1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 27 మార్చి 2015 (15:45 IST)

సహజ వాయు ధరను తగ్గించిన కేంద్రం!

దేశీయంగా ఉత్పత్తి అయ్యే సహజ వాయు ధరను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఈ తగ్గింపు పది శాతంగా ఉందని, తగ్గింపు ధరలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ప్రస్తుతం దేశీయంగా ఉత్పత్తి అయ్యే సహజ వాయు గ్యాస్ ధర ఒక ఎంఎంబీటీయు ధర 5.61 డాలర్లుగా ఉండగా, దీన్ని 5.02 డాలర్లకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. 
 
కాగా, ఈ తాజా తగ్గింపు నిర్ణయం ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ‌తో పాటు, ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆదాయంపై ప్రభావం చూపనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2014 జూన్ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో ధరలు పతనమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
 
2014 ఫిబ్రవరిలో 6 డాలర్ల వద్ద ఉన్న ఎంఎంబీటీయూ గ్యాస్ ధర అక్టోబరు నాటికి 3.78 డాలర్లకు తగ్గింది. కేంద్రం ముందు తీసుకున్న నిర్ణయం ప్రకారం దేశంలో ఉత్పత్తి అయ్యే గ్యాస్ ధరను ప్రతి 6 నెలలకు ఒకసారి సవరించాల్సి ఉంది. గత సంవత్సరం నవంబరు నెలలో ఎంఎంబీటీయూకు 4.2 డాలర్ల నుంచి 5.61 డాలర్లకు పెంచిన సంగతి తెలిసిందే.