శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 ఏప్రియల్ 2020 (10:34 IST)

లాక్‌డౌన్ పొడగింపు ఉందా? లేదా? రాత్రికి స్పష్టతనివ్వనున్న ప్రధాని మోడీ

కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేస్తోంది. అలాగే, ఆయా రాష్ట్రాలు కూడా సంపూర్ణ మద్దతునిచ్చి, ఈ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. అయితే, దీని గడువు ఈ నెల 14వ తేదీతో ముగియనుంది. కానీ, దేశంలో మాత్రం కొత్తగా నమోదయ్యే కరోనా కేసులు ఏమాత్రం తగ్గలేదు. దీంతో లాక్‌డౌన్‌ను నెలాఖరు వరకు పొడగించాలని పెక్కు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. 
 
ఈ నేపథ్యంలో దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా లాక్‌డౌన్ పొడిగింపుపై పలు రకాలైన ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. పలు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదవుతున్నాయి. అదేసమయంలో కేంద్రంతో సంబంధం లేకుండా మహారాష్ట్ర, పంజాబ్, ఒడిశా, తెలంగాణ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు ఈ నెల 30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించాయి. 
 
ఈ నేపథ్యంలో సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. లాక్‌డౌన్ పొడిగింపుపై వెలువడుతున్న ఊహాగానాలకు మోడీ చెక్ పెడతారని చెబుతున్నారు. ఒకవేల పొడగిస్తే వలస కూలీలు, పేదలను ఆదుకునేందుకు కేంద్రం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 
ఇదిలావుంటే, కరోనాను కట్టడి చేసేందుకు దేశాన్ని రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించాలన్న యోచన ఉన్నట్టు తెలుస్తోంది. ఈ జోన్ల విధానాన్ని బుధవారం నుంచే అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించినట్టు సమాచారం. ఆయా ప్రాంతాల్లో నమోదైన కేసుల ఆధారంగా వాటికి జోన్లు కేటాయించాని ప్రభుత్వం నిర్ణయించిందని చెబుతున్నారు.