రూ.2 వేల నోటు ముద్రణ నిలిపివేత : మంత్రి అనురాగ్ ఠాగూర్
దేశంలో అతిపెద్ద కరెన్సీగా ఉన్న రెండు వేల రూపాయల నోటు ముద్రణను నిలిపివేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాగూర్ వెల్లడించారు. గత 2019 నుంచి ఈ నోట్లను ముద్రించడం లేదని చెప్పారు.
దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ పగ్గాలు చేపట్టిన తర్వాత అవినీతి నిర్మూనలో భాగంగా పెద్ద నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త నోట్లను తీసుకువచ్చింది. మునుపెన్నడూ లేనివిధంగా రూ.2000 నోట్లను ప్రవేశపెట్టింది.
అయితే కొద్దికాలానికే వీటి లభ్యత తగ్గిపోయింది. తాజాగా ఈ అంశంపై కేంద్రం వివరణ ఇచ్చింది. 2019 ఏప్రిల్ నుంచి రెండు వేల రూపాయల నోట్లను ముద్రించడంలేదని ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
ఈ నోట్లను పెద్ద ఎత్తున దాచుకోవడంతో పాటు, నల్లడబ్బు రూపేణా విపణిలో చలామణీ చేసే అవకాశం ఉందని... అందుకే ఈ నోట్ల ముద్రణను రెండేళ్లుగా నిలిపివేసినట్టు వివరించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో చర్చించిన మీదటే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
కాగా, 2018 మార్చి 30 నాటికి దేశంలో 3,362 మిలియన్ల రూ.2000 నోట్లు చలామణీలో ఉండగా... 2021 ఫిబ్రవరి నాటికి కేవలం 2,499 మిలియన్ల రూ.2000 నోట్లు చలామణీలో ఉన్నట్టు గుర్తించామని మంత్రి అనురాగ్ ఠాగూర్ లోక్‌సభలో ఓ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.