శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (08:42 IST)

సారీ.. కరోనా కష్టాలున్నా ఏం చేయలేం... వడ్డీ మాఫీ కుదరదు... తేల్చేసిన కేంద్రం

దేశప్రజలంతా కరోనా కష్టాలు ఎదుర్కొంటున్నారనీ అందువల్ల తామేమీ చేయలేమని, ఈ కష్టకాలంలో రుణాలపై వడ్డీలు మాఫీ చేయలేమని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు కేంద్రం తేల్చి చెప్పింది. దీంతో కరోనా కష్టకాలంలో వడ్డీని మాఫీ చేస్తారని ఎంతో ఆశతో ఎదురుచూసిన వారికి కేంద్రం నిర్ణయం నిరాశనే మిగిల్చింది. పైగా, కరోనా కష్టాలతో సంబంధం లేదనీ.. కానీ, బ్యాంకులను మాత్రం మరింతగా బలహీనం చేసే చర్యలను తీసుకోలేమని తేల్చిచెప్పింది. 
 
కరోనా కారణంగా బ్యాంకుల నుంచి తీసుకున్న అన్ని రకాల రుణాలపై కేంద్రం మూడు నెలల పాటు మారటోరియం విధించింది. ఈ మారటోరియం కూడా ఆగస్టు 31వతేదీతో ముగిసింది. అయితే, మారటోరియం సమయంలో వడ్డీని బ్యాంకులు వసూలు చేశాయి. 
 
మారటోరియం పీరియడ్‌లో వాయిదా వేసిన రుణ బకాయిలు, నెలవారీ కిస్తీ (ఈఎంఐ)లపై వడ్డీని మాఫీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఆర్‌ఎస్‌ రెడ్డి, జస్టిస్‌ ఎంఆర్‌ షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారిస్తోంది. 
 
దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన బ్యాంకింగ్‌ రంగాన్ని కుదేలు చేసే ఏ నిర్ణయం కేంద్రం తీసుకోబోదని, ముఖ్యంగా మారటోరియం తీసుకున్న వారి రుణాలపై విధించే వడ్డీని మాఫీ చేసే ఉద్దేశమేదీ తమకు లేదని సొలిసిటర్‌ జనరల్‌ (ఎస్‌జీ) తుషార్‌ మెహతా సర్వోన్నత న్యాయస్థానానికి విన్నవించారు. అయితే, చెల్లింపుల్లో ఎదురవుతున్న ఇబ్బందులను తగ్గించడానికి చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
 
లాక్డౌన్‌ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని దృష్టిలో పెట్టుకొని మారటోరియం ప్రకటించాం కానీ, వీటిపై వడ్డీని ఎత్తివేసే ఉద్దేశం లేదని కోర్టుకు ఈ సందర్భంగా తెలిపారు. కరోనా కారణంగా ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న బ్యాంకులను మరింత బలహీనం చేసే నిర్ణయమేది కేంద్రం తీసుకోబోదని ఆయన స్పష్టంచేశారు. 
 
అయితే మారటోరియం పీరియడ్‌లో వాయిదా వేసిన రుణ బకాయిలు, ఈఎంఐలపై వడ్డీపై చక్రవడ్డీ విధించడంపై ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. సొలిసిటర్ జనరల్ వాదనలు ఆలకించిన సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదావేసింది.