారంభించిన ప్రాంతాలలో 5జీని ప్రారంభించేందుకు ప్రక్రియ ప్రారంభం కానుంది.
 
రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వీ (వొడాఫోన్ ఐడియా) వంటి ప్రధాన టెలికం ఆపరేటర్లు ఇటీవల రీఛార్జ్ ప్లాన్ ధరలను గణనీయంగా పెంచాయి. దాదాపు 15 శాతం మేర పెంచడంతో మొబైల్ వినియోగదారులు సరసమైన ఆఫర్ల కోసం బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. దీంతో మార్కెట్లో పరిస్థితులను అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా 4జీ నెట్వర్ర్ పరిధిని విస్తరించడంపై కంపెనీ దృష్టి పెట్టింది. ఇక త్వరలోనే 5జీ సేవలను కూడా అందుబాటులోకి తీసుకురావడంపై కంపెనీ దృష్టిసారించింది.
 
బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు మార్కెట్లో అందుబాటులోకి వస్తే కస్టమర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. డేటా స్పీడ్, కనెక్టివిటీ బాగుంటే పెద్ద సంఖ్యలో కస్టమర్లను ఆకర్షించే ఛాన్స్ ఉంటుంది. ప్రభుత్వరంగ సంస్థ కావడంతో ఆఫర్లు కూడా ఆకర్షణీయంగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.