శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 9 జూన్ 2021 (09:36 IST)

దేశంలో చల్లారని పెట్రో మంట... 11న కాంగ్రెస్ ఆందోళన

దేశంలో పెట్రోల్, డీజల్ ధరల పెరుగుదలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఇప్పటివరకు జూన్‌లో ఐదోసారి చమురు కంపెనీలు ధరలను పెంచాయి. ఇప్పటికే రేట్లు ఆల్‌ టైమ్‌ గరిష్ఠానికి చేరుకోగా.. బుధవారం లీటర్‌ పెట్రోల్‌పై 26 పైసలు, డీజిల్‌పై 27 పైసలు పెరిగింది. 
 
ఈ పెరిగిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.95.56కి చేరగా.. డీజిల్‌ ధర రూ.86.47కి చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో పెట్రోల్‌ ధర రూ.102 వైపు పరుగులు పెడుతుండగా.. ప్రస్తుతం రూ.101.76, డీజిల్‌ రూ.93.85 పలుకుతోంది. కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.95.52, డీజిల్‌ రూ.89.32, చెన్నైలో పెట్రోల్‌ రూ.96.94, డీజిల్‌, రూ.96.94కు చేరింది. 
 
ఇక తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.99.32, డీజిల్‌ రూ.94.26.. విజయవాడలో పెట్రోల్‌ రూ.101.55, డీజిల్‌ రూ.95.90కి చేరింది. మే 4వ తేదీ నుంచి ఇప్పటివరకు ఇంధన ధరలు 22వ సార్లు పెరిగాయి. వరుసగా పెరుగుతూ వస్తున్న ధరలతో సామాన్యులు పెట్రోల్‌ బంకుకు వెళ్లాలంటేనే భ‌య‌ప‌డే ప‌రిస్థితులు నెలకొన్నాయి. కరోనా మహమ్మారి సమయంలో రోజురోజుకు పైపైకి వెళ్తున్న ధరలతో జనం బెంబేలెత్తుతున్నారు.
 
మరోవైపు, గత కొద్ది రోజులుగా ఇంధన ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికే ఆల్‌ టైమ్‌ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో పెట్రోల్‌ ధరల పెంపును నిరసిస్తూ ఈ నెల 11న దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. 
 
పార్టీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా పెట్రోల్‌ పంపుల ఎదుట నిరసన చేపడుతారని పార్టీ పేర్కొంది. ఇటీవల ధరల పెరుగుదలపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విరుచుకుపడ్డారు. మహమ్మారి సమయంలో దేశంలో పన్ను వసూళ్ల విపత్తు నిరంతరంగా కొనసాగుతుందని ఆరోపించారు.
 
జూన్‌లో బుధవారం నాటికి చమురు కంపెనీలు ఐదు సార్లు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచాయి. బుధవారం పెంచిన ధరలతో దేశ రాజధానిలో ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయికి చేరుకోగా.. లీటర్‌ పెట్రోల్‌ రూ.95.56, డీజిల్‌ రూ.86.47కి చేరింది. 
 
మే 4వ తేదీ నుంచి ఇప్పటి వరకు చమురు ధరలు 22వ సార్లు పెరిగాయి. రాజస్థాన్‌, మధ్యప్రదేవ్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు లడాఖ్‌లో లీటర్ పెట్రోల్‌ రూ.100 దాటింది. దేశంలో అత్యధికంగా రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో పెట్రోల్‌ రూ.106.39, డీజిల్‌ రూ.99.24కు చేరింది.