మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 అక్టోబరు 2020 (15:59 IST)

నష్టాలతో సర్వీసులను నడపలేం.. 72 రైళ్లకు ఉద్వాసన??

ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థగా గుర్తింపు పొందిన భారతీయ రైల్వే ఇప్పటివరకు ప్రయాణికుల సేవలో తరించింది. అయితే, మారుతున్న కాలంతో పాటు.. ఈ రైల్వే కూడా వాణిజ్యపరంగా అడుగులు వేస్తోంది. ఫలితంగా కేవలం ఆదాయం ఉన్న మార్గాలపై అధిక దృష్టిసారించింది. పైగా, అరకొరగా ఆదాయం ఉన్న లేక నష్టాల్లో ఉన్న మార్గాల్లో నడుస్తున్న రైలు సర్వీసులను రద్దు చేయాలని భావిస్తోంది. 
 
ఇందులోభాగంగా, దక్షిణ మధ్య రైల్వే ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రైల్వే పరిధిలో నడుస్తున్న 72 రైళ్లకు త్వరలో ఉద్వాసన పలుకనున్నారు. ఆయా రూట్లలో నష్టాలు, ఆక్యుపెన్సీ లేకపోవడం వంటి కారణాలతోపాటు.. ఇతర రైళ్లు, గూడ్సుల రాకపోకలకు ఆటంకాలు ఏర్పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు ఎస్సీఆర్‌ అధికారులు రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపారు. 
 
ఈ రైళ్లన్నీ ఎస్సీఆర్‌ పరిధిలోని సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, నాందేడ్‌, గుంతకల్లు డివిజన్లలో సుదీర్ఘకాలం సేవలందించినవి కావడం గమనార్హం. ఈ నిర్ణయం వల్ల ఆయా రూట్లలో ఇతర ఎక్స్‌ప్రెస్‌, గూడ్స్‌ రైళ్ల వేగం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. 
 
అంతేకాదు.. 47 ప్యాసింజర్‌ రైళ్లను ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చనున్నారు. సబర్బన్‌ సర్వీసులుగా ఉన్న డెమూ, మెమూ రైళ్లను కూడా పూర్తిగా తీసివేసి.. వాటి స్థానంలో మల్టీ మోడల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సిస్టం (ఎంఎంటీఎస్‌) రైళ్లను పరిచయం చేయనున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో డిసెంబరు నెలలో రైళ్ల టైంటేబుల్‌లో భారీ స్థాయిలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. 
 
కాగా, రద్దు కానున్న రైళ్ళ వివరాలను పరిశీలిస్తే, తిరుపతి - పాండిచ్చేరి, విజయవాడ - తెనాలి, తెనాలి - గుంటూరు, విజయవాడ - తెనాలి, విజయవాడ - గుంటూరు, గుంటూరు - ఒంగోలు, గుంటూరు - విజయవాడ, రాజమండ్రి - భీమవరం, భీమవరం - నిడదవోలు, మణుగూరు - కాజీపేట, ఫలక్‌నుమా - భువనగిరి, కలబుర్గీ జంక్షన్ ‌- హైదరాబాద్‌ డెక్కన్‌, కాజీపేట - విజయవాడ, విజయవాడ - పెద్దపల్లి, నంద్యాల హెచ్‌ఎక్స్‌ స్పెషల్‌, గూడూరు - రేణిగుంట జంక్షన్‌, డోన్ ‌- గుంతకల్‌, నిజామాబాద్ ‌- బోధన్‌, మిర్జాపల్లి - బోధన్‌, ఫలక్‌నుమా - ఉందానగర్‌(డెమూ), ఉందానగర్ ‌- సికింద్రాబాద్‌, సికింద్రాబాద్ ‌- మేడ్చల్‌, మేడ్చల్ ‌- ఫలక్‌నుమా, ఫలక్‌నుమా - బోరబండ, ఫలక్‌నుమా - మొయినాబాద్‌, సికింద్రాబాద్ ‌- మొయినాబాద్‌, హైదరాబాద్‌ డెక్కన్ ‌- తాండూరు, విజయవాడ - విశాఖపట్నం, బిట్రగుంట - చెన్నయ్‌ సెంట్రల్‌, తిరుపతి - నెల్లూరు తదితర రైళ్లు రద్దు కానున్నాయి