బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 ఏప్రియల్ 2020 (12:55 IST)

ఈపీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త... 3 నెలలు మేమే చెల్లిస్తాం!

దేశంలోని ఈపీఎఫ్ ఖాతాదారులకు చెప్పినట్టు పీఎఫ్ ఖాతాదారులకు కూడా కేంద్రం శుభవార్తను చెప్పింది. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యల్లోభాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. దీంతో అత్యవసర సేవలు మినహా దేశం మొత్తం బంద్ అయింది. ఈ లాక్‌డౌన్ సమయంలో ఇబ్బందిపడకుండా ఉండేందుకు వీలుగా పీఎఫ్ ఖాతా సొమ్ములో 40 శాత మేరకు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటును ఇప్పటికే కల్పించింది. ఇపుడు తాజాగా మరో శుభవార్త చెప్పింది. పీఎఫ్‌ మొత్తం చెల్లింపునకు సంబంధించి కేంద్రం కార్మిక శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 
 
ఆయా పరిశ్రమలు, సంస్థల్లో పనిచేస్తూ పీఎఫ్‌ ఖాతాదారులుగా కొనసాగుతున్న వారి మూడు నెలల పీఎఫ్‌ మొత్తాన్ని కేంద్రం జమ చేస్తుందని, ఇందుకోసం ఎలక్ట్రానిక్‌ చలానా కమ్‌ రిటర్న్‌ (ఈసీఆర్‌) సమర్పించి డబ్బులు క్లెయిమ్‌ చేసుకోవాలని కార్మిక శాఖను ఆదేశించింది. 
 
లాక్‌డౌన్‌ కారణంగా పరిశ్రమలు మూసివేత, కార్మికులకు వేతనాల కోత, ఉద్యోగాల నుంచి తొలగించడం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని మూడు నెలల పీఎఫ్‌ మొత్తాన్ని చెల్లించేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. 
 
దీనివల్ల 79 లక్షల మంది ఖాతాదారులకు, 3.8 లక్షల చిన్న, సూక్ష్మ, పెద్ద సంస్థలకు ప్రయోజనం కలుగుతుంది. ఇందుకోసం కేంద్రంపై దాదాపు 4,800 కోట్ల రూపాయల భారం పడనుంది.