అత్యంత ధనవంతుడు స్థానం కోల్పోయిన ముఖేష్...

mukesh ambani
ఠాగూర్| Last Updated: గురువారం, 12 మార్చి 2020 (15:44 IST)
ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ఎవరయ్యా అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు ముఖేష్ అంబానీ. రిలయన్స్ అధినేతగా ఉన్న ముఖేష్... మన దేశంలోనేకాదు ఆసియాలోనే అపరకుబేరుడు. అయితే, ఆ స్థానం ఇపుడు లేదు. ఆ స్థానాన్ని అలీబాబా ఫౌండర్‌ జాక్‌ మా సొంతం చేసుకున్నారు.

కరోనావైరస్ వ్యాప్తి ప్రపంచాన్ని మాంద్యంలోకి నెట్టివేస్తుందనే భయంతో గ్లోబల్ స్టాక్స్‌తో పాటు చమురు ధరలు కుప్పకూలిన తర్వాత ఆసియా అత్యంత ధనవంతుడుగా జాక్ మా అవతరించాడు. ఈ క్రమంలోనే ఆసియాలో అత్యంత సంపన్నుడి స్థానాన్ని భారత పారిశ్రామికవేత్త ముఖేష్‌ అంబానీ కోల్పోయారు.

క్రూడ్ అయిల్ ధరల పతనంతో పాటు.. కరోనా వైరస్ భయంతో ప్రపంచ మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి. వీటి ప్రభావం భారత్ మార్కెట్‌పై తీవ్రప్రభావం పడుతుంది. దీంతో ఒక్క రోజులోనే ముఖేష్ రూ.44,000 కోట్లు పోగొట్టుకోగా.. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధర ఏకంగా 14 శాతం కుప్పకూలింది.

రిలయన్స్ షేరు ధర రూ.1,095 స్థాయికి పడిపోయింది. గత 11 ఏళ్లలో చూస్తే.. షేరు ధర ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. దీంతో అంబానీ నికర సంపద ఏకంగా 580 కోట్ల డాలర్లు తుడిచిపెట్టుకుపోగా.. ఆసియాలోనే అత్యంత సంపన్నుడి స్థానాన్ని అలీబాబా గ్రూప్‌ అధినేత జాక్‌మా ఆక్రమించారు. ముఖేష్‌ అంబానీ కంటే 260 కోట్ల డాలర్ల అధిక సంపద (4450 కోట్ల డాలర్లు)తో జాక్‌మా ఆసియా సంపన్నుల్లో నెంబర్‌వన్‌గా నిలిచారు.దీనిపై మరింత చదవండి :