ఈపీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ : ఒకేసారి మొత్తం 8.5 శాతం చెల్లింపు!
ఈపీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ చేసే ప్రక్రియను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) ప్రారంభించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను ఆరు కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాదారులకు ఒకేసారి 8.5 శాతం వడ్డీని చెల్లించామని ఈపీఎఫ్‌వో వర్గాలు వెల్లడించాయి. కేంద్ర కార్మిక శాఖ ఆదేశాల మేరకు ఈ మొత్తాన్ని జమ చేసినట్టు పేర్కొన్నాయి. ఇదే విషయాన్ని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ కూడా తెలిపారు.
డిసెంబర్ 31న పదవీ విరమణ చేయబోయే ఉద్యోగుల అకౌంట్లలో కూడా 8.5 శాతం (2019-20 ఏడాదికి గాను) వడ్డీని ఖచ్చితంగా జమ చేయాలని ఈపీఎఫ్‌వోను ఆదేశించినట్టు చెప్పారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ ఖాతాదారులకు వడ్డీ రేటును 8.5 శాతంగా ఈపీఎఫ్‌వో గత మార్చిలో నిర్ణయించింది.
అయితే కరోనా కారణంగా ఈ వడ్డీ రేటును విభజించి రెండు విడుతలుగా జమ చేస్తామని సెప్టెంబర్‌లో ప్రకటించింది. మొదటి విడుతలో 8.15 శాతం వడ్డీ (రుణ ఆదాయం), రెండో విడుతలో 0.35 శాతం వడ్డీ (మూలధన రాబడి) జమ చేయనున్నట్టు తెలిపింది. అయితే 8.5 శాతం వడ్డీని ఒకేసారి ఖాతాదారుల అకౌంట్లలో వేయాల్సిందిగా కార్మిక శాఖ ఈపీఎఫ్‌వోను ఆదేశించింది.