శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 18 అక్టోబరు 2020 (18:36 IST)

ముంబైలో పరుగులు తీయనున్న మెట్రో రైళ్లు

కరోనా లాక్డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని రకాల రైల్ సర్వీసులు ఆగిపోయాయి. అయితే, లాక్డౌన్ సమయంలో వలస కార్మికుల కోసం రైల్వే శాఖ శ్రామిక్ రైళ్లను నడిపింది. ఆ తర్వాత ప్రత్యేక రైళ్ళను నడుపుతోంది. ఈ క్రమంలో దసరా స్పెషల్స్ పేరుతో 392 రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. 
 
ఈ సర్వీసులు ఈ నెల 20వ తేదీ నుంచి పట్టాలపైకి రానున్నాయి. ఈ క్రమంలో ముంబై మహానగరంలో కూడా సోమవారం (అక్టోబరు 19) నుంచి మెట్రో రైళ్లు పరుగులు తీయనున్నాయి. క‌రోనా మ‌హమ్మారి కార‌ణంగా గ‌త మార్చిలో నిలిచిపోయిన మెట్రో స‌ర్వీసులు దాదాపు ఏడు నెల‌ల విరామం త‌ర్వాత తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. 
 
ఆ మేర‌కు ముంబై మెట్రో రైల్ కార్పోరేష‌న్‌ ఏర్పాట్లు చేస్తున్న‌ది. అన్‌లాక్‌-5 మార్గదర్శకాలకు అనుగుణంగా మెట్రో స‌ర్వీసుల‌ను ప్రారంభిస్తున్నారు. మెట్రో రైల్ స్టేష‌న్‌ల‌లో, మెట్రో రైళ్ల‌లో కొవిడ్ నిబంధ‌న‌ల‌ను క‌చ్చితంగా అమ‌లు చేయ‌నున్న‌ట్లు అక్క‌డి మెట్రోరైల్ కార్పొరేష‌న్ తెలిపింది. 
 
స్టేష‌న్‌లోకి వ‌చ్చే ప్ర‌తి ప్ర‌యాణికి థ‌ర్మ‌ల్ స్క్రీనింగ్ నిర్వ‌హిస్తామ‌ని, ముఖానికి మాస్కు ధ‌రించిన వారినే స్టేష‌న్‌లోకి అనుమ‌తిస్తామ‌ని వెల్ల‌డించింది. అలాగే, ముంబై మోనో రైల్ సర్వీసులు కూడా తిరిగి ప్రారంభంకానున్నాయి. అయితే, ఈ రైళ్ళలో ప్రయాణం చేయాలంటే కోవిడ్ నిబంధనలు తు.చ తప్పకుండా పాటించాల్సివుంటుంది.