శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 13 జూన్ 2021 (17:55 IST)

పెట్రో భారం తలనొప్పిగా మారింది... సమస్యను అంగీకరిస్తున్నాం : ధర్మేంద్ర ప్రధాన్

దేశంలో పెట్రోల్, డీజల్ ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ ధరల పెరుగుదలపై ప్రతి ఒక్కరూ గగ్గోలు పెడుతున్నారు. ఈ ధరలకు ఇప్పటికీ అడ్డుకట్ట పడకపోవడం పట్ల కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరణ ఇచ్చారు. పెట్రో ధరలు సమస్యగానే ఉన్నాయని, దీన్ని తాము అంగీకరిస్తున్నామన్నారు. 
 
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలపై పెట్రో ధరల భారం అర్థం చేసుకోగలమని అన్నారు. మే 4వ తేదీ నుంచి ఇప్పటివరకు చమురు ధరలు 23 సార్లు పెరిగిన నేపథ్యంలో, ధర్మేంద్ర ప్రధాన్ పైవిధంగా స్పందించారు.
 
పెట్రో ధరలపై కేంద్రం చర్యలు తీసుకోకపోవడానికి కారణం, సంక్షేమ పథకాలకు నిధులు సర్దుబాటు చేయాల్సి రావడమేనని ఆయన వెల్లడించారు. సంక్షేమ కార్యక్రమాల కోసం నిధులు ఆదా చేస్తున్నందునే పెట్రో ధరల పెంపును ఉపేక్షించాల్సి వస్తోందని వివరణ ఇచ్చారు. 
 
ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సిన్ల కోసమే రూ.35,000 కోట్లు వెచ్చిస్తున్నామని తెలిపారు. ఇలాంటివేళ నిధులు ఆదా చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకే పెట్రో భారంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేక పోతున్నట్టు చెప్పారు. 
 
ఇదిలావుంటే, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ధ్వజమెత్తారు. చమురు ధరల పెంపుపై ఆందోళన వ్యక్తం చేస్తున్న రాహుల్ గాంధీ... కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో చమురు ధరలు తగ్గించాలని అక్కడి సీఎంలను కోరాలని డిమాండ్ చేశారు.