సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 నవంబరు 2024 (09:52 IST)

పండగ వేళ సామాన్యులకు షాకిచ్చిన ఆయిల్ కంపెనీలు... ఎల్పీజీ గ్యాస్ ధరపై...

gas cylinder
పండగ వేళ సామాన్యులకు చమురు కంపెనీలు షాకిచ్చాయి. నవంబరు ఒకటో తేదీ తెల్లవారుజాము నుంచే చమురు కంపెనీలు 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరలను పంచేశాయి. అయితే, గృహ అవసరాల కోసం వినియోగించే గ్యాస్ సిలిండర్‌ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. అలాగే, విమానాలకు వాడే ఇంధనం ఏటీఎఫ్‌ ధరలను కూడా పెంచేశాయి. తాజాగా పెంచిన ధర కారణంగా దేశంలోని ప్రధాన నగరాల్లోని చమురు ధరల వివరాలను పరిశీలిస్తే,
 
తాజాగా విడుదల చేసిన ధరల ప్రకారం 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర ఇపుడు ఢిల్లీలో రూ.62 పెరిగి రూ.1802కు చేరుకుంది. అలాగే, హైదరాబాద్ నగరంలో రూ.2028, విజయవాడలో రూ.1962, కోల్‌కతాలో రూ.1911.50, ముంబైలో రూ.1754.50, చెన్నైలో రూ.1964.50కు చేరుకుంది. అయితే, గృహ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం ఈ గ్యాస్ సిలిండర్ ధరలు దేశంలోని ప్రధాన నగరాలైన చెన్నైలో రూ.818.50, ఢిల్లీలో రూ.803, కోల్‌కతాలో రూ.829, ముంబైలో రూ.802.50, హైదరాబాద్‌లో రూ.855, విజయవాడలో రూ.827.50గా ఉంది. 
 
అలాగే, విమాన ప్రయాణికులకు కూడా చమురు కంపెనీలు షాకిచ్చాయి. జెట్ ఇంధన ధరలను పెంచాయి. దీంతో రానున్న రోజుల్లో విమాన టిక్కెట్ ధరలు పెరిగే అవకాశం ఉంది. నవంబరు మొదటి తేదీ నుంచి చమురు కంపెనీలు జెట్ ఇంధన (ఏటీఎఫ్) ధరలను కిలోకు రూ.3 వేలు చొప్పున పెంచిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ప్రధాన మెట్రో నగరాల్లో ఈ ధరలు ఢిల్లీలో రూ.90,538.72, ముంబైలో రూ.84,642.91, కోల్‌కతాలో రూ.93,392.91, చెన్నైలో రూ.93,957.10 చొప్పున ఉన్నాయి.