గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 డిశెంబరు 2020 (11:10 IST)

నిరంతరాయంగా నగదు బట్వాడా .. 24 గంటలూ అందుబాటులో ఆర్టీజీఎస్

ఇటీవలికాలంలో ఆన్‌లైన్ నగదు బదిలీలు పెరిగిపోయాయి. ఇందుకోసం భారత రిజర్వు బ్యాంకు రెండు రకాల విధానాలను అమల్లోకి తెచ్చింది. వీటిలో ఒకటి నెఫ్ట్ కాగా, మరొకటి ఆర్టీజీఎస్. ఈ సేవలు ఇపుడు నిరంతరాయంగా అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రపంచంలో నిరంతర ఆర్‌టీజీఎస్‌ సేవలందిస్తున్న కంపెనీల్లో భారత్‌ ఒకటిగా మారింది. 
 
ఇదే అంశంపై భారత రిజర్వు బ్యాంకు ఓ ప్రకటన చేసింది. "ఆర్‌టీజీఎస్‌ సౌకర్యం ఇక నిరంతరాయంగా అందుబాటులోకి వచ్చింది. దీన్ని ఆచరణీయం చేసిన ఆర్‌బీఐ, ఐఎఫ్‌టీఏఎస్‌ సిబ్బందికి, సర్వీస్‌ భాగస్వాములకు శుభాకాంక్షలు" అని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఈ సందర్భంగా ఒక ట్వీట్‌ చేశారు. ఇక యేడాది పొడవునా నిరంతర ఆర్‌టీజీఎస్‌ సేవలు అందుబాటులోకి తెస్తామని అక్టోబరులో ఆర్‌బీఐ ప్రకటించింది.
 
కాగా, చిన్న లావాదేవీల కోసం ప్రస్తుతం దేశంలో నెఫ్ట్‌ అందుబాటులో వుంది. ఈ సేవలు అందుబాటులోకి వచ్చిన ఒక యేడాదిలోపే ఆర్‌టీజీఎస్‌ కూడా అందుబాటులోకి వచ్చింది. 2004 మార్చి 26వ తేదీన తొలిసారిగా ఆర్‌టీజీఎస్‌ విధానం ప్రారంభమైంది. 
 
ప్రస్తుతం 237 భాగస్వామ్య బ్యాంకుల ద్వారా రోజుకి రూ.4.17 లక్షల కోట్ల విలువ గల 6.35 లక్షల లావాదేవీలు ఆర్‌టీజీఎస్‌ ద్వారా జరుగుతున్నాయి. ఈ ఏడాది నవంబరులో ఆర్‌టీజీఎస్‌ ద్వారా జరిగిన సగటు లావాదేవీ రూ.57.96 లక్షలుగా ఉంది. రూ.2 లక్షలకు పైబడిన లావాదేవీలకు ఆర్‌టీజీఎస్‌, అంతకన్నా తక్కువ లావాదేవీలకు నెఫ్ట్‌ ఉపయోగపడతాయి.