మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 27 అక్టోబరు 2020 (21:31 IST)

ఈ యేడాది దేశ జీడీపీ సున్నా : విత్తమంత్రి నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్, కరోనా లాక్డౌన్ కారణంగా దేశ స్థూల జాతీయోత్పత్తి సున్నాగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు ఆమె చెప్పుకొచ్చారు. అదేసమయంలో ఆర్థిక వ్యవస్థలో పునరుజ్జీవనం కనిపించే సంకేతాలు కనిపిస్తున్నాయని  చెప్పుకొచ్చారు. 
 
మంగళవారం జరిగిన సెరావీక్ 4 వ వార్షిక ఇండియా ఎనర్జీ ఫోరంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్-జూన్) మొదటి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థలో 23.9 శాతం భారీ సంకోచం ఉండటమే దీనికి ప్రధాన కారణమన్నారు. మహమ్మారి కారణంగా పూర్తి లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత అన్ని రంగాలు కోలుకుంటున్నాయని గుర్తుచేశారు. 
 
ప్రాథమిక రంగంలో రికవరీ సిగ్నల్స్ కనిపించాయన్నారు. గ్రామీణ రంగం బాగా పనిచేస్తున్నదని, ఆటో అమ్మకాలు మంచి వృద్ధిని సాధించాయన్నారు. భారతదేశంలో పండగ సీజన్ మొదలైనందున డిమాండ్ పెరుగుతుందని చెప్పుకొచ్చారు. మూడు, నాలుగో త్రైమాసికంలో మరింత సానుకూల వృద్ధి సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రవాహం 2019 ఏప్రిల్-ఆగస్టుతో పోల్చితే 2020 ఏప్రిల్-ఆగస్టులో కొవిడ్‌-19 ఉన్నప్పటికీ 13 శాతం వృద్ధిని సాధించిందని ఆమె గుర్తు చేశారు.