శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 అక్టోబరు 2019 (21:23 IST)

ఏ క్షణమైనా రూ.2 వేల నోటు రద్దు? ముద్రణ నిలిపివేసిన ఆర్బీఐ!!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాల్లో నోట్ల రద్దు ఒకటి. 2016 నవంబరు 8వ తేదీన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎంతోకాలంగా చలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేశారు. ఆ తర్వాత కొత్త రూ.500 నోటుతో పాటు రూ.2000 నోటును ప్రవేశపెట్టారు. అయితే, గత కొన్నిరోజులుగా రూ.2 వేల నోట్ల ముద్రణను నిలిపివేశారు. వీటి వాడకం కూడా గణనీయంగా తగ్గింది. 
 
ఈ పరిస్థితుల్లో త్వరలోనే రూ.2 వేల నోటును రద్దు చేసే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో ఏటీఎంకు వెళ్లి రూ.2,000లకు మించి డబ్బు డ్రా చేస్తే ఈ పెద్ద నోటు తప్పక వచ్చేది. కానీ, గత కొద్దిరోజులుగా ఈ నోటు అంతగా కనిపించడం లేదు. కారణం, ఆర్‌బీఐ రూ.2,000 నోట్ల ముద్రను నిలిపివేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఒక్క నోటు కూడా ముద్రించలేదు. సమాచార హక్కు చట్టం కింద ఓ వార్తా ప్రసార సంస్థ అడిగిన ప్రశ్నకు ఆర్‌బీఐ ఈ వివరాలు వెల్లడించింది. 
 
దీంతో రూ.2,000 నోట్లు రద్దు కానున్నాయా? అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. నోట్ల రద్దు అనంతరం 2016-17 ఆర్థిక సంవత్సరంలో 3,542 మిలియన్ల నోట్లు ముద్రించగా, 2017-18 ఆర్థిక సంవత్సరంలో 111 మిలియన్ నోట్లు ముద్రించారు. ఇక 2018-19 ఆర్థిక సంవత్సరంలో కేవలం 46 మిలయన్లకు ఈ ముద్రనను కుదించారు. 
 
ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క రూ.2,000 నోటు కూడా ముద్రించలేదు. అధిక విలువ కలిగిన నోట్ల చలామణిని తగ్గించడం ద్వారా నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయవచ్చని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. మరి రూ.2,000 నోట్లు రద్దు అవుతాయి? కొనసాగుతాయా? అనే దానికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి.