మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 30 సెప్టెంబరు 2020 (13:32 IST)

డెబిట్ - క్రెడిట్ కార్డులకు కొత్త నిబంధనలు.. అవేంటో తెలుసా?

ప్రస్తుతం చెలామణిలో ఉన్న డెబిట్, క్రెడిట్ కార్డులకు కొత్త నిబంధనలు వచ్చాయి. ఇవి అక్టోబరు ఒకటో తేదీ నుంచి అమల్లోకిరానున్నాయి. సైబర్ నేరగాళ్ళకు చిక్కకుండా ఉండేందుకు, బ్యాంకు మోసాలకు అవకాశం లేకుండా ఉండేందుకు వీలుగా ఈ నిబంధనలు రూపొందించగా, అవి అక్టోబరు ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. 
 
కాగా, కొత్తగా అమల్లోకి రానున్న నిబంధనలు పరిశీలిస్తే, ఇకపై క్రెడిట్ కార్డులను ఇంటర్నేషనల్, ఆన్‌లైన్ లావాదేవీలకు, కాంటాక్ట్ లెస్ కార్డ్ లావాదేవీలకు వాడాలంటే, ముందస్తు అనుమతి తప్పనిసరి. బ్యాంకులు జారీ చేసే క్రెడిట్, డెబిట్ కార్డులు ఏటీఎంలలోనూ, పాయింట్ ఆఫ్ సేల్స్ (పీఓఎస్) వద్ద మాత్రమే పనిచేస్తాయి. 
 
రిస్క్ తీసుకునే కస్టమర్లకు వారి నుంచి అనుమతి తీసుకున్న తర్వాతనే ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్‌కు ఖాతాను జత చేస్తారు. అయితే, ఈ నిబంధన ప్రీ పెయిడ్, గిఫ్ట్ కార్డులకు మాత్రం వర్తించదు.
 
ఇక కస్టమర్లు తమ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల వాడకంపై ముందుగానే పరిమితులను పెట్టుకోవచ్చు. ఈ పరిమితి దాటి కార్డు ద్వారా లావాదేవీకి ప్రయత్నిస్తే, వెంటనే ఎస్ఎంఎస్ ద్వారా మొబైల్ ఫోన్‌కు సమాచారం అందుతుంది. 
 
కస్టమర్లు తమ కార్డులను ఏటీఎం, ఎన్ఎఫ్సీ, పీఓఎస్, ఈ-కామర్స్ లావాదేవీలకు వాడకుండా తాత్కాలికంగానూ నిషేధించుకోవచ్చు. తక్షణమే అన్ని బ్యాంకులు, కార్డులను జారీ చేసే కంపెనీలు డెబిట్, క్రెడిట్ కార్డుల ఆన్‌లైన్ చెల్లింపు సేవలను తీసివేయాలని, కార్డుదారుడు కోరుకుంటేనే ఆ సౌకర్యాన్ని కల్పించాలని ఆర్బీఐ నుంచి ఆదేశాలు వెళ్లాయి. 
 
తమ కార్డులను విదేశాల్లో వాడుకోవాలనుకున్నా బ్యాంకు నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి. ఇక ఈ కొత్త నిబంధనలతో బ్యాంకుల మోసాలు తగ్గుతాయని బ్యాంకింగ్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. 
 
కొత్త కార్డులు జారీ అయితే, వాటి ద్వారా ఎలాంటి సేవలను పొందాలని భావిస్తున్నారో బ్యాంకుకు తెలిపి అనుమతి తీసుకోవాల్సి వుంటుంది. ప్రస్తుతం రోజులో రూ.2 వేల వరకూ పిన్ ను ఎంటర్ చేయకుండానే కాంటాక్ట్ లెస్ లావాదేవీలను కూడా ఖాతాదారులు నియంత్రించుకోవచ్చు.