మృత్యు విహంగం.. గాల్లో కలిసిపోయిన 337 మంది ప్రాణాలు
గగనతలంలో దర్జా చూపి, ఆధునికతకు, సాంకేతికతకు మారుపేరుగా నిలిచిన బోయింగ్ 737 మాక్స్-8 విమానాలు కనుమరుగు కానున్నాయా? ఈ ప్రశ్నకు ఎక్కువ మంది ఔననే సమాధానం చెపుబుతున్నారు. మాక్స్-8 విమానాల భద్రతపై ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు, ఆందోళనలు రేకెత్తుతున్నాయి.
ఇటీవల ఇథియోపియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 మాక్స్-8 విమానం కూలిపోయిన దుర్ఘటనలో నలుగురు భారతీయులతో సహా 157 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో బోయింగ్ 737 విమానాలను పలు దేశాలు నిషేధం విధించగా, మరికొన్ని దేశాలు వాటిని విమానాశ్రయాలకే పరిమితం చేయాలన్న భావనలో ఉన్నాయి.
నిజానికి అంతర్జాతీయ మార్గాల్లో వేల మైళ్ల ప్రయాణాన్ని అత్యంత సునాయాసంగా పూర్తి చేస్తుందని పేరున్న విమానాల్లో బోయింగ్ 737 మాక్స్-8 ఒకటి. అయితే, ఈ రకం విమానాలు గత ఐదు నెలల్లో కూలిపోవడం ఇది రెండోసారి. ఫలితంగా 337 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
గతేడాది అక్టోబరు నెలలో లయన్ ఎయిర్‌కు చెందిన బోయింగ్ విమానం ఇండోనేషియాలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 180 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈనెల 11వ తేదీన అడిస్‌అబాబా సమీపంలో ఇథియోపియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ మాక్స్-8 కూలిన ఘటనలో 157 మంది ప్రాణాలు విడిచారు. ఈ రెండు ప్రమాదాల తీరు ఒకేలా ఉన్నది.
పైకెగిరిన (టేకాఫ్ అయిన) కొద్దిసేపట్లోనే ఈ రెండు విమానాలు కుప్పకూలాయి. సాంకేతిక సమస్యలు తలెత్తాయని, వెనుకకు వచ్చేందుకు అనుమతించాలని పైలట్లు విజ్ఞప్తి చేసిన కొద్ది క్షణాల్లోనే విషాదం చోటుచేసుకున్నది. ఈ నేపథ్యంలో బోయింగ్ విమానాల భద్రతపై ప్రపంచవ్యాప్తంగా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.