మౌత్ వాష్‌లను ఆర్డర్ చేస్తే.. రెడ్‌మీ నోట్ 10 స్మార్ట్ ఫోన్ వచ్చిందోచ్!
ఈ-కామర్స్ వెబ్‌సైట్ల నుంచి మనం ఆర్డర్ చేసే వస్తువులే మనకు డెలివరీ అవుతుంటాయి. కానీ కొన్ని సార్లు జరిగే పొరపాట్ల వల్ల మనం ఆర్డర్ చేసే వస్తువులు కాకుండా వేరే వస్తువులు వస్తుంటాయి.
తాజాగా ముంబైకి చెందిన లోకేష్ దాగా అనే వ్యక్తి మే 10వ తేదీన అమేజాన్‌లో 4 కోల్గేట్ మౌత్ వాష్‌లను ఆర్డర్ చేశాడు. వాటి ధర రూ.396. అయితే అతనికి మౌత్ వాష్‌లకు బదులుగా రెడ్‌మీ నోట్ 10 స్మార్ట్ ఫోన్ వచ్చింది. అతను బాక్స్‌ను ఓపెన్ చేసి చూసి షాకయ్యాడు.
తాను మౌత్ వాష్‌లను ఆర్డర్ చేస్తే ఫోన్ వచ్చిందేమిటబ్బా అని కంగారు పడ్డాడు. వెంటనే తేరుకుని ఇన్‌వాయిస్ చూడగా వేరే వాళ్లకు వెళ్లాల్సిన ఇన్‌వాయిస్ ఉంది. కానీ అడ్రస్ మాత్రం అతనిదే ఉంది.
అయితే ఈ విషయాన్ని అతను ట్విట్టర్ ద్వారా అమెజాన్‌కు తెలిపాడు. తాను మౌత్ వాష్‌లను ఆర్డర్ చేస్తే రెడ్‌మీ నోట్ 10 ఫోన్ వచ్చిందని, మౌత్ వాష్‌లు కన్‌జ్యూమబుల్స్ కనుక వాటిని రిటర్న్ పంపేందుకు ఆప్షన్ లేదని, కనుక అమేజాన్ స్పందించి ఆ ఫోన్ ఎవరికైతే చేరాలో వాళ్లకి దాన్ని చేర్చాలని చెప్పాడు.
అయితే అమేజాన్ ఇంకా స్పందించలేదు. కానీ నెటిజన్లు మాత్రం చాలా ఫన్నీగా స్పందిస్తున్నారు. చీఫ్ ధరకు ఫోన్ వచ్చింది కదా, దగ్గర పెట్టుకో అని అంటున్నారు. ఇక ఆ ఫోన్ ఖరీదు దాదాపుగా రూ.13వేల వరకు ఉంది.